Telangana Cabinet Meeting On May 18th : ఈ నెల 18న భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం, పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మధ్య విభజన వివాదాలతో పాటు రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళికపై కేబినెట్‌లో చర్చించనున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బుధవారం నాడు సచివాలయంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ–ఏపీ మధ్య అపరిష్కృతంగా అంశాలపై చర్చ : మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో, సీఎం రేవంత్ రెడ్డి కీలక అంశాలపై చర్చించారు. జూన్ 2 నాటికి రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కానున్నందున, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
CM Revanth on Bifurcation Issues : ఏకాభిప్రాయంతో విభజన పూర్తైన అంశాలు, పెండింగ్‌లో ఉన్న వాటి వివరాలన్నీ అందులో పొందుపరచాలని రేవంత్ రెడ్డి అన్నారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, విద్యుత్తు సంస్థల బకాయిల వివాదం తేలలేదని వారు చెప్పారు. ఇప్పటి వరకూ తేలని అంశాలు, వివాదాల పరిష్కారానికి చేసిన ప్రయత్నాలను అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి, తదుపరి కార్యాచరణపై చర్చించారు.
రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్న ఉద్యోగుల బదిలీల వంటివి ముందుగా పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీటముడి పడిన అంశాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ఆయన అధికారులను స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధాని కాల పరిమితి పూర్తి కానున్నందున హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది - ఇక పరిపాలనపై ఫోకస్ : సీఎం రేవంత్ - CM Revanth Reddy Chit Chat
రుణమాఫీకి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి : రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై కూడా అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేయాల్సిందేనని, దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ఆదాయ, వ్యయ పరిస్థితులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణ మార్గాలపై చర్చించారు. రూ.2 లక్షల రుణమాఫీకి అవసరమైన విధి విధానాలు, ప్రణాళికలను తయారు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రుణమాఫీకి అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలని రేవంత్‌రెడ్డి అన్నారు. అన్నదాతలను రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని, నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించాలని సీఎం స్పష్టం చేశారు. నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచనలు చేశారు. రైతు రుణమాఫీ కోసం మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు.
అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు : ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి, వర్షాకాలం ప్రారంభం కాకముందే పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల జోక్యం లేకుండా చూడాలన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను మిల్లింగ్ చేసి, రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో అన్నదాతలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు.
విత్తనాలు ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు : మంత్రి తుమ్మల - Minister Tummala On Seed Supply