ETV Bharat / bharat

మణిపుర్​లో హింస.. రంగంలోకి సైన్యం.. 'కనిపిస్తే కాల్చివేత' ఆదేశాలు

author img

By

Published : May 4, 2023, 12:02 PM IST

Updated : May 4, 2023, 5:39 PM IST

మణిపుర్​లో​ హింస నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఆ రాష్ట్ర సీఎంతో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా మాట్లాడారు. మరోవైపు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం సహకారంతో మణిపుర్ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది.

Manipur Violence
మణిపుర్​లో హింస

గిరిజనుల నిరసనలు హింసాయుతమైన నేపథ్యంలో మణిపుర్​లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇంకా కొన్నిచోట్ల ఘర్షణలు జరుగుతుండగా.. అదుపు చేసేందుకు సైన్యం, అసోం రైఫిల్స్ రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు హింసలు చెలరేగే సమస్యాత్మక ప్రాంతాల్లోని 9,000 మంది ప్రజల్ని భద్రతా సిబ్బంది సురక్షిత ప్రదేశాలకు తరలించాయి. మిగతా వారిని కూడా తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు అధికారులు. అన్ని సైనిక దళాలు పోలీసుల సహకారంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చాయని అధికార ప్రతినిధి తెలిపారు. హింసాత్మక వాతావరణాన్ని కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ ఫ్లాగ్​ మార్చ్​లు నిర్వహిస్తున్నాయి బలగాలు.

కనిపిస్తే కాల్చివేత
మణిపుర్​లో హింస నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేసింది. అతి తీవ్రమైన పరిస్థితి తలెత్తితే హింసను నియంత్రించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్చరికలను ఖాతరు చేయకుండా హింస కొనసాగిస్తే కాల్పులు జరపవచ్చని ఆదేశాల్లో పేర్కొంది. ఉద్రిక్తతల దృష్ట్యా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇదివరకే 144 సెక్షన్ అమలులోకి తెచ్చింది. రానున్న ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

కేంద్రం అలర్ట్​..
హింస నేపథ్యంలో మణిపుర్​ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్​తో గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. బుధవారం ఘర్షణల చెలరేగిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణకు చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

Manipur Violence
మణిపుర్​లో హింస
Manipur Violence
మణిపుర్​లో హింస

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై స్పందించిన ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్.. ఇది చాలా దురదృష్టకర పరిణామమని, శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందుకోసం అదనపు పారా మిలిటరీ బలగాలను కూడా రప్పిస్తున్నామని చెప్పారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. పొరుగు రాష్ట్రం మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా ఈ హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేస్తూ బీరేన్​ సింగ్‌కు లేఖ రాశారు.

Manipur Violence
ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న భద్రతా దళాలు

కాంగ్రెస్ విమర్శలు​..
మణిపుర్‌లో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగడానికి బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలే కారణమని కాంగ్రెస్ గురువారం ఆరోపించింది. రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలని.. సంయమనం పాటించాలని.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రజలను ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు.

Manipur Violence
పునరావాస కేంద్రాల్లో భోజనం చేస్తున్న ప్రజలు

'మా రాష్ట్రాన్ని కాపాడండి': బాక్సర్​ మేరీ కోమ్​
అంతకుముందు.. తన సొంత రాష్ట్రమైన మణిపుర్​లో హింసాకాండను నియంత్రించేందుకు కేంద్రం సహాయం చేయాలని ప్రముఖ బాక్సర్​ మేరీ కోమ్​ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్​ షాకి ట్విట్టర్​లో విజ్ఞప్తి చేశారు. హింసకు సంబంధించి ఫొటోలను ఆమె పోస్ట్​ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా ట్యాగ్ చేశారు.

Manipur Violence
పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలు

నిరసన ర్యాలీలో హింస..
బుధవారం చురచంద్​పుర్​ జిల్లా టోర్​బంగ్ ప్రాంతంలో మణిపుర్ గిరిజన విద్యార్థుల యూనియన్(ఏటీఎస్​యూఎం) 'గిరిజన సంఘీభావ యాత్ర' పేరుతో భారీ ర్యాలీ చేపట్టింది. ఇంఫాల్​ లోయలో అధిక సంఖ్యలో ఉండే మైతీ సామాజిక వర్గం.. తమను ఎస్​టీ జాబితాల్లో చేర్చాలని డిమాండ్ చేయడాన్ని నిరసిస్తూ.. ఏటీఎస్​యూఎం ఆందోళనకు పిలుపినిచ్చింది. మేతీ కమ్యూనిటీ చేస్తున్న ఎస్టీ హోదా డిమాండ్‌పై నాలుగు వారాల్లోగా కేంద్రానికి సిఫారసు పంపాలని మణిపుర్ హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడానికి నిరసనగా ఈ మార్చ్ నిర్వహించారు. వేలాది మంది హాజరైన ఈ ర్యాలీలో.. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ గొడవల్లో కొందరు అనేక ఇళ్లను, దుకాణాలకు నిప్పింటించారు. పరిస్థిని నియంత్రించేందుకు నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. అయితే చురచంద్‌పుర్​ సహా రాజధాని ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, తౌబల్, జిరిబామ్, బిష్ణుపుర్, కాంగ్‌పోక్పి, తెంగ్నౌపాల్ జిల్లాల్లో కూడా మైతీల ప్రాబల్యం ఎక్కువ.

Last Updated : May 4, 2023, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.