ETV Bharat / bharat

కాంగ్రెస్‌ గడీలపై కమలం కన్ను.. కంచుకోటను కదిలించేనా?

author img

By

Published : Nov 6, 2022, 8:34 AM IST

gujarat assembly elections
gujarat assembly elections

Gujarat Assembly Elections : గుజరాత్​లో వరుసగా ఆరుసార్లు ప్రభుత్వాలు నడిపిన భాజపా కన్ను.. కాంగ్రెస్​ గడీలపై పడింది. కాంగ్రెస్​ బలంగా ఉన్న ప్రాంతాల్లో పాగా వేయాలని చూస్తోంది. దీనికి తోడు ఆప్​ పోటీలో ఉండడం.. అధికార పార్టీకి మరింత కలిసొచ్చే అంశం. అయినా కాంగ్రెస్​ కంచుకోటను భాజపా బద్దలు కొట్టలేదని విశ్లేషకుల మాట.

Gujarat Assembly Elections : దాదాపు మూడు దశాబ్దాలుగా గుజరాత్‌లో విజయకేతనం ఎగురవేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఇంకా పూర్తి స్థాయిలో పట్టు దొరకలేదు. ఆదివాసీయులు అధికంగా ఉన్న స్థానాల్లో ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీదే ఆధిక్యం. ఇతర ప్రాంతాల్లో హస్తం బలం తగ్గిపోతున్నా ఇక్కడ మాత్రం గట్టిగానే వెళ్లూనుకుంది. అయితే, ఈ దఫా ఎస్టీ రిజర్వు స్థానాల్లో సత్తా చాటుకునేందుకు కమల దళం సరికొత్త వ్యూహాలు రచిస్తోంది.

తూర్పు గుజరాత్‌లోని 27 ఎస్టీ రిజర్వు సీట్లలో కనీసం 20 చోట్ల పాగా వేయాలనే పట్టుదలతో భాజపా ఉంది. దీనికోసం క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులను మోహరించి ప్రత్యేక దృష్టితో పనిచేస్తోంది. ప్రధాని మోదీకున్న ప్రజాదరణ, భాజపా ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలు తమ లక్ష్యానికి కలిసి వచ్చే అంశాలుగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) రాష్ట్రంలో పోటీ చేస్తుండడం వల్ల గిరిజన ప్రాంతాల్లోని కాంగ్రెస్‌ సంప్రదాయ ఓట్లలో చీలిక తప్పదని, ఇది తమకు అనుకూలిస్తుందని కమలనాథులు ఆశిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో బలహీనంగా ఉన్నప్పటికీ ఆదివాసీయుల ప్రాంతాల్లో కాంగ్రెస్‌ బలం చెక్కుచెదరలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గిరిజనుల్లో పట్టున్న స్థానిక చిన్న పార్టీల నేతలతో సీట్ల సర్దుబాటుకు ఆప్‌ ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. భారతీయ ట్రైబల్‌ పార్టీ (బీటీపీ) నాయకులు కాంగ్రెస్‌తో పొత్తుకే మొగ్గుచూపుతున్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం గుజరాత్‌లో ఎస్టీలు 89.17 లక్షలు. రాష్ట్ర మొత్తం జనాభాలో వీరు 15శాతం. గిరిజనుల్లో అత్యధికులు రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నారు. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యాన్ని దెబ్బతీయాలని 2002 నుంచి భాజపా ప్రయత్నిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో కనీసం 20 స్థానాల్లో విజయం సాధించాలన్న ఆ పార్టీ లక్ష్యం నెరవేరుతుందో లేదో వేచి చూడాల్సిందే.

.

ఇవీ చదవండి : గుజరాత్ పీఠం భాజపాదే.. రెండో స్థానంలో ఆప్​.. ఆసక్తికరంగా ప్రీ-పోల్ సర్వే

హిమాచలంలో రాచరికం నెగ్గేనా? మార్పు వస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.