తెలంగాణ

telangana

నదిపై వెళ్తూ వంతెనను ఢీకొన్న నౌక- బ్రిడ్జి రెండు ముక్కలు- ఐదుగురు మృతి

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 1:07 PM IST

Updated : Feb 23, 2024, 1:30 PM IST

China Ship Bridge Accident : చైనాలో భారీ కంటైనర్ నౌక ఓ వంతెనను ఢీకొట్టింది. ఈ ఘటనలో అయిదుగురు మరణించారు. ప్రమాద సమయంలో వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలు ఒక్కసారిగా నీటిలో పడిపోయాయి.

Bridge Collapse In Guangzhou China
Bridge Collapse In Guangzhou China

China Ship Bridge Accident :చైనాలో గ్వాంగ్జూ నగరంలోని పెరల్‌ నదిపై అనూహ్యమైన ప్రమాదం జరిగింది. ఖాళీగా వెళ్తున్న ఓ భారీ కంటైనర్‌ నౌక పెరల్‌ నదిపై నిర్మించిన వంతెనను బలంగా ఢీ కొట్టింది. కంటైనర్‌ నౌక ఢీ కొట్టడం వల్ల భారీ వంతెన రెండు ముక్కలై పాక్షికంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో అయిదుగురు మరణించగా మరికొందరు గాయపడ్డారు.

నౌక ఢీకొట్టడం వల్ల రెండుగా విడిపోయిన వంతెన

ఖాళీ కంటైనర్లతో కూడిన నౌక ఫోష్‌మన్‌ నుంచి గ్వాంగ్జూ వైపు వెళ్తోందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే మార్గ మధ్యలో ఉన్న లిజింగ్షా వంతెనను బలంగా ఢీకొందని చెప్పారు. నౌక తాకిడికి వంతెన రెండు ముక్కలుగా విడిపోయింది. అదే సమయంలో బ్రిడ్జిపై వెళ్తున్న ఒక బస్సు, మోటారు సైకిల్‌ సహా ఐదు వాహనాలు వంతెన కింద ఉన్న నీటిలో పడ్డాయని చైనా అధికారులు వెల్లడించారు.

పెరల్​ నదిపై వంతెనను ఢీకొన్న కంటైనర్ నౌక

సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని చైనా అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో వంతెనపై వాహనాల రద్దీ తక్కువగా ఉందని లేకపోతే మరింత మంది మరణించి ఉండేవారని వివరించారు. ప్రమాదం అనంతరం వంతెన స్తంభాల మధ్యే కంటైనర్‌ నౌక చిక్కుకుపోయిందని అధికారులు వెల్లడించారు. నదిలో పడిపోయిన బస్సులో డ్రైవర్‌ మాత్రమే ఉన్నారని ప్రమాద మృతుల్లో ఆయనొకరని చైనా పోలీసులు తెలిపారు.

నదిలో పడిపోయిన బస్సులో ప్రయాణికులు లేకపోవడం వల్ల భారీ ప్రమాదం తప్పినట్లైంది. ప్రమాదానికి కారణమైన నౌక కెప్టెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. గ్వాంగ్జూ నగరం నుంచి ఆరుగురు డైవర్లతో అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ వంతెనను నౌకలు ఢీకొనే ముప్పు ఉండటం వల్ల నిర్మాణంలో మార్పులు చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీనిపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సముద్రంలో పడవబోల్తా-60 మందికి పైగా జలసమాధి
కొద్ది కాలం క్రితం ఇలాంటి ఘటనే లిబియాలో జరిగింది. వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడి మహిళలు, పిల్లలు సహా 60 మందికి పైగా మరణించారు. ఐక్యరాజ్య సమితి మైగ్రేషన్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. మధ్యదరాసముద్రమార్గం గుండా వెళ్తున్న క్రమంలో ఈ విషాద ఘటన జరిగింది. ఐరోపాలో మెరుగైన జీవనాన్ని కోరుకునే వారికి మధ్యదరా సముద్రం ఓ కీలకమైన, ప్రమాదకరమైన మార్గం. అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటికే ఇలా పడవలు మునిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పూర్తి వార్తను చదివేందుకుఈ లింక్​ పై క్లిక్ చేయండి.

పడవ బోల్తా- 8 మంది మృతి- 100మంది గల్లంతు

పడవ మునిగి 17 మంది మృతి.. 70 మంది గల్లంతు.. మృతదేహాలు దొరికే ఛాన్స్ కూడా లేకుండా..

Last Updated :Feb 23, 2024, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details