ETV Bharat / state

ధ్రువపత్రమిచ్చినా అంగీకరించరు.. రెండో పెళ్లి చేసుకోలేదని నిరూపించేదెలా..?

author img

By

Published : Nov 6, 2022, 7:06 AM IST

భర్త చనిపోయిన 70 ఏళ్ల వృద్ధురాలు తాను రెండో పెళ్లి చేసుకోలేదని నిరూపించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతోంది. ఆమె పునర్వివాహం చేసుకోలేదని గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ పత్రమిచ్చినా, అధికారులు పట్టించుకోకుండా తిప్పుతున్నారు. హనుమకొండ జిల్లా రంగశాయిపేటకు చెందిన ఓ వృద్ధురాలు ఈ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

70 years old woman
70 years old woman

భర్త చనిపోయిన 70 ఏళ్ల వృద్ధురాలు తాను మళ్లీ వివాహం చేసుకోలేదని నిరూపించుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. హనుమకొండ జిల్లా కాజీపేట దర్గారోడ్డులోని ఈపీఎఫ్‌ కార్యాలయంలో ఓ వృద్ధ వితంతువు ఆరు నెలలుగా ఇబ్బందిపడుతోంది. ఆమె పునర్వివాహం చేసుకోలేదని గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ పత్రమిచ్చినా.. అధికారులు పట్టించుకోకుండా తిప్పుతున్నారు.

హనుమకొండ జిల్లా రంగశాయిపేటకు చెందిన వృద్ధురాలు రంగు అరుణ ఈ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బాధితురాలి కుమారుడు మోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అరుణ భర్త ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేశారు. గతేడాది కొవిడ్‌తో మరణించారు. ఈపీఎఫ్‌లో ఖాతా ఉండటంతో నామినీ అయిన మృతుడి భార్య అరుణ పింఛనుకు దరఖాస్తు చేసుకున్నారు.

ఇందులో పునర్వివాహం చేసుకోలేదని ధ్రువీకరించే పత్రాన్ని ఒక గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌తో సంతకం చేయించి సమర్పించారు. అయితే అది చెల్లదని, ఇంకా పైస్థాయి అధికారి సంతకం కావాలన్నారు. ముందుగా గెజిటెడ్‌ అధికారి సంతకం కావాలన్నారని, తర్వాత కొర్రీలు వేస్తున్నారని.. బ్యాంకు ఖాతా కూడా చెల్లదంటూ ఇబ్బంది పెడుతున్నారని మోహన్‌, ఆయన తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఈపీఎఫ్‌ అధికారులను వివరణ కోరగా.. నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే పింఛను మంజూరు చేస్తామన్నారు. అది సరిగ్గా లేకుంటే పింఛన్ ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.