ETV Bharat / state

ఆనందంగా జీవించాలని ఉందమ్మా.. నన్ను ఎలాగైనా బతికించు..!

author img

By

Published : Nov 6, 2022, 9:26 AM IST

Updated : Nov 6, 2022, 10:29 AM IST

అందరితో కలిసి ఆనందంగా జీవించాలని ఉందమ్మా.. నన్ను ఎలాగైనా బతికించు.. ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించమ్మా.. అంటూ కన్నబిడ్డ వేడుకుంటుంటే కన్నతల్లి నిస్సహాయస్థితిలో చేష్టలుడిగి చూస్తోంది. చికిత్స చేయించడానికి కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. పూట గడవడమే గగనంగా మారిన కుటుంబం వారిది. ప్రాణాలు నిలుపుకోవడానికి కూతురు పడుతున్న ఆవేదనను చూసి మాతృమూర్తి హృదయం ద్రవిస్తోంది. మనస్సు తల్లడిల్లుతోంది. కూతురు కోసం ఉన్న ఇంటిని సైతం అమ్మేందుకు సిద్ధపడినా చికిత్సకు అయ్యే వ్యయానికి సరిపోవడం లేదని తల్లి నిరాశలో కూరుకుపోయింది.

Mother Begged to save her Child Life
Mother Begged to save her Child Life

కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన తెలుగు బాల్‌రామ్‌, నాగమణెమ్మ దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు. కూలి పనులు చేస్తూ వచ్చిన డబ్బుతో వీరిలో ముగ్గురికి పెళ్లిళ్లు జరిపించారు. మిగతా ఇద్దరమ్మాయిలను చదివిద్దామనుకున్నారు. అంతలోనే రెండేళ్ల క్రితం చేపలవేటకు వెళ్లిన బాల్‌రామ్‌ వల చుట్టుకొని చెరువులో మునిగి మృతి చెందాడు. భర్త పోయిన బాధను దిగమింగుకొని ఇద్దరమ్మాయిలను ఆమె చదివిస్తుండగా.. ఉన్నట్లుండి 17 ఏళ్ల చిన్న కుమార్తె సరితకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆస్పత్రికి తీసుకెళ్తే రెండు కిడ్నీలు పాడయ్యాయని, వాటిని మారిస్తే తప్ప సరితకు బతుకులేదని వైద్యులు తేల్చిచెప్పారు. ఇప్పటికే కుమార్తె వైద్యం కోసం బంధువుల వద్ద రూ.7 లక్షల వరకు ఆ తల్లి అప్పు చేసింది.

దాతలు ముందుకు వస్తేనే..: కిడ్నీ దాతలు ముందుకు వస్తేనే తప్ప సరితకు జీవితం లేననట్లుగా పరిస్థితి తయారైంది. కుటుంబ సభ్యులు కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చినా సరిత రక్తం ఓ’ పాజిటివ్‌ కావడంతో వారిలో ఎవ్వరిదీ కూడా సరిపోవడం లేదు. కిడ్నీ మార్పిడిచేసే వరకైనా ఆరోగ్యంగా ఉండేందుకు వైద్యులు మందులు వాడాలని సూచించారు. ప్రతి నెలా మందుల కొనుగోలుకు సుమారు 10వేల వరకు ఖర్చవుతోంది. డబ్బుల్లేక రెండు నెలలుగా మందులు సైతం కొనలేని దుస్థితి ఎదురవుతోంది.
కాళ్లపై పడి ఏడ్చింది: అక్కా.. నన్ను ఎలాగైనా బతికించు అంటూ నా కాళ్లపై పడి ఏడ్చిందని సరిత అక్క ఇంద్రజ తెలిపారు. ఎలా తనను కాపాడుకోవాలో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

మార్పిడి చేస్తే తప్ప బతకడం కష్టం..? కళ్లెదుటే కన్నకూతురి జీవితం ముగిసిపోతోందని తెలుసుకున్న తల్లి నాగమణెమ్మ దాతల సాయం కోసం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తన కిడ్నీని ఇచ్చి కూతురును కాపాడుకోవాలని అనుకున్నా ఆమె కిడ్నీ కూతురుకు సరిపోవడం లేదు. ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలనుకుంటే కూలికి వెళ్తే తప్ప రోజు గడవని పరిస్థితి.

హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కుమార్తెను తల్లి ఇంటికి తీసుకువచ్చేసింది. వారంలో రెండు, మూడుసార్లు డయాలసిస్‌ చేయించాల్సి రావడంతో వనపర్తిలో ఓ గదిని అద్దెకు తీసుకొని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లేది. అద్దె చెల్లించలేని పరిస్థితి ఎదురవగా యజమాని ఇల్లు ఖాళీచేయించడంతో సొంత గ్రామానికి వచ్చేశారు. డయాలసిస్‌, మందుల ఖర్చులకు నెలకు కనీసం 30వేల వరకు ఖర్చవుతోంది. సరిత అక్క మౌనిక చదువుకుంటూనే చెల్లి మందులకు అవసరమైన డబ్బు సంపాదించేందుకు హైదరాబాద్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తోంది.

..

నాబిడ్డ ప్రాణాలు నిలబెట్టండి: గత ఏడాదే పదో తరగతిలో 9.8 గ్రేడ్‌ పాయింట్లతో పాసైన సరిత అందరిలా కళాశాలలో చేరి ఉన్నత చదువులు చదవాలనుకున్నా ఆరోగ్యం సహకరించడం లేదు. కూలిచేస్తే తప్ప అయిదువేళ్లు నోట్లోకి వెళ్లలేని పరిస్థితి మాది. పనులకు వెళ్లాలన్న ఇంటిలో ఉన్న కుమార్తెకు ఎప్పుడేం జరుగుతుందోననే భయం ఆందోళనకు గురిచేస్తోంది. దాతలు, సహృదయులు స్పందించి నా బిడ్డ ప్రాణాలు నిలబెట్టాలని చేతులు జోడించి వేడుకుంటున్నా. - నాగమణెమ్మ, తల్లి

ఇవీ చదవండి:

Last Updated :Nov 6, 2022, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.