ETV Bharat / spiritual

విష్ణుమూర్తి కూర్మావతారం వెనుక కారణమేంటి? కూర్మ జయంతి రోజు ఏం చేయాలి? - Kurma Jayanti 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 5:01 AM IST

Kurma Jayanti Significance : శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండో అవతారం శ్రీ కూర్మావతారం. ఈ ఏడాది మే 23వ తేదీ వైశాఖ శుద్ధ పౌర్ణమి కూర్మ జయంతి సందర్భంగా మహావిష్ణువు కూర్మావతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది? ఆ అవతార విశేషాలేమిటి? కూర్మ జయంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం.

Kurma Jayanti 2024
Kurma Jayanti 2024 (Source : Getty Images)

Kurma Jayanti Significance : ఒకసారి దేవేంద్రుడు గర్వంతో దూర్వాస మహర్షి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడు. అందుకు కోపించిన దూర్వాసుడు దేవతలంతా శక్తి హీనులవుతారని శపిస్తాడు. ఆనాటి నుంచి దేవతలు శక్తి హీనులై చివరకు దానవుల చేతిలో యుద్ధంలో ఓడిపోతారు. చివరకు దేవతలంతా శ్రీ మహా విష్ణువుకు మొరపెట్టుకోగా విష్ణుమూర్తి ఔషధాలు నిలయమైన క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సాధించమని ఉపాయం చెబుతాడు.

క్షీరసాగర మధనం
అప్పుడు దేవతలు ఆ సమయంలో తమకన్నా బలవంతులుగా ఉన్న దానవులతో సంధి చేసుకుని వచ్చిన అమృతాన్ని కలిసి పంచుకోవాలని ఒప్పందానికి వచ్చి క్షీరసాగరాన్ని మధించడం మొదలు పెడతారు. మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని, వాసుకిని త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెడతారు. కానీ మంధర పర్వతం బరువుకి సముద్రంలో మునిగి పోసాగింది. చివరకు అమృతోత్పాదనం సాధించలేని కార్యంగా మిగిలిపోతుంది.

అవతార స్వీకరణ
దేవ దానవులు అమృతం సాధించడం కష్టంగా మారిన సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును అనగా తాబేలు రూపం ధరించి మంధర పర్వతం మునిగిపోకుండా తన వీపుపై మోస్తాడు.

ఉద్భవించిన భయంకర గరళం
శ్రీ మహావిష్ణువు సహకారంతో క్షీరసాగర మధనం నిరాటంకంగా కొనసాగింది. ఈ మధనంలో ముందుగా లోకాలను నాశనం చేసే హాలాహలం పుడుతుంది. సర్వమంగళా దేవి అనుమతితో ఆ పరమ శివుడు హాలాహలాన్ని మ్రింగి లోకాలను రక్షిస్తాడు. ఆ గరళాన్ని తన కంఠంలోనే నిలుపుకొని ఆనాటి నుంచి శివుడు గరళకంఠుడు అయ్యాడు.

శుభాలనిచ్చే అద్భుతాలు
హాలాహలం తర్వాత క్షీర సాగరం నుంచి వరుసగా మధువు, అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతము, చంద్రుడు మొదలగు శుభాలనిచ్చే అద్భుతాలు పుడతాయి.

శ్రీలక్ష్మీ జననం
క్షీర సాగరం నుంచి గొప్ప శుభ లక్షణాలతో శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది. ఆ సమయంలో సకల దేవతలు లక్ష్మీదేవిని అర్చించి, కానుకలు సమర్పిస్తారు. దేవేంద్రుడు శ్రీ మహాలక్ష్మిని కీర్తిస్తూ చేసిన మహాలక్ష్మి అష్టకం నేటికీ ఐశ్వర్యం కోరుకునేవారు ప్రతి శుక్రవారం పఠించడం ఆనవాయితీగా మారింది.

అమృతం తెచ్చిన ధన్వంతరి
చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. శ్రీ మహా విష్ణువు మోహిని అవతారంలో అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కేలా చేస్తాడు.

కూర్మ జయంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి?
కూర్మ జయంతి రోజున విష్ణు భక్తులు ఉపవాసం ఉంటారు. అలాగే ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ నారాయణ భజనలు, కీర్తనలు చేస్తూ జాగారం చేస్తారు. శ్రీమహావిష్ణువును భక్తితో, శ్రద్ధలతో పూజిస్తారు. కూర్మ జయంతి వ్రతం నియమనిష్ఠలతో చేసినవారికి జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో సకల విజయాలు, శ్రేయస్సు కలుగుతాయి.

ఆలయాల్లో పూజలు
కూర్మ జయంతి రోజున దేశవ్యాప్తంగా ఉన్న విష్ణు దేవాలయాలలో ప్రత్యేక పూజలు మరియు వేడుకలు జరుగుతాయి. కూర్మ జయంతి నాడు భక్తులు సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శించి, విశేష పూజలలో పాల్గొంటారు. కూర్మ జయంతి రోజు బ్రాహ్మణులకు తమ శక్తి కొద్దీ విరివిగా దానధర్మాలు ఆచరిస్తే మోక్షం కలుగుతుందని విశ్వాసం.

శ్రీకూర్మం
ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం పట్టణానికి 15 కి.మీ. దూరంలో శ్రీకూర్మం అనే పుణ్య క్షేత్రం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే. కూర్మ జయంతి రోజు ఈ ఆలయానికి దేశవిదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. శ్రీ కూర్మ జయంతి రోజున శ్రీ మహావిష్ణువు కూర్మావతార కథను చదివినా విన్న సకల శుభాలు చేకూరుతాయని శాస్త్ర వచనం. ఓం నమో నారాయణాయ నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

జాతకంలో ఇబ్బందులా? రావిచెట్టుకు గురువారం ఇలా పూజిస్తే అన్నీ క్లియర్! - Vaisakha Pournami 2024

బుద్ధ పూర్ణిమ విశిష్టత ఏంటి? ఆ రోజు ఏం చేయాలి? దీపాలు వెలిగించాలా? - Buddha Purnima 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.