తెలంగాణ

telangana

'లౌకికవాదమే ప్రజాస్వామ్యానికి పునాది- అధికార పార్టీ తీరుతో సమాజంలో విభజన'

By PTI

Published : Jan 2, 2024, 1:40 PM IST

Sonia Gandhi Secularism : కేంద్రంలో అధికారంలో ఉన్నవారి వల్ల దేశంలో విభజన పెరుగుతోందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని ధ్వజమెత్తారు. లౌకికవాదం అనే పదాన్ని ఉపయోగించడమే అవమానకరమనేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

sonia-gandhi-secularism
sonia-gandhi-secularism

Sonia Gandhi Secularism : లౌకిక భావన భారత ప్రజాస్వామ్యానికి పునాది వంటిదని, ఆ పదాన్ని ఉపయోగించడమే అవమానకరమనేలా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. అధికార పార్టీ తీరుతో సమాజంలో విభజన పెరుగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం సాఫీగా సాగేలా చూసే రక్షణలను బలహీనపరుస్తున్నారని ధ్వజమెత్తారు. 2024 మనోరమ ఇయర్​బుక్​లో ఈ మేరకు వ్యాసం రాశారు.

"ప్రజాస్వామ్యం, లౌకికవాదం అనే భావనల మధ్య లోతైన అనుసంధానం ఉంటుంది. సామరస్య సమాజం దిశగా ప్రభుత్వాన్ని ఇవి నడిపిస్తాయి. మనకు ఈ రెండు పదాల గురించి తెలుసు. రాజ్యాంగంలోని పీఠికతో పాటు అనేక ప్రసంగాలు, పుస్తకాలు, చర్చల్లో వినే ఉంటాం. అయినప్పటికీ వీటి అసలు అర్థం అంతుచిక్కదు. వీటిని పౌరులు బాగా అర్థం చేసుకుంటే భారత చరిత్ర, ప్రస్తుతం ఉన్న సవాళ్లు, భవిష్యత్ మార్గాలపై స్పష్టత వస్తుంది."
-సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధినేత్రి

'గాంధీ చెప్పిన లౌకికత్వమే భేష్!'
లౌకికత్వాన్ని చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చని, కానీ 'సర్వ ధర్మ సమ భావ' అని మహాత్మా గాంధీ ఇచ్చిన వివరణ భారత్​కు సరిగ్గా నప్పుతుందని సోనియా పేర్కొన్నారు. అన్ని మతాల మధ్య ఐక్యతను గాంధీజీ గుర్తించారని, బహుళ మత సమాజంగా భారత్​ వర్ధిల్లాలని జవహర్​లాల్ నెహ్రూ ఆకాంక్షించారని గుర్తు చేశారు. అందుకే నిరంతరం లౌకిక రాజ్య ఏర్పాటుకు నెహ్రూ కృషి చేశారని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ నిర్మాతలు సైతం ఈ భావనను ప్రభుత్వానికి అన్వయించారని, తద్వారా ప్రత్యేక లౌకిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశారని వివరించారు.

"ప్రభుత్వం అన్ని మత విశ్వాసాలను పరిరక్షిస్తుంది. మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తుంది. సమాజంలోని భిన్న వర్గాల మధ్య సామరస్యం, శ్రేయస్సును నెలకొల్పడమే భారత లౌకిక ప్రజాస్వామ్య మార్గదర్శక సూత్రం. మన సమాజంలో భిన్న విశ్వాసాలతో పాటు భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాంతాలు, చరిత్ర వంటి విషయాల్లోనూ వైవిధ్యం కనిపిస్తుంది. అయినప్పటికీ ఐక్య భావన మాత్రం ఉంటుంది. కానీ మన ఉన్నత రాజ్యాంగం ఇప్పుడు దాడికి గురవుతోంది.

ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఓట్లు వచ్చిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. కానీ మెజారిటీ ప్రజలు ఒప్పుకుంటే వారికి మిగిలినవారిపై ఆధిపత్యం ఉంటుందా? అల్ప సంఖ్యలో ఉన్నవారి ప్రయోజనాలకు విఘాతం కలిగితే ఏమవుతుంది? తాత్కాలిక మెజారిటీ ఉన్నవారు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్​లో విపరీత పరిణామాలకు దారి తీస్తే పరిష్కారం ఏంటి? మెజారిటీ సంఖ్యలో లేకపోవడం వల్లే తమ భాష, మతం, జీవన విధానానికి ముప్పు ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చెందడం సమాజానికి మంచిది కాదు."
-సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధినేత్రి

'ప్రజాస్వామ్యంలో మంచితో పాటు చెడూ ఉంది'
ప్రజాస్వామ్యం పరిపూర్ణ వ్యవస్థ కాదని, సమాజంలో ఎదురయ్యే సవాళ్లకు ఎప్పటికప్పుడు పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఉంటుందని సోనియా గాంధీ పేర్కొన్నారు. 'ప్రజాస్వామ్యం మంచిదని చెప్పడానికి కారణం ఏంటంటే ఇతర వ్యవస్థలు అధ్వానంగా ఉండటమే. ప్రజాస్వామ్యంలో మంచి ఉంది, చెడూ ఉంది' అన్న నెహ్రూ వ్యాఖ్యలను సోనియా ప్రస్తావించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతాయని ఇతర దేశాల అనుభవాల నుంచి భారత స్వాతంత్ర్య సమరయోధులు తెలుసుకున్నారని, అందుకే లిఖిత రాజ్యాంగం, లౌకికత్వం, ప్రాథమిక హక్కులను ప్రజలకు అందించారని తెలిపారు. 'దేశంలోని సమస్యలకు ప్రగతిశీల ప్రజలు ఎప్పటికప్పుడు పరిష్కారాలు కనుగొన్నారు. దేశ గౌరవార్థం ప్రస్తుతం ఉన్న సవాళ్లకు పరిష్కారం వెతికే బాధ్యత మనపై ఉంది' అని సోనియా పేర్కొన్నారు.

Secular Word Removed : రాజ్యాంగం నుంచి ఆ పదాలు మిస్సింగ్.. బీజేపీపై కాంగ్రెస్ ఫైర్.. అసలైన పీఠిక ఇదేనన్న కేంద్రం!

'లౌకిక విలువలు కాపాడటమే యాత్ర లక్ష్యం.. RSS భావజాలంతో దేశానికి నష్టం'

ABOUT THE AUTHOR

...view details