తెలంగాణ

telangana

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై తెలుగులో కూడా CAPF కానిస్టేబుల్​ పరీక్ష!

By

Published : Apr 15, 2023, 3:54 PM IST

Updated : Apr 15, 2023, 5:25 PM IST

సీఏపీఎప్​​ కానిస్టేబుల్​ పరీక్ష విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. స్థానిక భాషలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ తెలిపింది

capf constable exams
ప్రాంతీయ భాషల్లో సీఏఫీఎఫ్​ పరీక్షలు

కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో కానిస్టేబుళ్ల కోసం నిర్వహించే పరీక్షలు ఇకపై హిందీ, ఆంగ్లంతో పాటు 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల పరీక్షల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడం, స్థానిక భాషలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ తెలిపింది.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, పంజాబీ, మణిపురి, అస్సామీ తదితర భాషల్లో సీఏపీఎఫ్ కానిస్టేబుళ్ల పరీక్షలను నిర్వహించనున్నారు. 2024 జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని హోం శాఖ తెలిపింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది అభ్యర్థులు తమ మాతృభాష, ప్రాంతీయ భాషలో పరీక్ష రాసేందుకు వీలుంటుందని వెల్లడించింది. దీంతో వారి ఎంపిక అవకాశాలూ మెరుగుపడతాయని పేర్కొంది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో.. ప్రాంతీయ భాషల వినియోగాన్ని, అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖ తెలిపింది.

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని ఇటీవల వివిధ రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ దీనిపై కేంద్ర హోం అమిత్‌ షాకు లేఖ సైతం రాశారు. ఈ క్రమంలోనే తాజా ప్రకటన వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రాంతీయ భాషల వినియోగాన్ని, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. తాజా నిర్ణయం పట్ల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు స్థానిక యువతకు అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వారిని ఈ దిశగా ప్రోత్సహించాలని కోరింది.

కేంద్ర సాయుధ పోలీసు బలగాల పరిధిలో ఏడు విభాగాలు ఉంటాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో- టిబెటన్ బార్డర్ పోలీస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సశస్త్ర సీమాబల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, అస్సాం రైఫిల్స్‌ సీఏపీఎఫ్ పరిధిలోకి వస్తాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ప్రధాన పరీక్షల్లో సీఏపీఎఫ్‌ కానిస్టేబుల్ (జీడీ) ఒకటిగా ఉంది. లక్షలాది మంది అభ్యర్థులు.. దేశం నలుమూలల నుంచి ఈ పరీక్షకు హాజరవుతుంటారు. తాజా నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల యువతకు ఎక్కువ ప్రయోజనం కలగనుంది.

కేంద్రానికి గోవా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు..
కొంకణి భాషలో సీఏఫీఎఫ్​ ఉద్యోగ నియామక పరీక్షలను నిర్వహించడంపై గోవా ముఖ్యమంత్రి.. ప్రమోద్​ సావంత్ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. 13 భాషల్లో పరీక్ష నిర్వహణ నిర్ణయంతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Last Updated :Apr 15, 2023, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details