తెలంగాణ

telangana

ఈ ఏడాది.. 'నైరుతి'లోనే కుండపోత వర్షాలు!

By

Published : Jul 21, 2022, 9:39 AM IST

Heavy rains and floods in TS:తెలంగాణ మొన్నటి వరకు భారీ వర్షాలు కురిశాయి. ఈనెల 9 నుంచి 14 వరకు 100 నుంచి 1000 శాతం ఎక్కువ వానలు పడ్డాయి. గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో వర్షపాతం పెరుగుతోంది. ఈ ఏడాది ‘నైరుతి’లోనే కుండపోత వర్షాలు పడ్డాయని టీఎస్‌డీపీఎస్‌ విశ్లేషణనిచ్చింది.
Heavy rains and floods in telangana
Heavy rains and floods in telangana

Heavy rains and floods in TS: రాష్ట్రంలో గత మూడు దశాబ్దాలుగా వర్షపాతం క్రమంగా పెరుగుతోంది. ఈశాన్య రుతుపవనాల్లో పెద్దగా మార్పులు లేకున్నా.. ‘నైరుతి’లో వర్షపాతం పెరుగుతోంది. ఇందులోనూ జూన్‌, జులై, ఆగస్టు నెలల వర్షపాతంలో పెద్దగా మార్పు లేదు. సెప్టెంబరులో మాత్రం ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. 1951 నుంచి 2021 వరకు విశ్లేషించగా.. 17 ఏళ్లు అధిక వర్షపాతం నమోదైంది. 36 ఏళ్లు సాధారణ వర్షపాతం, 18 ఏళ్లు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. 1951 నుంచి 1989 వరకు వర్షపాతంలో చెప్పుకోదగిన మార్పులు లేవు. 1990 నుంచి 2022 వరకు కొంత మార్పులు చోటుచేసుకున్నాయి. గత ఏడాది, అంతకు ముందు సంవత్సరం రాష్ట్రంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షం కురవడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర సాధారణ వర్షపాతం 906 మిల్లీమీటర్లు కావడం గమనార్హం. రాష్ట్రంలో 70 ఏళ్ల వాతావరణ పరిస్థితులను రాష్ట్ర ప్రణాళికాశాఖకు చెందిన రాష్ట్ర విపత్తు ప్రణాళిక, నిర్వహణ సొసైటీ(టీఎస్‌డీపీఎస్‌) విశ్లేషించింది. 1951 నుంచి ఈ ఏడాది జులై 14వ తేదీ వరకు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై సమగ్ర సంకలనాన్ని రూపొందించింది.

జీహెచ్‌ఎంసీలో పెరుగుదల:కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో గత 32 ఏళ్లలో వర్షపాతం స్వల్పంగా పెరిగింది. 2004-05 నుంచి 2019-20 వరకు విశ్లేషించగా.. నైరుతి రుతుపవనాలతో పాటు వార్షిక వర్షపాతం హైదరాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పెరుగుతుండగా.. నిర్మల్‌, మంచిర్యాల, మెదక్‌, సూర్యాపేట జిల్లాల్లో తగ్గుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 85 నుంచి 110 మిల్లీమీటర్ల మేరకు పెరుగుదల ఉంది. జీహెచ్‌ఎంసీలోనూ మధ్య, తూర్పు మండలాల్లో పెరుగుదల ఉండగా.. పటాన్‌చెరు, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్‌, ఆల్వాల్‌, మల్కాజిగిరి మండలాల్లో తగ్గుదల ఉంది.

అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో 82 రోజుల వాన:నైరుతి రుతుపవనాల వల్ల ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కువ రోజులు వర్షం కురుస్తోంది. ఏడాదిలో సగటున భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో 82 రోజులు, ములుగులో 76, కుమురంభీం జిల్లాలో 74 రోజులు వర్షం కురుస్తోంది. వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, నల్గొండ జిల్లాల్లో వర్షం కురిసే రోజులు తక్కువగా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో కేవలం 46 రోజులు వర్షాలు పడుతుండగా.. వనపర్తి, హైదరాబాద్‌లలో 52 రోజులు పడుతోంది. ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో అత్యధికంగా ఏడాదికి సగటున 55 రోజులు, నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలంలో 22 రోజులే పడుతోంది.

ఆరు రోజులు తడిసిముద్ద..ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు కురిసిన వానలతో రాష్ట్రం తడిసిముద్దయింది. అన్ని జిల్లాల్లో సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 33 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు కాగా మిగిలిన అన్ని జిల్లాల్లో వంద నుంచి వెయ్యి శాతం ఎక్కువ నమోదు కావడం గమనార్హం. నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల, కరీంనగర్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం వరదలకు కారణమైంది. ఇటీవల ఒక్కరోజే కుమురంభీం జిల్లా జైనూరులో అత్యధికంగా 391 మిల్లీమీటర్లు, కెరమెరిలో 384, సిర్పూర్‌(యు)లో 352 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలో 329 మి.మీ, భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 347, కాటారంలో 344, కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో 304 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆరు రోజుల్లో నిర్మల్‌ జిల్లాలో అత్యధికంగా 593.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే ఇది పది రెట్లకంటే ఎక్కువ కావడం గమనార్హం.


ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details