ETV Bharat / state

పోలీసుల కన్నుగప్పి సినీ ఫక్కీలో పిన్నెల్లి పరార్‌! - ముమ్మరంగా గాలింపు - MACHERLA MLA PINNELLI ESCAPED

author img

By ETV Bharat Telangana Team

Published : May 23, 2024, 9:07 AM IST

AP MLA Pinnelli Escaped From Police : ఏపీలో పోలింగ్‌ రోజున ఈవీఎంను ధ్వంసం చేసి, అడ్డొచ్చిన వారిపై దాడులకు పాల్పడి విధ్వంసానికి పాల్పడిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. పిన్నెల్లిని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో హైడ్రామా నెలకొంది. ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి సమీపంలో వేచి ఉండటం బయటికి వచ్చిన కారును వెంబడించడం, కొంతదూరం వెళ్లాక ఆగిపోయిన కారులో పిన్నెల్లి కనిపించకపోవడం, అందులో ఉన్న డ్రైవర్, గన్‌మ్యాన్‌ పొసగని సమాధానాలు ఇవ్వడం అంతా సినీ ఫక్కీని తలపించింది. పక్కా ప్రణాళికతో ఆయన పారిపోయినట్లు నిర్ధారణకు వచ్చిన ఏపీ పోలీసులు ఆయన్ను పట్టుకునేందుకు వేట కొనసాగిస్తున్నారు.

AP MLA Pinnelli Ramakrishna Escaped
AP MLA Pinnelli Escaped From Police (ETV Bharat)

పోలీసుల కన్నుగప్పి సినీ ఫక్కీలో పిన్నెల్లి పరార్‌ (ETV Bharat)

AP MLA Pinnelli Ramakrishna Escaped From Police : ఏపీలో పోలింగ్‌ రోజున మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు. పోలింగ్‌ రోజున జరిగిన ఘటనల్లో కేసు అవుతుందని గ్రహించిన ఆయన తన సోదరుడు వెంకటరామిరెడ్డితో కలిసి హైదరాబాద్‌ అదే రోజు చేరుకున్నట్లు తెలుస్తోంది. కేబీహెచ్‌బీలోని ఇందూ విల్లాస్‌లో ఉన్న తన నివాసంలో రామకృష్ణారెడ్డి , ఆయన సోదరుడు గచ్చిబౌలిలోని మరో ఇంట్లో ఉంటున్నారని విశ్వసనీయ సమాచారం ప్రకారం.

ఈవీఎం ధ్వంసంపై పోలింగ్‌ రోజే గురజాల పోలీసులు కేసు నమోదు చేసినా మంగళవారం దానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు బహిర్గతం కావడంతో కలకలం రేగింది. రామకృష్ణారెడ్డి తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన కోసం గాలింపులు మొదలుపెట్టారు. ఫోన్‌ ఆధారంగా ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తెలుసుకొని బుధవారం ఉదయం గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం ఇందూ విల్లాస్‌కు చేరుకుంది.

AP MLA Pinnelli EVM Destroy Issue : పిన్నెల్లి కారు ఆయన ఇంటి నుంచి బయటకు రావడంతో పోలీసులు దాన్ని అనుసరించారు. హైదరాబాద్‌ నుంచి 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా వేగంగా వెళుతుండంతో ఏపీ పోలీసులు సంగారెడ్డి జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో సంగారెడ్డి పోలీసులు జాతీయ రహదారిపై కంది కూడలి వద్ద కాపు కాశారు. తాత్కాలిక చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేను పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే హైవేపై ముందుకెళితే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉందని భావించిన పిన్నెల్లి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు పటాన్‌చెరు దాటిన తర్వాత రుద్రారం వైపు కొద్దిదూరం వెళ్లి గణేష్‌తండా వద్ద ఆగింది.

ఏపీలో ఈవీఎం ధ్యంసం కేసులో పిన్నెల్లి అరెస్ట్ - EC Orders To AP CEO MUKESH KUMAR

దాన్ని అనుసరిస్తూ వచ్చిన ఏపీ పోలీసులు కారులో డ్రైవర్, గన్‌మ్యాన్‌ మాత్రమే కనిపించడం, వారి వద్ద పిన్నెల్లి ఫోన్‌ ఉండటంతో ఆశ్చర్యపోయారు. వారిద్దర్నీ విచారించడంతో కారు ఆగగానే ఫోన్‌ తమకిచ్చిన పిన్నెల్లి డివైడర్‌ దాటి రోడ్డుకు అటువైపు వెళ్లారని, అప్పటికే అక్కడ మరో వాహనం సిద్ధంగా ఉందని, అందులో ఎక్కి హైదరాబాద్‌ వైపు వెళ్లిపోయారని వివరించారు. వారిద్దర్నీ అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు సంగారెడ్డి సీసీఎస్‌కు తరలించారు. దాదాపు అర గంటపాటు వారిని అక్కడ విచారించి అనంతరం తమతో తీసుకెళ్లారు.

పోలీసులు వెంటాడుతున్నా ముందున్న కారులో నుంచి దిగి, రోడ్డు దాటి, మరోవైపునకు వెళ్లి, అక్కడ నుంచి పారిపోవడం ఎంతవరకు సాధ్యమన్నది అంతు పట్టుడంలేదు. దీనిపై పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు తాము వెంటాడిన కారులో పిన్నెల్లి లేరనే భావిస్తున్నారు. పిన్నెల్లి ఫోన్‌ ఆధారంగా ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు ఏపీ పోలీసులు పసిగట్టారే తప్ప ఆయన్ని వారు చూడలేదు. జాతీయ రహదారిపై ఆయన కారును అనుసరించారు.

చివరకు కారును, అందులో డ్రైవర్, గన్‌మ్యాన్‌లను పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పిన్నెల్లి ముందుగానే హైదరాబాద్‌ నుంచి పరారయ్యారని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే తన ఫోన్‌ను ఇంట్లో వదిలేసి వెళ్లారని, పోలీసుల రాకను గమనించి ఆయన డ్రైవర్, గన్‌మ్యాన్‌లను తన కారులో వెళ్లిపోవాలని ముందుగానే సూచించి ఉంటారని, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా కారును గుర్తించిన ఏపీ పోలీసులు ఆ కారును అనుసరిస్తూ వెళ్లారని తెలుస్తోంది. అంతేతప్ప ఆ కారులో అసలు పిన్నెల్లి లేరని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఈ వ్యూహం రచించి ఉంటారని అనుమానిస్తున్నారు.

వాస్తవానికి మంగళవారమే పిన్నెల్లి తన సోదరుడితో కలిసి హైదరాబాద్‌ నుంచి తమిళనాడుకు పారిపోయి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఏపీ పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్, గన్‌మ్యాన్‌లు నోరు విప్పితే తప్ప అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పిన్నెల్లి సమీప బంధువులు, సన్నిహితుల ఇళ్లలో పోలీసులు గాలిస్తున్నారు.

పారిపోవాలనుకున్న ఏపీ ఎమ్మెల్యే పిన్నెల్లి - ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు? - YSRCP MLA Pinnelli Arrest

బరితెగించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి - వీధిరౌడీని తలదన్నేలా ఈవీఎం ధ్వంసం - MLA Pinnelli EVM Destroy Issue

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.