తెలంగాణ

telangana

Telangana Rains 2023 : సినుకు సినుకు సితారే.. వాగూవంకా పొంగేనే

By

Published : Jul 27, 2023, 7:17 AM IST

Rains in Telangana : హైదరాబాద్‌ సహా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరికలతో.. జీహెచ్​ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లోనూ జోరువానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాకపోకలు నిలిచిపోయి మారుమూల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Hyderabad Rains
Hyderabad Rains

భాగ్యనగరంలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు

Heavy Rains in Telangana :రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.హైదరాబాద్​లో రాత్రంతా వర్షం కురిసింది. భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చెప్పడంతో ఏం జరుగుతుంతోనని భయపడిన నగరవాసులు.. తేలికపాటి వర్షం పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. భాగ్యనగరంలో వానలకు, చలికి నగరవాసులు గజగజలాడిపోతున్నారు. వర్షానికి తోడు ఉష్ట్రోగ్రతలు పడిపోవడంతో నగరంలో చలి వాతావరణం కనిపిస్తోంది. వర్షాలు కూడా ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో నగరవాసులు నానుతున్నారు.

Hyderabad Rains Today :హైదరాబాద్‌ వ్యాప్తంగా ముసురు కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలతో పాటు పలుచోట్ల రహదారులపై నీళ్లు నిలిచాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. రాత్రి ఒంటి గంట వరకు టోలిచౌకిలో అత్యధికంగా 10.1, బండ్లగూడ 2.6, కత్బుల్లాపూర్‌లో1.7, రాజేంద్రనగర్‌లో 1.9 సెంటిమీటర్ల వర్షం పడింది.

Telangana Rains :వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలతో ఆర్డీఎఫ్, బీహెచ్​ఎంసీ బృందాలు.. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపట్టాయి. జంట జలాశయాల నుంచి మూసీకి వస్తున్న వరదనీటితో ఇబ్బందులు కలగకుండా పరివాహక ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సాయంతో బల్దియా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జీహెచ్​ఎంసీ మేయర్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ పోలీసులను ఆదేశించారు. కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్‌లో సూచనలు చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లోనూ జోరువర్షాలు కురుస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం అతలాకుతలమవుతోంది. గోదావరి ప్రవాహంతో గోదావరి ఖనిలోని గంగానగర్, సప్తగిరికాలనీ, న్యూ పోరట్‌పల్లి, మల్కాపూర్‌లో వరదనీరు చేరుతోంది. సింగరేణి ఓపెన్ కాస్ట్-5 ప్రాజెక్ట్, ఎఫ్​సీఐ నుంచి వస్తున్నవరద నీరు విఠల్‌నగర్‌ ఇళ్లలోకి చేరి ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. సబ్బితంలోని గౌరీగుండాల జలపాతం వద్ద నీటమునిగి కరీంనగర్‌ కిసాన్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌ప్రసాద్‌ అనే వ్యక్తి మృతిచెందాడు.

Adilabad Traffic in Rain :కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో లెవెల్ వంతెనలపై భారీగా నీరు ప్రవహించడంతో.. మారుమూల గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. వాంకిడి మండలం కిరిడీలో.. రోడ్లపై వర్షపు నీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేట పంచాయతీలోని పాటి గ్రామానికి చెందిన గర్భిణిని ఎర్రవాగు దాటించడంలో కష్టాలు ఎదురయ్యాయి. వాగు అవతల అంబులెన్స్ బురదలో చిక్కుకోవడంతో స్థానికుల సాయంతో అంబులెన్స్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. జైపూర్ మండలంలోని పెగడపల్లి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తుండటంతో.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలోని వనరుల చెరువు, రాయరావు చెరువు నిండుకుండలా మారింది. పచ్చని కొండల నడుమ అలుగు పారుతూ చెరువు ఆహ్లాదాన్ని పంచుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details