ETV Bharat / opinion

కాంగ్రెస్ కంచుకోటలో బీజేపీ గెలుస్తుందా? రాయ్​బరేలీ, అమేఠీలో ప్రియాంక గాంధీ వ్యూహాలు పని చేస్తాయా? - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 9:34 AM IST

Raebareli and Amethi lok sabha polls : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్‌ మే20న జరగనుంది. 49 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నా అందరి చూపు రెండు నియోజకవర్గాలపై పడింది. అవే ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేఠీ. కాంగ్రెస్‌కు కంచుకోటలైన ఈ రెండు స్థానాల్లో ఆసక్తికర పోటీ నెలకొంది. దశాబ్దాలుగా తమకు కంచుకోటలుగా నిలిచిన రాయ్‌బరేలీ, అమేఠీలో ఈసారి కాంగ్రెస్‌ పార్టీని విజయతీరానికి చేర్చే బాధ్యతను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అటు బీజేపీ సైతం గెలుపుపై ధీమాతో ఉంది.

Raebareli and Amethi lok sabha polls
Raebareli and Amethi lok sabha polls (Etv)

Raebareli Amethi lok sabha polls : లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు విడతల పోలింగ్‌ ముగిసింది. మే20న ఐదో విడత పోలింగ్‌ జరగనుంది. ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజవర్గాల్లో ఐదో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని 14 స్థానాల్లో పోలింగ్‌ జరగనుండగా ముఖ్యంగా అందరి దృష్టి రెండు నియోజకవర్గాలపై నెలకొంది. అవే ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేఠీ స్థానాలు. దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా నిలిచిన ఈ రెండు స్థానాల్లో ఈసారి ఆసక్తికర పోటీ నెలకొంది. గత ఇరవై ఏళ్లుగా తమకు ఓటమిలేని రాయ్‌బరేలీ స్థానంలో మరోసారి విజయంపై కాంగ్రెస్‌ ధీమాతో ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బరిలో నిలవడం వల్ల ఆ పార్టీ గెలుపుపై మరింత విశ్వాసంతో ఉంది. అటు పాతికేళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబేతర వ్యక్తి అమేఠీలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అమేఠీలో కాంగ్రెస్‌ను కంగుతినిపించిన బీజేపీ మరోసారి సత్తాచాటాలని చూస్తోంది. తమ కంచుకోటల్లో ఈసారి పార్టీని విజయతీరానికి చేర్చే బాధ్యతను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఈ రెండుచోట్లా ప్రచారాన్ని అంతా తానై ఆమె నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్ కంచుకోటను బీజేపీ బద్దలు కొడుతుందా?
తన తల్లి సోనియాను రెండు దశాబ్దాలుగా లోక్‌సభకు పంపుతూ వస్తున్న రాయ్‌బరేలీ నుంచి ఈసారి రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్నారు. సోనియా 2004 నుంచి 2024 వరకు రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహించి, ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో ఆ స్థానంలో మొదట ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరికి రాహుల్‌ బరిలో నిలిచారు. ఇప్పటికే కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేసినా రాహుల్‌, రెండో స్థానంగా రాయ్‌బరేలీని ఎంచుకున్నారు. అటు రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడంపై ఎన్​డీఏ కూటమి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసిన రాహుల్‌ అక్కడ బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఓటమి భయంతోనే అమేఠీ నుంచి రాహుల్‌ పారిపోయారని ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలందరూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో సోనియా చేతిలో ఓడిపోయిన ప్రతాప్‌ సింగ్‌నే మరోసారి బీజేపీ రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దించింది. 1998 తర్వాత ఇక్కడ గెలవని బీజేపీ ఈసారి ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలు కొట్టాలని చూస్తోంది. అటు కాంగ్రెస్‌ మాత్రం మరోసారి గెలుపుపై ధీమాతో ఉంది. రాహుల్‌ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీలో కూడా గెలిస్తే ఇక్కడ స్థానాన్ని వదులుకునే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. అప్పుడు ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.

