తెలంగాణ

telangana

'పెద్ద నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం మాదే! అందుకే ప్రపంచంలో దేశ ఖ్యాతి పెరిగింది'

By

Published : Aug 6, 2023, 12:41 PM IST

Updated : Aug 6, 2023, 1:15 PM IST

PM Modi Railway Stations Redevelopment Project : అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉండే 508 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్​గా శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన మోదీ.. మూడు దశాబ్దాల తర్వాత పెద్ద నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం వల్ల ప్రపంచ వేదికపై భారత ఖ్యాతి ఇనుమడించిందని అన్నారు.

modi at railway stations redevelopment project
modi at railway stations redevelopment project

PM Modi Railway Stations Redevelopment Project : మూడు దశాబ్దాల తర్వాత పెద్ద నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం వల్ల.. ప్రపంచ వేదికపై భారత ఖ్యాతి ఇనుమడించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉండే 508 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్​గా శంకుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయి ఆధునిక సౌకర్యాలను.. ఈ స్టేషన్లలో కల్పిస్తామని చెప్పారు ప్రధాని మోదీ. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు డిజైన్లలో పెద్దపీట వేయనున్నట్లు వివరించారు. రైల్వేల అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ వివరించారు. రైల్వేలను కేవలం ప్రజలకు అందుబాటులో తేవడమే కాకుండా... ఆస్వాదించేలా చేయడమే తమ లక్ష్యమని మోదీ వెల్లడించారు. అమృత్ భారత్ స్టేషన్లు.. భారతీయ పురాతన వారసత్వానికి, ఆధునిక ఆకాంక్షలకు చిహ్నంగా నిలుస్తాయని మోదీతెలిపారు. ప్రతికూల రాజకీయాలకు అతీతంగా సానుకూల రాజకీయాలతో.. అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నామని మోదీ స్పష్టంచేశారు.

"దురదృష్టం కొద్దీ మన దేశంలో విపక్షాల్లో కొందరు ఇప్పటికీ వారు పనిచేయరు.. చేసేవారిని చేయనివ్వరు. ఈ విపక్షాల్లో కొందరు పార్లమెంటు కొత్త భవన నిర్మాణాన్ని వ్యతిరేకించారు. మేము కర్తవ్య పథ్ అభివృద్ధి పనులు చేపట్టాం. దానినీ వారు వ్యతిరేకించారు. మేము నేషనల్ వార్ మెమోరియల్‌ను నిర్మిస్తే దానిని ఆలోచన లేకుండా వ్యతిరేకించారు. సానుకూల రాజకీయ మార్గంలో మిషన్‌ మోడ్​లో మేము ముందుకు సాగుతున్నాం. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఎక్కడ ఏ ఓటు బ్యాంకు ఉన్నా వాటన్నిటికీ అతీతంగా దేశవ్యాప్తంగా అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశంలో ప్రస్తుతం ప్రతికూల రాజకీయాలు నడుస్తున్నాయి. క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని యావత్​ దేశం క్విట్​ అవినీతి, క్విట్​ కుటుంబ పాలన అంటూ నినదిస్తోంది."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

దేశ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. "రైల్వే స్టేషన్ల వద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌, గేమింగ్‌ జోన్‌లు ఏర్పాటు చేయనున్నాం. అభివృద్ధి చేశాక ఈ స్టేషన్లు మల్టీ మోడల్ హబ్‌గా మారనున్నాయి. అభివృద్ధి దిశగా దేశం పరుగులు పెడుతోంది" అని అన్నారు. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

27 రాష్ట్రాల్లోని 508 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకంలో.. 55 స్టేషన్లతో ఉత్తర్ ప్రదేశ్‌ అగ్రస్థానం దక్కించుకుంది. బిహార్‌లో 49, మహారాష్ట్రలో 44 స్టేషన్లను ఆధునీకరించనున్నారు. తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్‌లో 18 రైల్వే స్టేషన్లను.. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఆధునీకరించనున్నారు. ఇందుకోసం 24 వేల 470 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

తొలి దశలో అభివృద్ధి చేసే స్టేషన్ల వివరాలు
తెలంగాణ : హైదరాబాద్‌, జనగామ, ఆదిలాబాద్‌, మల్కాజిగిరి, భద్రాచలం రోడ్‌, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, ఉప్పుగూడ, కామారెడ్డి, కరీంనగర్‌, కాజీపేట, ఖమ్మం, మధిర, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, మలక్‌పేట, నిజామాబాద్‌, రామగుండం, తాండూరు, యాదాద్రి (రాయగిరి), జహీరాబాద్‌.

ఆంధ్రప్రదేశ్‌: పలాస, విజయనగరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, భీమవరం, నరసాపురం, నిడదవోలు, తెనాలి, రేపల్లె, పిడుగురాళ్ల, కర్నూలు, కాకినాడ టౌన్‌, తాడేపల్లిగూడెం, ఏలూరు, ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ.

Last Updated :Aug 6, 2023, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details