తెలంగాణ

telangana

ఆకలి కోరల్లో ప్రజానీకం.. ఆదుకోవడం ప్రభుత్వాల కర్తవ్యం!

By

Published : Nov 19, 2021, 7:10 AM IST

భారత్​లో 19 కోట్లమంది అభాగ్యులు (Global Hunger Index) కాలే కడుపులతో పొద్దుపుచ్చుతున్నారు. ఆకలి మంటలకు (Hunger crisis) తాళలేక ఏటా పిల్లలు సహా సుమారు 25 లక్షల నిండుప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కరోనాతో ఈ సంఖ్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో విదేశాల్లో చేస్తున్న సామాజిక వంటశాలల ప్రయోగం ఎందరిలోనో స్ఫూర్తి రగిలిస్తోంది. తిండికోసం ఎవరూ ఎక్కడా అలమటించని రీతిలో దీనిని దేశమంతటా విస్తరింపజేయడం తక్షణావసరం.

Welfare .. is the duty of the government!
ఆకలి కోరల్లో ప్రజానీకం.

దేశంలో ఆకలిచావుల (Hunger crisis) నివారణకోసం సామాజిక వంటశాలల ఏర్పాటు కోరుతూ దాఖలైన అర్జీపై విచారణలో భాగంగా, ప్రభుత్వాల రాజ్యాంగబద్ధ బాధ్యతను సర్వోన్నత న్యాయస్థానం తాజాగా మళ్ళీ గుర్తుచేసింది. 'అన్నమో రామచంద్రా!' అని ఆక్రందించే నిరుపేదల ఆకలి తీర్చడం పాలకశ్రేణుల విధ్యుక్తధర్మమని హితవు పలికింది. అధికారిక గణాంకాల ప్రకారమే, దేశంలో 19 కోట్లమంది (Hunger in India) అభాగ్యులు కాలే కడుపులతో పొద్దుపుచ్చుతున్నారు. ఆకలి మంటలకు తాళలేక ఏటా పిల్లలు సహా సుమారు 25 లక్షల నిండుప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కరోనా కోర సాచి బతుకుల్ని బతుకుతెరువుల్ని చావుదెబ్బ తీశాక, ఆకలితో అలమటించేవారి సంఖ్య ఇంకా పెరిగింది. సంక్షోభ తీవ్రతకు అనుగుణంగా సత్వర దిద్దుబాటు చర్యలపై ప్రమాణ పత్రాల దాఖలులో అలసత్వాన్ని గర్హిస్తూ ఆరు రాష్ట్రాలమీద సుప్రీంకోర్టు నిరుడు ఫిబ్రవరిలో కన్నెర్ర చేసింది.

జరిమానాల కొరడా ఝళిపించింది. తనవంతుగా అప్రమత్తం కాని కేంద్రం అఫిడవిట్‌ సమర్పణ, విధాన రూపకల్పనల్లో ఉదాసీనత్వానికి ప్రతిఫలంగా- ఇప్పుడు న్యాయస్థానం చేత మొట్టికాయలు వేయించుకోవాల్సి వచ్చింది. వివిధ రాష్ట్రాల్లో అన్నార్తులను ఆదుకునే పథకాలు అమలవుతున్నాయన్న సుప్రీం ధర్మాసనం, వాటితో సమన్వయం సాధించి జాతీయ స్థాయిలో పకడ్బందీ విధానం రూపొందించాల్సిందిగా మూడువారాల క్రితం కేంద్రానికి సూచించింది. పిల్లల్లో పౌష్టికాహార లోపాలను, భిన్న ప్రాంతాల్లో ఆకలిమంటల్ని(Hunger in India) కలగలపవద్దన్న నిర్దేశాన్ని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మాధవీ దివాన్‌ ఈసారీ గాలికొదిలేయడం విస్మయపరుస్తోంది. రాష్ట్రాల సమ్మతితోనే సామాజిక వంటశాలల అంశంలో ముందడుగు వేయగలమన్న అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వివరణా ధర్మాసనాన్ని మెప్పించలేకపోయింది. అశక్తత వెలిబుచ్చుతూ వివరణలు సాకులు గుప్పించడం కాదిప్పుడు కావాల్సింది.. ఆకలి కోరలనుంచి పేద ప్రజానీకాన్ని రక్షించే మానవీయ బాధ్యతను నిర్వర్తించడమే అభిలషణీయం!

నిరుపేదల జీవనహక్కు పెను ముప్పును ఎదుర్కొంటున్న తరుణాన 116 దేశాల క్షుద్బాధా సూచీలో (Global Hunger Index) భారత్‌ 101వ స్థానంలో ఈసురోమంటోంది. డెబ్భై అయిదేళ్ల స్వాతంత్య్రం తరవాతా ఈ స్థాయిలో అన్నార్తులిక్కడ పోగుపడటం, ఇన్నేళ్ల ప్రభుత్వాల ప్రణాళికల వైఫల్యాలను కళ్లకు కడుతోంది. ఇకనైనా దారుణ దుస్థితిని పరిమార్చే పటుతర వ్యూహంతో న్యాయస్థానం ముందుకు రమ్మంటే- పంచాయతీలకు తిండిగింజల తరలింపు, నిల్వ వసతుల ఏర్పాటు, వంటశాలల నిర్మాణం తదితరాలు భారీ కష్టనష్టాలతో కూడుకున్నవన్న అధికారిక వివరణ చాటుతున్నదేమిటి? సంక్షేమ రాజ్యభావన ఆవిరవుతున్నదనే కదా!

బ్రెజిల్‌, అమెరికా, ఇంగ్లాండ్‌ వంటిచోట్ల తిండి కూపన్లు, ఆహార బ్యాంకుల పేరిట సామాజిక వంటశాలల ప్రయోగం ఎందరిలోనో సేవాస్ఫూర్తి రగిలిస్తోంది. దేశీయంగా గురుద్వారాల్లో లంగర్‌ రూపేణా, అక్షయపాత్ర ఫౌండేషన్‌ ద్వారా ఉచితంగా ఆహార సరఫరా కార్యక్రమాలు అసంఖ్యాకుల్ని అమ్మలా ఆదుకుంటున్నాయి. కరోనా విజృంభణకు ముందు, తరవాత పలు రాష్ట్రాల్లో సామాజిక వంటశాలలు ఆరంభమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో భిన్నస్థాయుల్లో కొనసాగుతున్న వాటి సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించి- తిండికోసం ఎవరూ ఎక్కడా అలమటించని రీతిలో సామాజిక వంటశాలల స్ఫూర్తిని దేశమంతటా విస్తరింపజేయడం తక్షణావసరం. చేసేందుకు పని దొరక్క పస్తులతో అర్ధాకలితో కుమిలే దుర్గతి (Hunger crisis) ఎవ్వరికీ దాపురించకుండా కాచుకోవడమే సంక్షేమ ప్రభుత్వాల మానవీయ కర్తవ్యం!

ఇదీ చూడండి:భారత్​ను వెంటాడుతున్న పోషకాహార సమస్య

'జై భీమ్ సినిమాకు అవార్డులు, ప్రశంసలు బంద్!'

ABOUT THE AUTHOR

...view details