తెలంగాణ

telangana

భవిష్యత్ కోసం పొదుపు చేయాలా? 50-30-20 సూత్రాన్ని పాటించండి!

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 12:55 PM IST

50/30/20 Budget Rule Explained : మీరు భవిష్యత్ ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. 50-30-20 సూత్రం ఉపయోగించి భవిష్యత్​ను ఎలా ఆర్థికంగా సుస్థిరం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Budgeting basics
50/30/20 Budget Rule Explained

50/30/20 Budget Rule Explained :భవిష్యత్​ సుఖమయంగా ఉండాలంటే, ప్రతి ఒక్కరూ పొదుపు చేయడం తప్పనిసరి. ఇందుకోసం చాలా మంచి సేవింగ్స్ అకౌంట్​ను ఓపెన్ చేస్తూ ఉంటారు. అయితే దీని కంటే ముందు మీరు 50-30-20 సూత్రం గురించి తెలుసుకోవాలి. దీని ద్వారా సరైన మార్గంలో పొదుపు, మదుపు చేసి భవిష్యత్​ను ఆర్థికంగా సుస్థిరం చేసుకోవచ్చు.

నిపుణుల మాట
వాస్తవానికి మనకు వచ్చిన ఆదాయం మొత్తాన్ని ఖర్చు పెట్టేయకూడదు. అవసరాలకు అనుగుణమైన ఖర్చులు చేసి, మిగతాది పొదుపు చేసుకోవాలి. ఇందుకోసం మంచి బడ్జెట్ వేసుకోవాలి. చాలా మంది ఆర్థిక నిపుణులు ఇందుకోసం 50-30-20 సూత్రాన్ని పాటించాలని సూచిస్తున్నారు. ఆదాయ-వ్యయాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని స్పష్టం చేస్తున్నారు.

50-30-20 సూత్రం
మీకు వచ్చిన ఆదాయంలో 50 శాతం మొత్తాన్ని గృహ అవసరాల కోసం కేటాయించాలి. అంటే నిత్యావసరాలు, ఫీజులు, రవాణా, రుణ వాయిదాల చెల్లింపు మొదలైన వాటి కోసం ఉపయోగించాలి. 30 శాతం మొత్తాన్ని వస్తువుల కొనుగోళ్ల కోసం, మీ కుటుంబ సభ్యుల సరదా, సంతోషాల కోసం వాడుకోవాలి. మిగతా 20 శాతం సొమ్మును కచ్చితంగా పొదుపు, మదుపులకు మళ్లించాలి.

ఒక వేళ మీ ఖర్చులకు, అవసరాలకు అధిక మొత్తం అవసరమైతే, ముందుగా చెప్పిన సరదా, సంతోషాల కోసం చేసే ఖర్చులను తగ్గించుకోవాలి. పొదుపు ఖాతాలో జమ చేసిన మొత్తంలో మీ అవసరాలకు తగినంత సొమ్మును ఉంచుకుని, మిగతా డబ్బులను పెట్టుబడులకు మళ్లించాలి.

అత్యవసర నిధి ఏర్పాటు
మన జీవితంలో ఎప్పుడు, ఎలాంటి ఆర్థిక అవసరాలు వస్తాయో చెప్పలేము. కనుక కచ్చితంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. కనీసం 6 నుంచి 12 నెలలకు సరిపోయే డబ్బులను అత్యవసర నిధిగా పెట్టుకోవాలి. అంతేకాదు ఈ మొత్తాన్ని మీ సేవింగ్స్ అకౌంట్లనే వేయాలి. ఒకేసారి అంత పెద్ద మొత్తం నిధిని జమ చేయలేమని అనుకుంటే, మీకు వీలైనంత కనీస మొత్తాలను పొదుపు చేస్తూ వెళ్లండి. అంతేకానీ, మన వల్ల కాదు అని వదిలేయకండి.

జేబులో డబ్బులు ఉండాలి!
నేడు దాదాపు అన్ని రకాల లావాదేవీలు ఆన్​లైన్​లోనే చేసేస్తున్నాం. చేతిలో లేదా జేబులో పెద్దగా డబ్బు ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉండటం లేదు. అయినప్పటికీ మీ దగ్గర నగదు రూపంలో కొంత మొత్తం ఉంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఎంత అనేది మీ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు, అవసరాలను బట్టి మారుతూ ఉంటుంది.

పొదుపు ఖాతా - మినిమం బ్యాలెన్స్
మన దేశంలో మొదటి నుంచి పొదుపు ఖాతాలకు ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంది. నష్టభయం లేని రాబడుల కోసం చాలా మంది ఈ పొదుపు ఖాతాలను తెరుస్తూ ఉంటారు. అయితే మీరు ఎంచుకున్న బ్యాంకు, ఖాతా రకాన్ని బట్టి, ఇందులో ఎంత మొత్తం (మినిమం బ్యాలెన్స్​) పొదుపు చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. సాలరీ అకౌంట్​లో సున్నా (జీరో అమౌంట్) నిల్వ ఉన్నా ఇబ్బందేమీ ఉండదు. మిగతా పొదుపు ఖాతాల విషయానికి వస్తే, కనీసం రూ.500 నుంచి రూ.5 లక్షల వరకూ మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన అకౌంట్​లు ఉంటాయి.

అధిక వడ్డీ వచ్చేలా!
సాధారణంగా సేవింగ్స్ అకౌంట్​లో పొదుపు చేసిన మొత్తంపై చాలా తక్కువ వడ్డీ వస్తుంది. అందుకే ఫ్లెక్సీ డిపాజిట్లు చేయడం మంచిది. దీని వల్ల అటు పొదుపు ఖాతా, ఇటు ఫిక్స్​డ్ డిపాజిట్ల ప్రయోజనాలు రెండూ పొందవచ్చు. అందుకే ఫ్లెక్సీ డిపాజిట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ దగ్గర నెలవారీ ఖర్చులకు, అత్యవసర నిధికి మించి డబ్బు ఉంటే, నష్టభయం లేని లిక్విడ్‌ ఫండ్లు, డెట్‌ ఫండ్లలో పెట్టుబడులు చేయవచ్చు. దీని వల్ల మీకు దీర్ఘకాలంలో మంచి రాబడి చేకూరే అవకాశం ఉంటుంది.

'2024లో భారత్​ జీడీపీ వృద్ధి రేటు 6.8%' - మూడీస్​

మీ హెల్త్ ఇన్సూరెన్స్​ 'క్లెయిమ్' రిజెక్ట్​ అయ్యిందా? సింపుల్​గా కంప్లైంట్​ చేయండిలా!

ABOUT THE AUTHOR

...view details