ETV Bharat / sports

ఆటలో, ఆలోచనలో మార్పు రావాలి.. ప్రక్షాళనతోనే సాధ్యం!

author img

By

Published : Nov 12, 2022, 7:15 AM IST

t20 worldcup 2022
టీ20 ప్రపంచ కప్​ 2022

ఎన్నో ఆశలతో ప్రపంచకప్‌ గడప తొక్కడం.. ఏదో ఒక దశలో ఉస్సూరుమంటూ వెనక్కి రావడం.. దశాబ్ద కాలంగా ఇదే వరస! 2007-2011 మధ్య నాలుగేళ్ల వ్యవధిలో టీ20, వన్డే ప్రపంచకప్‌లు గెలిచి అభిమానులను పరవశంలో ముంచెత్తిన భారత క్రికెట్‌ జట్టు రెండు ఫార్మాట్లలో కలిపి గత పదేళ్లలో ఏడు ప్రపంచకప్‌లు ఆడి ఒక్కదాంట్లోనూ టైటిల్‌ సాధించలేకపోయింది.

ఒకప్పుడు టైటిల్‌కు హాట్‌ ఫేవరెట్‌గా భావించే జట్టును కాస్తా.. ఈ మధ్య ఫేవరెట్లలో ఒకటిగా పరిగణించడానికి సొంత అభిమానులే సంకోచిస్తున్నారు. అలా అని మన దగ్గర ప్రతిభ లేదా అంటే అలా ఏమీ కాదు. ప్రపంచంలో మరే దేశానికీ లేనంత క్రికెట్‌ ప్రతిభ మన సొంతం. పెద్ద క్రికెట్‌ వ్యవస్థా ఉంది. కానీ సరైన ప్రణాళిక, దృక్పథం లేక ఐసీసీ ఈవెంట్లలో తిరోగమనంలో పయనిస్తోంది టీమ్‌ఇండియా. ఆటలో, ఆలోచనలో కొన్ని కీలక మార్పులు జరిగితే తప్ప సమీప భవిష్యత్తులో భారత జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడడం కష్టం.

గత 15 నెలల కాలంలో మూడు సందర్భాల్లో రెండు వేర్వేరు భారత జట్లు ఒకే సమయంలో వేర్వేరు దేశాల్లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాయి. ద్వితీయ శ్రేణి అనుకున్న జట్లే మూడు సందర్భాల్లోనూ సిరీస్‌లు సాధించాయి. మన దగ్గర క్రికెట్‌ ప్రతిభ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది రుజువు. కానీ ఇంత ప్రతిభ ఉన్నా ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నీలు వచ్చినపుడు ప్రదర్శన అంతంతమాత్రంగా ఉంది. ఐపీఎల్‌ రాకతో ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. వస్తూనే ఉన్నారు.

ఈ లీగ్‌ భారత క్రికెట్‌కు ఎంతో మేలు చేసిందన్నది వాస్తవం. కానీ ఈ లీగ్‌ మొదలవడానికి ముందే టీ20 ప్రపంచకప్‌ సాధించిన భారత్‌.. అది ఆరంభమయ్యాక ఒక్కసారి కూడా పొట్టి కప్పును అందుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆర్థిక బలంతో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తూ.. ప్రపంచకప్పుల్లో పేలవ ప్రదర్శన చేస్తుండటం భారత క్రికెట్‌ ప్రతిష్టను దెబ్బ తీస్తోంది. ఈ నేపథ్యంలో ఒక ప్రక్షాళన చేపడితే తప్ప పరిస్థితి మారేలా లేదు.

