ఈసీ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ వేయనున్న కేఏ పాల్
KA Paul Sensational Comments on Manda Krishna Madiga : రాష్ట్రంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి కావడంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గుర్తుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ విడుదల చేశారు. ప్రజాశాంతి పార్టీకి ఎలాంటి గుర్తును కేటాయించకపోవడంతో ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రేపు రాష్ట్ర హైకోర్టుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. తమ పార్టీకి గుర్తు కేటాయించకపోవడాన్ని.. అధికార పార్టీ కుట్రగా అభివర్ణించిన ఆయన.. రెండు రోజుల్లో గుర్తు ఇవ్వకపోతే ప్రజలు ఓట్లు వేయొద్దని సూచించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై తీవ్ర ఆరోపణ చేశారు.
పరేడ్ మైదానంలో సభ పెట్టడానికి మందకృష్ణ మాదిగకు రూ. 72కోట్లు ముట్టాయని పాల్ ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీలో చేరమంటే తనను రూ. 25కోట్లు అడిగారని తెలిపారు. ఎంపీ పదవి ఇస్తారనే అయన అమ్ముడు పోయారన్నారు. మోదీని ఘోరమైన తిట్లు తిట్టిన మందకృష్ణ మాదిగకు ఇప్పుడు మోదీ దేవుడయ్యాడా అని ప్రశ్నించారు. చెన్నూరు, జుక్కల్, వేములవాడ, ఉప్పల్, యాకుత్‌పురతో పాటు 13 సెగ్మెంట్లలో తమ అభ్యర్థులు ఉన్నారని పాల్ వివరించారు.