తెలంగాణ

telangana

ఎడారిలో విశ్వ సాకర్‌ సమరానికి సిద్ధం.. ఇక నెల రోజు కిక్కే కిక్కు!

By

Published : Nov 12, 2022, 9:57 AM IST

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఆటలో.. అత్యున్నత టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. మరో ఎనిమిది రోజుల్లో విశ్వ సాకర్‌ సమరానికి తెరలేవనుంది. ఈ నెల 20న ఖతార్‌లో ఫిఫా ప్రపంచకప్‌ ఆరంభమవుతుంది. దాదాపు నెల రోజుల పాటు ఇక కిక్కే కిక్కు!

Foot ball worldcup 2022
ఎడారిలో విశ్వ సాకర్‌ సమరానికి సిద్ధం.. ఇక నెల రోజు కిక్కే కిక్కు

మైదానంలో సాగిపోతున్న బంతితో పాటు పయనించే కళ్లు.. గోల్‌పోస్టులోకి బంతి చేరగానే కేరింతలతో ఎగిరే కాళ్లు.. మొత్తానికి మనసును ఫుట్‌బాల్‌కు అప్పగించే రోజులు మళ్లీ వస్తున్నాయి!

ప్రత్యర్థులకు బంతి చిక్కకుండా డ్రిబ్లింగ్‌ చేస్తూ.. ఊహకు అందని రీతిలో గోల్స్‌ కొడుతూ.. కట్టిపడేసే ఆటగాళ్లు.. ఆటకు మించి నటనతో అదరగొట్టే మహా నటులు.. ఇక సందడే సందడి!

ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ వచ్చేస్తోంది! మరో ఎనిమిది రోజుల్లో విశ్వ సాకర్‌ సమరానికి తెరలేవనుంది. 32 జట్లు.. ఒక్క కప్పు. అటు మైదానంలో పోటీ.. ఇటు అభిమానులకు కిక్కు. ఇక మాయలో పడేందుకు సిద్ధమైపోండి!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఆటలో.. అత్యున్నత టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 20న ఖతార్‌లో ఫిఫా ప్రపంచకప్‌ ఆరంభమవుతుంది. దాదాపు నెల రోజుల పాటు ఇక కిక్కే కిక్కు! ఖతార్‌ జాతీయ దినోత్సవమైన వచ్చే నెల 18న ఫైనల్‌ జరుగుతుంది. ఆ దేశం తొలిసారి ఈ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తోంది. అక్కడ అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తప్పించుకోవడం కోసం శీతాకాలంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. దీంతో మే, జూన్‌ లేదా జులైలో జరగని తొలి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌గా ఇది నిలవబోతోంది.

కప్పు దిశగా..: అర్హత టోర్నీలు దాటి.. నిలకడైన ప్రదర్శనతో మెప్పించి.. మొత్తం 32 జట్లు ఈ మెగా టోర్నీలో పోటీపడేందుకు అర్హత సాధించాయి. ఈ జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు. రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో గ్రూప్‌లోని ప్రతి జట్టూ.. మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. మొత్తం 16 జట్లు ప్రిక్వార్టర్స్‌లో తలపడతాయి. అక్కడి నుంచి క్వార్టర్స్‌, సెమీస్‌, ఫైనల్‌ వరుసగా జరుగుతాయి. అయిదు నగరాల్లోని ఎనిమిది స్టేడియాల్లో కలిపి మొత్తం 64 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అక్కడి అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం ఈ స్టేడియాలన్నింటిలోనూ ఏసీలు ఏర్పాటు చేశారు. ఖతార్‌, ఈక్వెడార్‌ మధ్య తొలి పోరు జరుగుతుంది. ఎక్కువ వ్యయంతో, తక్కువ రోజుల్లో ముగిసే ప్రపంచకప్‌ ఇదే.

* ఇది 22వ ప్రపంచకప్‌. 1930లో ఆరంభమైన ఈ టోర్నీ 1942, 1946 (రెండో ప్రపంచ యుద్ధం కారణంగా జరగలేదు) మినహాయిస్తే ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతోంది.

* బ్రెజిల్‌ అత్యధికంగా అయిదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. జర్మనీ, ఇటలీ నాలుగేసి సార్లు కప్పు ముద్దాడాయి. అర్జెంటీనా, ఫ్రాన్స్‌, ఉరుగ్వే తలో రెండు సార్లు విజేతగా అవతరించాయి. ఇంగ్లాండ్‌, స్పెయిన్‌ ఒక్కోసారి జయకేతనం ఎగురవేశాయి. 2018లో ఫ్రాన్స్‌ గెలిచింది.

గ్రూప్‌-ఎ

ఖతార్‌, ఈక్వెడార్‌, సెనెగల్‌, నెదర్లాండ్స్‌

గ్రూప్‌-బి

ఇంగ్లాండ్‌, ఇరాన్‌, అమెరికా, వేల్స్‌

గ్రూప్‌-సి

అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలెండ్‌

గ్రూప్‌-డి

ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, డెన్మార్క్‌, ట్యునీసియా

గ్రూప్‌-ఈ

స్పెయిన్‌, కోస్టారికా, జర్మనీ, జపాన్‌

గ్రూప్‌-ఎఫ్‌

బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా

గ్రూప్‌-జి

బ్రెజిల్‌, సెర్బియా, స్విట్జర్లాండ్‌, కామెరూన్‌

గ్రూప్‌-హెచ్‌

పోర్చుగల్‌, ఘనా, ఉరుగ్వే, దక్షిణ కొరియా

1958 తర్వాత మళ్లీ వేల్స్‌ ప్రపంచకప్‌లో కనిపించనుంది. కెనడా 36 ఏళ్ల తర్వాత తిరిగి ఆడనుంది. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఇటలీ వరుసగా రెండోసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు.

ఇటలీ (1934) తర్వాత ఆతిథ్య హోదాలో టోర్నీలో అరంగేట్రం చేస్తున్న తొలి జట్టు ఖతార్‌. ఈ ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిస్తున్న తొలి మధ్యప్రాచ్య దేశం, మొదటి అరబ్‌ దేశం కూడా అదే. ఆసియాలో టోర్నీ జరగడం రెండోసారి.

ఇదీ చూడండి:ఆటలో, ఆలోచనలో మార్పు రావాలి.. ప్రక్షాళనతోనే సాధ్యం!

ABOUT THE AUTHOR

...view details