ETV Bharat / spiritual

జాతకంలో ఇబ్బందులా? రావిచెట్టుకు గురువారం ఇలా పూజిస్తే అన్నీ క్లియర్! - Vaisakha Pournami 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 4:31 PM IST

Vaisakha Pournami Significance : హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం పూర్ణిమ తిథికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక సంవత్సరంలో వచ్చే నాలుగు పూర్ణిమలు శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనవి. అవి మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ. ఈ నెల 23వ తేదీ వైశాఖ శుద్ధ పూర్ణిమ సందర్భంగా జాతకంలో చెడు ప్రభావాలను పోగొట్టుకోవడానికి ఎలాంటి పూజలు, పరిహారాలు చేయాలనే విషయాలను తెలుసుకుందాం.

Vaisakha Pournami 2024
Vaisakha Pournami 2024 (Source : Getty Images)

Vaisakha Pournami Significance : వైశాఖ పౌర్ణమి శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువు రావి చెట్టుపై నివసిస్తారని శాస్త్రం చెబుతోంది. అందుకే శ్రీహరికి ఇష్టమైన వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి పూజిస్తే అనేక శుభ ఫలితాలు ఉంటాయి. అంతేకాదు రావి చెట్టును పూజిస్తే పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారని శాస్త్రం చెబుతోంది.

వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టు పూజతో చేకూరే శుభఫలితాలు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే శని, బృహస్పతి గ్రహాల అనుకూలత ఉండాలి. వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టును పూజిస్తే శని, బృహస్పతుల అనుగ్రహంతో శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తారని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు.

  • తెల్లవారుఝామునే నిద్ర లేచి రావి చెట్టుకు నీళ్లు పోసి, నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే రావి చెట్టులో నివసించే ముక్కోటి దేవతలు, బ్రహ్మవిష్ణుమహేశ్వరులు సంతసించి పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు.
  • సూర్యోదయ సమయంలో రావి చెట్టుపై పితృదేవతలు నివసిస్తారట. అందుకే ఆ సమయంలో రావి చెట్టుకు నీళ్లు కలిపిన పాలు, నల్ల నువ్వులు బెల్లం కలిపి నైవేద్యంగా పెడితే పితృదేవతల అనుగ్రహంతో సకల శ్రేయస్సు, వంశాభివృద్ధి కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.
  • సూర్యోదయం తర్వాత రెండు ఘడియలు పూర్తయ్యాక రావి చెట్టులో శ్రీ మహాలక్ష్మి దేవి కొలువై ఉంటుంది. ఆ సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలతో పూజలు చేసి ఆవు నేతితో దీపారాధన చేస్తే దారిద్య్ర బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.
  • సాధారణంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు శుభకార్యాలు విశేషంగా జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు మొదలుపెట్టే ముందు రావి చెట్టుకు పూజించి ప్రదక్షిణలు చేసిన తర్వాత శుభకార్యాలు ప్రారంభిస్తే కార్యాలలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి.
  • జాతక రీత్యా ఎవరికైనా వితంతు యోగం ఉంటే ముందుగా రావి చెట్టుతో వివాహం జరిపించి తర్వాత వరుడితో వివాహం జరిపిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో జాతకంలో దోషం పోయి దీర్ఘ సుమంగళిగా ఉంటారని విశ్వాసం.
  • జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని అష్టమ శని వంటి దోషాలు ఉన్నట్లయితే సూర్యాస్తమయం సమయంలో రావి చెట్టుకు నీరు పోసి, నువ్వుల నూనెతో దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేస్తే శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు.
  • వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు గంగా నదీ స్నానం చేస్తే విశేషమైన ఫలం ఉంటుంది. అలాగే ఈరోజు చేసే దానధర్మాలకు, పూజలకు మామూలు కన్నా కోటి రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్రవచనం.

వృక్షాలను దేవతా స్వరూపంగా భావించి పూజించడం హిందూ సంప్రదాయంలో భాగం. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ సమయంలో పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టుకు భక్తి పూర్వకమైన మనసుతో, సద్బుద్ధితో ఆచరించే పూజ మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మన పెద్దలు, జ్యోతిష శాస్త్రవేత్తలు సూచించిన పరిహారాలు పాటించి శుభఫలితాలను పొందుదాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. శుభం భూయాత్!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

బుద్ధ పూర్ణిమ విశిష్టత ఏంటి? ఆ రోజు ఏం చేయాలి? దీపాలు వెలిగించాలా? - Buddha Purnima 2024

కోర్టు సమస్యలు, తీరని కష్టాలా? నరసింహ జయంతి రోజు ఇలా చేస్తే అంతా సెట్​! - Narasimha Jayanti 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.