ETV Bharat / state

గుడ్​న్యూస్ - కొత్తగూడెం టు మణుగూరు రైల్వే కోల్‌ కారిడార్‌కు లైన్ క్లియర్ - Railway Coal Corridor in Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : May 23, 2024, 9:22 AM IST

Central Govt Green Signal to Railway Coal Corridor : తెలంగాణలో రైల్వే కోల్‌ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాలను కలుపుతూ రామగుండం నుంచి మణుగూరు వరకు దీనిని నిర్మించనున్నారు. ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

Railway Coal Corridor in Telangana
Railway Coal Corridor in Telangana (ETV Bharat)

Railway Coal Corridor in Telangana 2024 : రాష్ట్రంలో సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాలను కలుపుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక ‘రైల్వే బొగ్గు రవాణా నడవా’ (రైల్వే కోల్‌ కారిడార్‌) ఏర్పాటు చేసేందుకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణలో 207.80 కిలో మీటర్ల మేర ఈ కారిడార్‌ విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్‌గేజ్‌ నిర్మించాలని, అందుకు తక్షణమే జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భూసేకరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులకు రైల్వే మంత్రిత్వశాఖ ఆదేశాలిచ్చింది. ఈ ఉత్తర్వులు మంగళవారం అర్ధరాత్రి వెలువడ్డాయి.

అంచనా వ్యయం రూ.2,911 కోట్లు : కేంద్ర ప్రభుత్వం మణుగూరు-రామగుండం ప్రాజెక్టు ప్రాథమిక పనులకు 2013-14 బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించింది. అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఆ తర్వాత ఏర్పడిన తెలంగాణ సర్కార్ రాష్ట్ర వాటా నిధులు భరించేందుకు ఆసక్తి చూపకపోవడంతో ముందడుగు పడలేదని తెలుస్తోంది. సరకు రవాణాకు మంచి మార్గం కావడం, ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందన్న అంచనాతో ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని భరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నిర్ణయానికి ప్రధాని కార్యాలయం గత సంవత్సరం ఆమోదం తెలిపింది. 2013-14లో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,112 కోట్లు కాగా, ఇప్పుడు రూ.2,911 కోట్లకు పెరిగింది.

తగ్గనున్న బొగ్గు రవాణా వ్యయం : తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ఉన్న 26 భూగర్భ, 20 ఉపరితల గనుల ద్వారా ఏటా 65 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. సింగరేణి సంస్థ ఏటా రూ.వందల కోట్లను కేవలం బొగ్గు రవాణాకే వెచ్చిస్తోంది. ప్రస్తుతం బల్లార్షా నుంచి ఖమ్మం ప్రాంతానికి హనుమకొండ జిల్లా కాజీపేట మీదుగా 349 కిలో మీటర్ల రైల్వే మార్గం ఉంది. రామగుండం-మణుగూరు లైను నిర్మిస్తే దాదాపు 142 కిలో మీటర్ల దూరం తగ్గడమే కాకుండా బొగ్గు రవాణా వ్యయం తగ్గుతుంది. ఈ రైలు మార్గంతో మేడారం, కోటగుళ్లు, కాళేశ్వరం, రామప్ప, మంథని వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు, లక్నవరం చెరువు, బొగత జలపాతం వంటి జలపర్యాటక ప్రదేశాలు అనుసంధానమవుతాయి.

త్వరలో కొత్త బొగ్గు గనుల వేలం - కొనుగోలు చేయాలనే యోచనలో సింగరేణి - Coal Blocks Auction 2024

పాతికేళ్ల తర్వాత కొలిక్కి : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్‌ నుంచి మంథని, భూపాలపల్లి, ములుగు మీదుగా మణుగూరు వరకు రైల్వే లైన్‌ నిర్మాణం కోసం 25 సంవత్సరాల క్రితం 1999లోనే అడుగు పడింది. ప్రస్తుతం భూసేకరణ కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడంతో వారం రోజుల్లో రైల్వే ఇంజినీరింగ్‌ విభాగం సర్వే చేపట్టి సాధ్యాసాధ్యాలను రైల్వేశాఖకు నివేదిస్తుంది. అనంతరం భూసేకరణ సర్వే చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తారు.

సింగరేణిలో బొగ్గు తరలింపుపై సందిగ్ధత - కేంద్రం ఆదేశాల అమలుకూ విఘాతం - Singareni coal transportation issue

సింగరేణిలో సరికొత్త చిన్న యంత్రం- తగ్గిపోయిన కార్మికుల శ్రమ, సమయం - Coal tub cleaning machine

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.