తెలంగాణ

telangana

manipur Violence: ఆపరేషన్ 'మణిపూర్‌'.. వాయుమార్గంలో తెలుగు విద్యార్థులను తరలించాలని నిర్ణయం

By

Published : May 6, 2023, 10:53 PM IST

Special Flight from Imphal to Hyderabad : మణిపూర్‌లో ఉన్న తెలుగు విద్యార్థుల కోసం ఆదివారం మధ్యాహ్నం ఇంఫాల్ నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ప్రజల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మణిపూర్‌లో సుమారు 250 మంది తెలుగు వారు ఉండగా.. వారి యోగక్షేమాల గురించి రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

manipur Violence
manipur Violence

Special Flight from Imphal to Hyderabad : మణిపూర్‌లో జరుగుతున్న తీవ్ర ఘర్షణల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు వారి కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ నుంచి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలుగు ప్రజలు దీనిని ఉపయోగించుకొని క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్, సమీప ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం.

మణిపూర్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అక్కడున్న తెలంగాణ వారి కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. చిక్కుకున్న వారందరినీ తక్షణమే వాయు మార్గంలో తరలించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రేపు మధ్యాహ్నం ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. మణిపూర్ సీఎస్‌తో మాట్లాడిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. రాష్ట్ర విద్యార్థులు క్షేమంగా వచ్చేలా చూడాలని కోరారు. అక్కడి అధికారులను సీఎస్, డీజీపీలు ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ రాష్ట్రానికి చెందిన ప్రజలు, విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు: మణిపూర్‌లో ఉన్న తెలంగాణ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర పోలీసులు హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. డీఐజీ సుమతిని ఈ కేంద్రానికి బాధ్యురాలిగా నియమించారు. మణిపూర్​లో ఉన్న తెలంగాణ వాసులు హెల్ప్ లైన్ సెంటర్‌ను సంప్రదిస్తే వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సహాయం కొరకు 7901643283 నెంబర్‌తో పాటు, dgp@tspolice,gov.in మెయిల్ ఐడీకి ఫిర్యాదు చేయాలని కోరారు. మణిపూర్ పోలీసులతో తెలంగాణ పోలీసులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు.

బిక్కుబిక్కుమంటూ వసతి గృహంలోనే..!: మణిపూర్‌లో అల్లర్లతో తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంఫాల్‌ ఎన్‌ఐటీలో 150 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉన్నారు. తాగు నీరు కూడా సరిగా లేకపోవడంతో కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు ఒకపూట మాత్రమే భోజనం అందిస్తుడంటంతో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. బిక్కుబిక్కుమంటూ వసతి గృహాల్లో విద్యార్థులు తలదాచుకుంటున్నారు.

manipur Violence update: విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడే అవకాశం లేకుండా పోలీసులు జామర్లు పెట్టారు. సొంత రాష్ట్ర విద్యార్థులను వారి వారి ఇళ్లకు మణిపూర్ ప్రభుత్వం చేర్చింది. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మణిపూర్‌లో నాలుగైదు రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో 100 మంది మృతి చెందారు. ఎన్‌ఐటీ చుట్టూ బాంబుల మోతలతో.. కంటిమీద కునుకు లేకుండా విద్యార్థులు భయం గుప్పెట్లో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details