కావాలి ఇంగ్లీష్‌ ఫార్ములా..: భారత్‌కే కాదు.. పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఫలితాలు రాబట్టాలనుకుంటున్న ప్రతి జట్టుకూ ఇప్పుడు ఇంగ్లాండే ఆదర్శం. 2015 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించాక ఇంగ్లాండ్‌ జట్టులో పెను మార్పులే చోటు చేసుకున్నాయి. ఆ జట్టు ఆటతీరు కూడా చాలా వేగంగా మారిపోయింది. వన్డేలు, టీ20లు ఆడే పద్ధతినే ఇంగ్లాండ్‌ మార్చేసింది. మోర్గాన్‌ నాయకత్వంలో దూకుడుకు మారుపేరైన ఆటగాళ్లతో వన్డే, టీ20 జట్లను సిద్ధం చేసుకుంది ఇంగ్లాండ్‌. ఓపెనర్ల దగ్గర్నుంచి 7, 8 స్థానాల్లో ఆడే వారి వరకు అందరిదీ ఒకటే మంత్రం.. దంచు దంచు. కొన్ని మ్యాచ్‌ల్లో ఈ పద్ధతి ప్రతికూల ఫలితాలు తేవచ్చు.

కానీ ఎక్కువ మ్యాచ్‌ల్లో విజయాలు అందిస్తూ ఇంగ్లాండ్‌ను ప్రమాదకరంగా మార్చింది. మోర్గాన్‌ నిష్క్రమించినా.. అతనుండగా మారిన జట్టు దృక్పథం మాత్రం కొనసాగుతూ వస్తోంది. మొయిన్‌ అలీ, లివింగ్‌స్టోన్‌, స్టోక్స్‌, సామ్‌ కరన్‌.. ఇంతమంది ఆల్‌రౌండర్లు ఉండడంతో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆ జట్టుకు బోలెడన్ని ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు టీమ్‌ఇండియా కూడా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇలా ఆల్‌రౌండర్లు, దూకుడైన ఆటగాళ్లతో నిండిన జట్టునే సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆచితూచి ఆడడం, క్రీజులో కుదురుకోవడం లాంటి మాటలు ఇక కట్టి పెట్టాల్సిందే. ఈ ప్రపంచకప్‌ అంతటా టాప్‌-3 బ్యాటర్లు ఆత్మరక్షణ ధోరణిలోనే బ్యాటింగ్‌ చేశారు.

ఈ ధోరణితో టీ20ల్లో ప్రపంచకప్‌ గెలవడం అసాధ్యం! పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యం.. కానీ వికెట్లు కాపాడుకుని.. ఆఖరి అయిదు ఓవర్లలో దంచికొట్టాలన్న పద్ధతి వల్ల నష్టమే ఎక్కువ. ఈ ప్రపంచకప్‌లో భారత్‌ను దెబ్బతీసిన వ్యూహం ఇదే. వికెట్‌ పడ్డా పర్వాలేదని ఎదురు దాడి చేస్తేనే ప్రత్యర్థిపై పైచేయి సాధించగలం. భారత్‌తో సెమీస్‌లో ఇంగ్లాండ్‌ అదే చేసింది. సూపర్‌-12 దశలో ఆ జట్టు తడబడ్డా.. దూకుడుగా ఆడే శైలి, లోతైన బ్యాటింగ్‌ వల్ల సెమీస్‌లో తనదైన రోజు చెలరేగిపోయింది.

బెయిర్‌స్టో, టాప్లీ టోర్నీకే దూరమైనా.. వుడ్‌, మలన్‌ కీలకమైన సెమీస్‌కు దూరం అయినా ఇంగ్లాండ్‌ ఏమాత్రం కుంగిపోలేదు. భారత జట్టులా గాయాలను సాకుగా చూపించకుండా సమయోచితంగా రాణిస్తూ ఫైనల్‌ చేరింది. ఐపీఎల్‌ ద్వారా దూకుడుకు మారుపేరైన యువ ఆటగాళ్లు చాలామంది వస్తున్నారు. వారికే ఇకపై పెద్ద పీట వేయాలి. ఆల్‌రౌండర్ల బలాన్ని పెంచుకోవాలి. అలాగే మంచి వేగం ఉన్న పేసర్లు ఎక్కువమందిని తయారు చేసుకోవాలి.

