కేసీఆర్ పోలీసులతో బెదిరించి - నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారు : కిషన్‌రెడ్డి

కేసీఆర్ పోలీసులతో బెదిరించి - నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారు : కిషన్‌రెడ్డి
Kishan Reddy Comments on Nomination Withdraws : గడిచిన పదేళ్లలో తెలంగాణకు బానిస బతుకులు, దోపిడి పాలన మాత్రమే మిగిలిందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలనపై అసహ్యం ఏర్పడిందని.. ఈ నిరంకుశపాలనను ప్రజలు అంతమొందించాలని నిర్ణయించుకున్నారని దుయ్యబట్టారు.
Kishan Reddy Comments on Nomination Withdraws : కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని.. బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. పలుచోట్ల అభ్యర్థులను పోలీసులతో బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. గజ్వేల్‌లో కేసీఆర్‌పై 114 మంది ధరణి బాధితులు నామినేషన్లు వేశారని, కామారెడ్డిలో 58 మంది ధరణి బాధితులు నామినేషన్లు వేశారని పేర్కొన్నారు.
Telangana Assembly Elections 2023 : బీజేపీ తరఫున 39 మంది బీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్(Congress Party) పార్టీ 22 మంది బీసీలకు మాత్రమే టికెట్లు ఇచ్చిందని, బీఆర్‌ఎస్ 23 మంది బీసీలకు మాత్రమే టికెట్ ఇచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ మాత్రమే బీసీల గురించి ఆలోచిస్తోందన్నారు. రెండు జనరల్ స్థానాల్లో ఇద్దరు ఎస్సీలకు టికెట్లు ఇచ్చామన్నారు. గజ్వేల్‌లో ఈటల పోటీ చేస్తారని అనగానే కేసీఆర్ భయపడ్డారని ఎద్దేవా చేశారు.
గజ్వేల్‌లో ఓడిపోతాననే భయంతో.. కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల్లో కేసీఆర్ ఓడిపోతారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఓడిపోకూడదని.. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపారని ఆరోపించారు. తండ్రి, కొడుకులు.. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు ఈ ఎన్నికల్లో ఓడిపోతారని జోస్యం చెప్పారు. తెలంగాణ తెచ్చుకుంది.. కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసేందుకు కాదన్నారు.
కేసీఆర్ కూడా ప్రధానిగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రచార ప్రసంగాలలో పస లేదని.. బలవంతంగా ప్రజలను సభలకు తీసుకెళుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం బీసీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ చెబుతున్నారని.. నరేంద్ర మోదీ పాలనకు భవిష్యత్తు లేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు.
BJP Election Campaign : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అరు నెలలకో ఒక ముఖ్యమంత్రి అవుతారని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే మూడు నెలలకు ఒక ప్రధాని మారుతారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినవని.. రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన కలిపి బీసీలకు 39సీట్లు కేటాయించామన్నారు. 17 తేదీన సాయంత్రం అమిత్ షా రాష్ట్రానికి వస్తారన్నారు. 18న గద్వాల్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారని తెలిపారు.
"కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే నష్టమే తప్ప.. లాభం లేదు. రాష్ట్రంలో వ్యవస్థీకృతమైన మార్పు బీజేపీతోనే సాధ్యం. రాష్ట్రంలో గత పది రోజులుగా బీజేపీకి అనుకూల వాతావరణం నెలకొంది. బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ హామీలతో ప్రజల మద్ధతు లభిస్తోంది. బీఆర్‌ఎస్‌కు ప్రధానమైన పోటీ బీజేపే". - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
