ETV Bharat / bharat

'లౌకిక విలువలు కాపాడటమే యాత్ర లక్ష్యం.. RSS భావజాలంతో దేశానికి నష్టం'

author img

By

Published : Jan 30, 2023, 2:08 PM IST

Updated : Jan 30, 2023, 3:12 PM IST

rahul gandhi bharat jodo yatra
రాహుల్ భారత్ జోడో యాత్ర

భారత్​ జోడో యాత్రతో తానెంతో నేర్చుకున్నానని చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. శ్రీనగర్​లో జరిగిన యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు.

దేశంలోని ఉదార, లౌకిక విలువలను కాపాడటమే భారత్ జోడో యాత్ర లక్ష్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో ఈ యాత్ర చేయలేదని, దేశ ప్రజల కోసం చేశానని చెప్పారు. భాజపా, ఆర్​ఎస్​ఎస్ భావజాలం దేశాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని.. దానికి అడ్డుగా నిలబడటమే తమ లక్ష్యమని అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 136 రోజుల పాటు సాగిన యాత్ర ముగింపు సందర్భంగా ఈ మేరకు ప్రసంగించారు రాహుల్.

"ఉదారవాద, లౌకిక విలువలను లక్ష్యం చేసుకొని భాజపా, ఆర్​ఎస్​ఎస్​ దేశంలో హింసను ప్రోత్సహిస్తున్నాయి. నా తండ్రి, నానమ్మ మృతి గురించి నాకు ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు నేను అనుభవించిన బాధను హింసను ప్రోత్సహించేవారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఈ బాధ.. ఆర్మీ జవాను కుటుంబానికి, పుల్వామాలో అమరులైన సీఆర్​పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు, కశ్మీరీలకు మాత్రమే అర్థమవుతుంది. ఇలాంటి మరణాలను నివారించడమే యాత్ర ప్రధాన ఉద్దేశం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు

rahul gandhi bharat jodo yatra
రాహుల్ గాంధీ

తనలా కశ్మీర్​లో యాత్ర చేయాలని భాజపా అగ్రనాయకులకు సవాల్ విసిరారు రాహుల్ గాంధీ. 'జమ్ములో ఒక్క భాజపా నేత కూడా ఇలా నడవరు. ఇక్కడ యాత్ర చేపట్టాలంటే వారికి భయం. భద్రతా కారణాలతో నన్ను కూడా ఇక్కడికి రావొద్దని చెప్పారు. నాపై దాడి చేస్తారని హెచ్చరించారు. బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నా. నా సొంతగడ్డపై, నా ప్రజలతో నడిచేందుకు సిద్ధమయ్యా. శత్రువులు నా చొక్కా రంగు మార్చేందుకు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? కానీ, కశ్మీర్ ప్రజలు నా చేతికి గ్రెనేడ్​లు ఇవ్వలేదు. గుండెల నిండా ప్రేమ ఇచ్చారు' అని రాహుల్ పేర్కొన్నారు.

'అందుకే స్వెటర్ ధరించలేదు..'
ఈ పాదయాత్రతో తానెంతో నేర్చుకున్నానని చెప్పారు. నలుగురు చిన్నారులు చలిలో బట్టలు లేకుండా వణుక్కుంటూ తన వద్దకు వచ్చారని.. వారిని చూశాక తాను కూడా జాకెట్లు, స్వెటర్లు ధరించవద్దని నిర్ణయించుకున్నానని తెలిపారు.

"పాదయాత్రలో నాకు ఒకరోజు విపరీతమైన కాలి నొప్పి వచ్చింది. కానీ నేను మరో 6-7 గంటల పాటు పాదయాత్ర చేయాల్సి ఉంది. ఇది చాలా కష్టమైన పని. ఈ సమయంలోనే ఓ చిన్నారి వచ్చి నా చేతిలో ఓ కాగితం పెట్టి.. హత్తుకుని పరిగెత్తింది. ఆ తర్వాత అందులో ఉంది చదివాను. 'మీ కాలు నొప్పి పెడుతోందని నాకు అర్థమైంది. నేను మీతో నడవలేకపోవచ్చు. కానీ నా మనసు మీతోనే నడుస్తోంది. మీరు నాకోసం, నా భవిష్యత్తు కోసం నడుస్తున్నారని తెలుసు' అని ఉంది. ఆ చిన్నారి మాటలను చదివాక నా నొప్పి అంతా మాయమైపోయింది."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

అంతకుముందు జమ్ము కశ్మీర్​లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్డున ఖర్గే, జోడో యాత్ర స్థావరం వద్ద రాహుల్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం తన సోదరి ప్రియాంక గాంధీతో రాహుల్ కాసేపు మంచులో సరదాగా అడుకున్నారు. శ్రీనగర్​లో భారీగా మంచు కురిసినప్పటికీ.. కార్యక్రమం సజావుగా సాగింది.

rahul gandhi bharat jodo yatra
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

2024 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్​ జోడో యాత్రను గతేడాది సెప్టెంబరులో ప్రారంభించారు. గతేడాది సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర ఈ ఏడాది జనవరి 30న జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో ముగిసింది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ 12 బహిరంగ సభలు నిర్వహించారు. అలాగే 13 విలేకర్ల సమావేశాల్లో మాట్లాడారు.

Last Updated :Jan 30, 2023, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.