ETV Bharat / technology

ఇక చేతితో మొబైల్ వాడక్కర్లేదు! అంతా ఫేస్ ఎక్స్​ప్రెషన్స్​తోనే- గూగుల్ మరో సూపర్ ఫీచర్ - Google Andriod New Feature

author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 3:29 PM IST

Google Android New Features AI : ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ఏఐ సాంకేతికతతో మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వల్ల చేతిని ఉపయోగించకుండానే ఫోన్​ను ముఖ కవళికలతో ఆపరేట్ చేసేయచ్చు. ఈ ఫీచర్ గురించి తెలుసుకుందామా మరి.

GOOGLE ANDRIOD NEW FEATURE
GOOGLE ANDRIOD NEW FEATURE (Getty Images)

Google Android New Features AI : సాధారణంగా మొబైల్​ను చేతితో ఆపరేట్ చేస్తుంటాం. గేమ్స్, చాటింగ్, కాల్స్ ఇలా ఏవి చేయాలన్నా చేతితోనే చేస్తాం. అయితే ఇక నుంచి ఆ అవసరం లేదు. ముఖ కవళికల ద్వారా ఫోన్​ను ఆపరేట్ చేయొచ్చు. అలాగే గేమ్స్ సైతం ఆడుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ టెక్నాలజీ వస్తే మొబైల్ వాడేటప్పుడు చేతినే ఉపయోగించక్కర్లేదు. మరెందుకు ఆలస్యం ఈ గూగుల్ ఏఐ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం.

ప్రాజెక్ట్ గేమ్ ఫేస్ అనే ఫీచర్​ను మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఫీచర్ ముఖ కవళికలు, తల, పెదాలు, కళ్లు వంటి వాటితో సంజ్ఞలు చేస్తే పనిచేస్తుంది. 'ఫోన్ కెమెరా ద్వారా ఈ ఏఐ టెక్నాలజీ ముఖ, తల కదలికలను ట్రాక్ చేస్తుంది. ఆ తర్వాత ఆ కవళికలను అనువదిస్తుంది. ప్లేఎబిలిటీ వంటి కంపెనీలు తమ సమగ్ర సాఫ్ట్‌వేర్​లో ప్రాజెక్ట్ గేమ్‌ ఫేస్​ను ఉపయోగించడాన్ని చూసి సంతోషిస్తున్నాం. త్వరలో ఆండ్రాయిడ్ వెర్షన్​లో గేమ్ ఫేస్ ఫీచర్​ను అందుబాటులోకి తెస్తున్నాం' అని ఓ ప్రకటనలో గూగుల్ పేర్కొంది.

గేమ్ ఫేస్ ఫీచర్​ను ఉద్యోగ రంగం, ఇతర మొబైల్ ఆపరేషన్స్​లోనూ పరీక్షించడానికి గూగుల్ ఇన్ క్లూజ్జా అనే సంస్థతో భాగస్వామ్యం కుదర్చుకుంది. కాగా, ప్రాజెక్ట్ గేమ్‌ ఫేస్ మొదటిసారిగా 2023లో ఓపెన్ సోర్స్, హ్యాండ్స్-ఫ్రీ గేమింగ్ మౌస్‌ గా ప్రారంభమైంది. కంప్యూటర్​లో తల, ముఖ కవళికలతో ఆపరేట్ అయ్యింది. త్వరలో ఆండ్రాయిడ్ వెర్షన్​లోనూ అందుబాటులోకి రానుంది.

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సులువుగా చదివేయొచ్చు!
కొన్నాళ్ల క్రితం డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా గూగుల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. డాక్టర్‌ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌ను యూజర్‌ గూగుల్ లెన్స్‌తో ఫొటో తీస్తే, అందులోని మందుల వివరాలను సెర్చ్‌లో చూపిస్తుంది. అయితే, సెర్చ్‌ రిజల్ట్‌లో చూపించిన మందుల వివరాలను ఆధారంగా యూజర్లు ఇప్పుడే ఒక నిర్ధరణకు రావొద్దని గూగుల్ సూచిస్తుంది. ఈ ఫీచర్‌ను మరింత మెరుగుపరిచేందుకు మెడికల్‌ రికార్డ్‌లను డిజిటలైజ్‌ చేయడం సహా ఫార్మసిస్ట్‌లతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఇది ఏఐ ఆధారిత మెషీన్‌ లెర్నింగ్ సాంకేతికత సాయంతో పనిచేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.