ETV Bharat / spiritual

శుక్రవారం నారద జయంతి- ఈ పనులు చేస్తే తెలివితేటలు, సంగీత జ్ఞానం మీ సొంతం! - Narada Jayanti 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 7:19 PM IST

Narada Jayanti 2024 : శ్రీహరికి పరమ భక్తుడుగా, ఎప్పుడు నారాయణ నామాన్ని జపిస్తూ ముల్లోకాలు తిరుగుతూ కలహభోజనుడిగా పేరొందిన శ్రీ నారద మహర్షి జయంతి మే 24 న జరుపుకుంటారు. ఈ సందర్భంగా నారద జయంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? ఈ రోజు చేసే దానాల వలన కలిగే ఫలితాలేమిటో తెలుసుకుందాం.

Narada Jayanti 2024
Narada Jayanti 2024 (GettyImages)

Narada Jayanti 2024 : సకలశాస్త్ర పారంగతుడు, సంగీత కోవిదుడు అయిన నారదుడు వైశాఖ బహుళ విదియ రోజు అవతరించారు. పురాణాల ప్రకారం నారదుడు బ్రహ్మ మానస పుత్రుడని తెలుస్తోంది. శుక్రవారం ఆయన జయంతి. ఈ సందర్భంగా నారదుడి గురించి తెలుసుకుందాం.

కలహభోజనుడు
నారద మహర్షికి కలహ భోజనుడని కూడా పేరు ఉంది. నారదుడు ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అంటూ ముల్లోకాలు తిరుగుతూ అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చేరవేస్తూ ఉండేవాడు. నారదుని కారణంగా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి మధ్య కొన్నిసార్లు కలహాలు కూడా జరిగేవి.

లోకకల్యాణ కారకుడు
కలహ భోజనుడు అని నారదుని పిలిచినప్పటికీ నారదుడు సృష్టించే కలహాలన్నీ లోకకల్యాణానికి కారణమయ్యేవి. నారదుడు పెట్టిన కలహం కారణంగానే శ్రీమహాలక్ష్మి వైకుంఠం వీడి కొల్హాపురికి చేరుకుంటుంది. లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీ మహా విష్ణువు భూమిపైకి వచ్చి కలియుగం ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి భక్తుల పాలిట కొంగు బంగారమయ్యి కోనేటి రాయుడయ్యాడు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. అందుకే నారదుడు త్రిలోకంలో పూజనీయుడయ్యాడు.

నారద మహర్షి రచనలు
నారదుడు నారాయణ భక్తుడే కాదు, గొప్ప పండితుడు కూడా! ఆయన రచించిన నారద పురాణం ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంధం. నారదుడు రచించిన 84 సూత్రాలుతో కూడిన నారదభక్తి సూత్రాలు ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో విశిష్టమైనవి. ఇందులో పరిపూర్ణమైన భక్తి లక్షణాలు ఏమిటి, అది ఎన్ని రూపాలుగా ఉంటుంది, దాన్ని సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, భక్తి మార్గంలో ఎదురయ్యే పరీక్షలు ఏమిటి అనే విషయాలను పొందుపరిచారు.

నారద జయంతి రోజు నారదుని ఎలా పూజించాలి?

  • నారద జయంతిని విష్ణు భక్తులు ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు విష్ణు భక్తులు బ్రాహ్మీ ముహూర్తంలో పవిత్రమైన నదీ స్నానం చేసి శుచియై నారద మహర్షి గౌరవార్థం ఉపవాసం ఉంటానని సంకల్పించుకోవాలి.
  • కొంతమంది ఇంట్లో నారద మహర్షి చిత్రపటాన్ని ఉంచి పూజిస్తారు. కొంతమంది నారదుడు శ్రీ మహావిష్ణువు భక్తుడు కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రాన్ని పూజిస్తారు.
  • నారద మహర్షి పూజను స్వచ్ఛమైన హృదయంతో పవిత్రమైన మనస్సుతో చేయాలని చెబుతారు.
  • నారద మహర్షి పూజా సమయంలో ఆవు నేతితో దీపారాధన చేసి తులసి, మందార పూలతో పూజించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. సాయంత్రం తిరిగి దేవతార్చన చేసి ఉపవాసాన్ని విరమించాలి.

నారద జయంతి రోజు ఈ దానాలు చేయడం శ్రేష్టం
నారద జయంతి రోజు శ్రేష్ఠమైన బ్రాహ్మణ బ్రహ్మచారులకు భోజనం పెట్టడం, వస్త్ర దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. నారద మహర్షి వాద్య సంగీతానికి ప్రధానమైన వీణను ఆవిష్కరించినట్లుగా చెబుతారు. అందుకే ఈ రోజు నారద మహర్షిని స్మరిస్తూ వీణను దానం చేస్తే సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. అలాగే శ్రీకృష్ణుని ఆలయంలో కృష్ణుడికి వేణువు కూడా భక్తితో సమర్పించడం ఆనవాయితీ.

నారద పూజామహత్యం

నారద జయంతి రోజు నారదుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సంగీత జ్ఞానం, తెలివితేటలు వృద్ధి చెందుతాయని విశ్వాసం. నారద జయంతి రోజు నారాయణ నామ స్మరణం చేసినా, విష్ణుసహస్రనామ పారాయణ చేసినా కలిగే ఫలం అనంతం. ఈ రోజు నారదుని పూజించినా, శ్రీ మహావిష్ణువును పూజించినా శ్రీ మహావిష్ణువు సంతసించి ఐహిక భాగాలు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనుగ్రహించి అంత్యమున మోక్షం పొందుతారని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వరం ఇచ్చాడు.
ఇంత విశిష్టమైన నారదముని అవతరించిన రోజు కూడా మనకెంతో ప్రత్యేకమే కదా! ఈ రోజు, భక్తి యోగానికి ప్రతీక అయిన నారద మహర్షిని స్మరించుకుందాం. భక్తి జ్ఞానాలను పొందుదాం.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

వెంకన్న పేరు చెబితేనే అన్నమయ్య చిన్నప్పుడు తినేవాడట- తిరుమలలోనే శేష జీవితమంతా! - Annamayya Jayanthi 2024

విష్ణుమూర్తి కూర్మావతారం వెనుక కారణమేంటి? కూర్మ జయంతి రోజు ఏం చేయాలి? - Kurma Jayanti 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.