ETV Bharat / spiritual

వెంకన్న పేరు చెబితేనే అన్నమయ్య చిన్నప్పుడు తినేవాడట- తిరుమలలోనే శేష జీవితమంతా! - Annamayya Jayanthi 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 5:16 AM IST

Annamayya Life Story In Telugu : కోనేటిరాయుడికి అక్షర నీరాజనం అందించిన పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య జయంతి సందర్భంగా అన్నమయ్య జీవిత విశేషాలు గురించి ప్రత్యేక కథనం.

Annamayya Jayanthi 2024
Annamayya Jayanthi 2024 (Source : ETV Bharat)

Annamayya Life Story In Telugu : తిరుమల శ్రీనివాసునిపై దాదాపు 32 వేల సంకీర్తనలు రచించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో జన్మించాడని శ్రీవైష్ణవ సంప్రదాయంలో నమ్మకం ఉంది.

అన్నమయ్య జననం
అన్నమయ్య తండ్రి నారాయణసూరి, తల్లి లక్కమాంబ. నారాయణ సూరి గొప్ప పండితుడు. లక్కమాంబ చెన్నకేశవ స్వామికి మహా భక్తురాలు. ఆమె మధురంగా పాడుతుంది. ఈమెతో కడప జిల్లాలోని మాడువూరులో చెన్నకేశవస్వామి ప్రత్యక్షంగా మాట్లాడేవాడట. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు. మొక్కని దైవం లేదు.

ఒకసారి తిరుమల వెంకన్నను దర్శించుకోడానికి తిరుమలకు వెళ్లి స్వామి ఎదుట సాష్టాంగ నమస్కారం చేయగా ఆ సమయంలో శ్రీనివాసుని చేతిలోని ఖడ్గం నుంచి దివ్య కాంతి పుంజం లక్కమాంబ గర్భంలోకి ప్రవేశించిందంట! అనంతరం లక్కమాంబ గర్భం ధరించి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు పండంటి మగ బిడ్డను ప్రసవించింది. ఆ పసి బిడ్డే అన్నమయ్య.

తిరుమల ప్రయాణం
చిన్ననాటి నుంచి అన్నమయ్య వెంకన్న పేరు చెబితే కానీ ఉగ్గుపాలు కూడా తాగేవాడు కాదంట. అలా చిన్నప్పుడు మొదలైన భక్తి అన్నమయ్యతో పాటు పెరిగి పెద్దదయింది. చెరువు కట్టలమీద చేరి చెట్టుమీద పిట్టలతో గొంతు కలిపేవాడు. ఒకసారి అన్నమయ్య గడ్డి కోసుకురావడానికి అడవికి వెళ్లగా పొరపాటున చెయ్యి తెగి రక్తం కారుతుండగా మైకం వచ్చి కళ్లు తిరిగి పడిపోతాడు. తర్వాత వచ్చిన పని మర్చిపోయి తిరుమలకు వెళుతున్న భక్త బృందంతో కలిసి గోవిందా! గోవిందా అంటూ తిరుమలకు బయల్దేరాడు.

అలమేలుమంగమ్మ సాక్షాత్కారం
కొండకు బయలుదేరిన అన్నమయ్య ఎన్ని రోజులైనా కొండకు చేరలేక పోతాడు. ఆహారపానీయాలు లేక మైకం కమ్మి ఉన్న సమయంలో ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని తినిపించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని చెబుతుంది. ఆ సమయంలో అన్నమయ్య పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ శ్రీ వేంకటేశ్వర శతకము రచించాడు.

వెంకన్న తొలి దర్శనం
తిరుమల శిఖరాలు చేరుకున్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. అనంతరం సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీనివాసుని దివ్య దర్శనం చేసుకున్నాడు. తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకుంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ వైష్ణవ మతాన్ని స్వీకరించి తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.

వివాహం
అన్నమయ్య నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. తిమ్మక్క, అక్కమ్మ అనే ఇద్దరినీ వివాహం చేసుకుంటాడు అన్నమయ్య. తన ఇద్దరు భార్యలతో కలిసి తిరుమలను దర్శించిన అన్నమయ్య ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. ఆనాటి నుంచి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు కీర్తిస్తుండగా ఆయన శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలపై నిక్షిప్తం చేయసాగారు.

తీర్థయాత్రలు
అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్థయాత్రలకు బయలుదేరి తొలుత చెన్నకేశవ స్వామిని దర్శించుకొని తర్వాత ఎన్నో క్షేత్రాలు తిరుగుతూ నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు.

రాజాశ్రయం
శ్రీకృష్ణదేవరాయలుకు తాత సాళ్వ నరసింగరాయలు అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విని తాళ్లపాకకు వెళ్లి అన్నమయ్యను దర్శించి అతడితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. తరువాత పెనుగొండ రాజయ్యాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడ దేశంలో హరిదాస కూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్క కీర్తనను వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందుకు, కోపించి రాజు అతన్ని చెరసాలలో సంకెళ్లలో ఉంచారట.

అవసానదశ
రాజుల ప్రాపకం సరికాదని తలచి అన్నమయ్య తిరిగి తిరుమలకు చేరుకున్నాడు.తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడుపుతూ ఎక్కువగా ఆధ్యాత్మిక సంకీర్తనలు రచించాడు. అన్నమయ్య తన అవసానదశలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలిచి, ప్రతిరోజూ ఒక సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.

నిర్యాణం
95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు పరమపదించాడు. రాగి రేకులపై వ్రాసిన తిధుల ఆధారంగా 1503 ఫిబ్రవరి 23న అన్నమయ్య నిర్యాణం చెందినట్లుగా తెలుస్తుంది.

శ్రీనివాసునికి అంకితమైన జీవితం
అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమ భక్తుడు అన్నమయ్య. అన్నమయ్య రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారం, వేదాంతం ఎంతో మనోహరంగా సామాన్యులు సైతం సులువుగా పాడుకునే రీతిలో ఉంటాయి. ఆ రోజుల్లోనే అంటరానితనం కూడదని తందనానా కీర్తనలో వివరించిన అన్నమయ్య మనవాడు మన తెలుగువాడు అని చెప్పుకోవడం మనకెంతో గర్వకారణం

తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతిఏటా అన్నమయ్య జయంతి ఉత్సవాలను ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అన్నమయ్య జయంతి రోజు అన్నమయ్య కీర్తనలు పాడుకొని, శ్రీనివాసునికి భక్తి పూర్వక అక్షర నీరాజనం సమర్పిద్దాం. బ్రహమొక్కటే! పరబ్రహ్మమొక్కటే!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

జాతకంలో ఇబ్బందులా? రావిచెట్టుకు గురువారం ఇలా పూజిస్తే అన్నీ క్లియర్! - Vaisakha Pournami 2024

బుద్ధ పూర్ణిమ విశిష్టత ఏంటి? ఆ రోజు ఏం చేయాలి? దీపాలు వెలిగించాలా? - Buddha Purnima 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.