కంగారూల్లా కఠినంగా..: ఆటతీరులో ఇంగ్లాండ్‌ ఆదర్శమైతే.. జట్టు ఎంపిక విషయంలో మాత్రం ఆస్ట్రేలియానే ఎవరికైనా స్ఫూర్తి. ఆటగాళ్ల స్థాయి గురించి ఆలోచించకుండా జట్టు అవసరాలను బట్టి ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎప్పుడూ వెనుకాడదు. స్టీవ్‌ వా ఫామ్‌లో ఉండగానే జట్టుకు కెప్టెన్‌ మారాల్సిన అవసరాన్ని గుర్తించి అతడికి స్పష్టంగా విషయం చెప్పేశారు. ఇక జట్టు ఎంపికలోనూ ఆస్ట్రేలియా ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. కానీ భారత క్రికెట్లో మాత్రం 'స్టార్‌' సంస్కృతి జట్టును వెంటాడుతూనే ఉంటుంది. ఒక స్థాయి అందుకున్నాక ఆటగాళ్లను తప్పించడానికి సాహసించరు.

యువ ఆటగాళ్లకు కొన్ని అవకాశాలిచ్చి వాటిని ఉపయోగించుకోలేదంటే పక్కన పెట్టేస్తుంటారు కానీ.. సీనియర్లు ఎన్నిసార్లు విఫలమైనా వారి కోసం ఇంకో అవకాశం సిద్ధంగా ఉంటుంది. కేఎల్‌ రాహుల్‌, అశ్విన్‌ లాంటి ఆటగాళ్ల విషయంలో ఈ వైఖరి స్పష్టంగా కనిపించింది. అక్షర్‌ పటేల్‌ లాంటి సాధారణ ఆటగాడికి పదే పదే అవకాశాలివ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రపంచకప్‌లో పంత్‌, చాహల్‌, హర్షల్‌ పటేల్‌లకు అన్యాయం జరిగిందన్నది స్పష్టం. పంత్‌ లాంటి ప్రమాదకర ఆటగాడిని సుదీర్ఘ కాలం బెంచ్‌కు పరిమితం చేసి అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశారు. అశ్విన్‌, భువి విఫలమవుతున్నా చాహల్‌, హర్షల్‌లకు అవకాశం దక్కలేదు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్‌ లాంటి ఆటగాళ్లను స్టాండ్‌బైలకు పరిమితం చేయడం అన్యాయమే.

ఒకే జట్టును పట్టుకుని వేలాడకుండా పృథ్వీ షా, రాహుల్‌ త్రిపాఠి, రజత్‌ పటిదార్‌, నితీశ్‌ రాణా, ఉమ్రాన్‌ మాలిక్‌, మోసిన్‌ ఖాన్‌ లాంటి ఈ తరం ఆటగాళ్ల మీద దృష్టిసారించాల్సిన అవసరాన్ని ప్రపంచకప్‌ గుర్తు చేసింది. కోహ్లి, రోహిత్‌లకు వయసు మీదపడింది. వారి కెరీర్‌ ఇక ఎంతో లేదు. టీ20ల వరకు వీరిని దాటి ఆలోచించాల్సిందే. షమి, అశ్విన్‌, కార్తీక్‌ లాంటి సీనియర్లను ఇక పక్కన పెట్టాల్సిందే. అవకాశాలను ఉపయోగించుకోని రాహుల్‌, అక్షర్‌ పటేల్‌ లాంటి ఆటగాళ్ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అప్పుడే జట్టు రాత మారుతుందన్నది స్పష్టం.

ఇదీ చదవండి: T20 WC 2022: 'ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌' రేసులో 9 మంది.. కోహ్లీతో పాటు..

ఇకపై టీమ్‌ఇండియాను అలా పిలవొచ్చు: కపిల్ దేవ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.