మూడు దశాబ్దాల్లో ఇది రెండోసారి
ఇక అమేఠీ ఐదేళ్ల క్రితం వరకు గాంధీ కుటుంబానికి పెట్టని కోట. 2019లో కమలదళ దండయాత్రలో ఈ సామ్రాజ్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌ గాంధీ ఓటమిపాలవడం వల్ల కంచుకోటకు బీటలుపడ్డాయి. దీంతో తాజా ఎన్నికల్లో దీన్ని తిరిగి దక్కించుకునే బాధ్యతను కాంగ్రెస్‌ అధిష్ఠానం గాంధీల నమ్మకస్థుడైన కిశోరీ లాల్‌కు అప్పగించింది. పాతికేళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ తరఫున ఇక్కడ పోటీకి దిగారు. గత నాలుగున్నర దశాబ్దాల్లో దాదాపు 31 ఏళ్లు అమేఠీ లోక్‌సభ నియోజకవర్గానికి గాంధీ కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహించారు. 1980లో తొలిసారి సంజయ్‌ గాంధీ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆయన ఆకస్మిక మరణంతో మరుసటి ఏడాది జరిగిన ఉప ఎన్నికలో రాజీవ్‌ గాంధీ బరిలోకి దిగారు. అప్పటి నుంచి 1991 వరకు ఆయనే అమేఠీ ఎంపీగా కొనసాగారు. ఇక, 1999లో సోనియా గాంధీ పోటీ చేయగా ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీని తన కుమారుడు రాహుల్‌ గాంధీకి అప్పగించారు. అలా 2004 నుంచి రాహుల్‌ గాంధీ వరుసగా మూడు సార్లు ఇక్కడ విజయం సాధించారు. కానీ, గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. గాంధీ కుటుంబేతరులు ఈ స్థానం నుంచి పోటీ చేయకపోవడం గత మూడు దశాబ్దాల్లో ఇది రెండోసారి మాత్రమే. 1991లో రాజీవ్‌ గాంధీ మరణంతర్వాత ఈ స్థానాన్ని సతీశ్ శర్మకు కాంగ్రెస్‌ అప్పగించింది. ప్రస్తుత ఎన్నికల్లో కిశోరీ లాల్‌ శర్మను కాంగ్రెస్‌ నిలబెట్టింది. మరోసారి బీజేపీ నుంచి స్మృతి ఇరానీ బరిలో నిలిచారు.

గెలుపు బాధ్యత ప్రియాంకాగాంధీదే
దశాబ్దాలుగా గాంధీ కుటుంబ కంచుకోటలుగా నిలిచిన రాయ్‌బరేలీ, అమేఠీ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈసారి కాంగ్రెస్‌ పార్టీని విజయతీరానికి చేర్చే బాధ్యతను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ తీసుకున్నారు. రెండుచోట్లా ప్రచారాన్ని అంతా తానై ప్రియాంక గాంధీ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాయ్‌బరేలీలో ప్రియాంక ఇల్లు తీసుకొని మకాం వేశారు. తెర వెనుక వ్యూహాలను రచించడంలోనూ కీలకంగా నిలుస్తున్నారు. తమ కుటుంబంతో ఈ నియోజకవర్గాలకు తరతరాలుగా ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తూనే జాతీయ స్థాయి అంశాలనూ ఉటంకిస్తున్నారు. మోతీలాల్‌ నెహ్రూ హయాం నుంచి లెక్కిస్తే తమ కుటుంబానికి రాయ్‌బరేలీతో 103 ఏళ్లుగా అనుబంధం ఉందని, 1921 నుంచి ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నామని ప్రియాంక వివరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తన జట్టు కోసం ఆటలో పాల్గొనని కెప్టెన్‌లా ప్రియాంక వ్యవహరిస్తున్నారు.

అమేఠీ, రాయ్‌బరేలీ అంటే తమ దృష్టిలో కేవలం లోక్‌సభ నియోజకవర్గాలు మాత్రమే కావని, అవి తమ కర్మభూమి అని రాహుల్‌ అంటున్నారు. ఆ రెండు నియోజకవర్గాల ప్రజలతో కుటుంబ సంబంధాలు ఉన్నాయని, ఎప్పుడు అవసరమైనా వారికి బాసటగా నిలుస్తున్నామని చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జాతీయ రాజకీయాలపై ప్రజల నాడి ఎలా ఉంది? - కూటముల అవకాశాలు, ప్రతికూలతలెలా ఉన్నాయి? - Who Win Lok Sabha Elections 2024

గల్లీ టు దిల్లీ వయా 'యూపీ'- అక్కడ కొడితే కుంభస్థలం బద్దలుగొట్టినట్లే! - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.