ETV Bharat / state

'కాళేశ్వరం అట్టర్‌ ఫ్లాప్‌ - ప్రాజెక్టు భవిష్యత్​పై తెలంగాణ సమాజం ఆందోళన'

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 2:02 PM IST

BJP Leaders Inspected Medigadda Barrage : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. కాసుల కోసం, కమీషన్ల కోసం కక్కుర్తిపడి తెలంగాణ సొమ్మును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ కుంగిన పిల్లర్లను పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు.

Kishanreddy
Kishanreddy

కాళేశ్వరంపై తెలంగాణ సమాజమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది

BJP Leaders Inspected Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీని బీజేపీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (BJP State President Kishan Reddy)నేతృత్వంలోని పార్టీ నేతలు పిల్లర్లను పరిశీలించి.. కుంగడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరాన్ని పరిశీలించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్రానికి ఇచ్చిందని చెప్పారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోకుండా మాట్లాడకూడదని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించామని వివరించారు.

కాళేశ్వరానికి అసలేమైంది, మొన్న మేడిగడ్డ, నేడు అన్నారం బ్యారేజీ దిగువన రెండు చోట్ల బుంగలు

Kishan Reddy Comments on Kaleshwaram Issue : నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (National Dam Safety Authority) నివేదికలో కీలక అంశాలు పొందుపర్చారని కిషన్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజల పన్నులతో కాళేశ్వరం నిర్మాణం చేసిందని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40,000 కోట్ల అంచనా వేశారని.. తర్వాత రూ.1.30 లక్షల కోట్లకు పెంచారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

కాళేశ్వరంపై తెలంగాణ సమాజమంతా ఆందోళన వ్యక్తం చేస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. ఇంజినీర్ల నోరు మూయించి కేసీఆరే ఇంజినీర్‌గా వ్యవహరించారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తే 15 నిమిషాల్లో సీబీఐ విచారణ చేస్తుందని.. కానీ కేసీఆర్ ఎందుకు ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శనలో కిషన్‌రెడ్డి వెంట ఎంపీ లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, తదితరులు ఉన్నారు.

"నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరాన్ని పరిశీలించింది. కాళేశ్వరంపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదికను కేంద్రానికి ఇచ్చింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదికలో కీలక అంశాలు పొందుపర్చారు. కాళేశ్వరం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పన్నులతో కాళేశ్వరం నిర్మాణం చేసింది." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

అన్నారం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర డ్యాంసేఫ్టీ బృందం

Kishan Reddy on Medigadda Barrage Incident : కేసీఆర్ ప్రభుత్వ చేపట్టిన ప్రాజెక్టులు, విధానాలపై రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కిషన్‌ రెడ్డి అన్నారు. ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. నిపుణులు చెప్పినా వినకుండా కేసీఆర్ ఇంజినీర్‌గా మారి కట్టిన ప్రాజెక్టు.. ఇప్పుడు గుదిబండగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ధర్నా రాలేదని లేదని, పరిస్థితిని సమీక్ష చేసేందుకు వచ్చామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ప్రపంచంలో అతిపెద్ద అవినీతి ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిపోనుందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం 29 అంశాలను అడిగిన దానికి సమాధానం చెప్పడానికి సమయం ఉండదని.. ఎన్నికల్లో ఓట్లు ఎలా పొందాలనే విషయంపైనే ప్రత్యేక దృష్టి పెడుతారని ఆరోపించారు. కాళేశ్వరానికి వచ్చేందుకు కేసీఆర్‌, హరీశ్ రావు ఎందుకు భయపడుతున్నారని రఘునందన్‌రావు ప్రశ్నించారు.

మేడిగడ్డ వంతెనపై బారికేడ్ల ఏర్పాటు అన్నారం సీపేజీ సమస్య నివారణకు దిల్లీ నుంచి నిపుణుల బృందం

'కాళేశ్వరంలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూశా, ప్రాజెక్టు పేరుతో బీఆర్​ఎస్​ లక్ష కోట్ల దోపిడీకి పాల్పడింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.