ETV Bharat / state

భూములు కొల్లగొట్టి కేసీఆర్‌ లక్ష కోట్లు పోగేసుకున్నారు: రేవంత్​ రెడ్డి

author img

By

Published : Apr 11, 2023, 7:07 PM IST

Updated : Apr 11, 2023, 7:39 PM IST

Revanthreddy fires on CM KCR: భూములు కొల్లగొట్టి సీఎం కేసీఆర్ లక్ష కోట్లు అక్రమంగా సంపాదించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ సంపాదనతో కేసీఆర్ దేశ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారన్న రేవంత్‌... ఉద్యమకారుడినని చెప్పుకున్న కేసీఆర్​కు వేల ఎకరాల భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

Revanthreddy
Revanthreddy

Revanthreddy fires on CM KCR : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్​పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబీకులు.. భారీగా దోచుకున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. గాంధీభవన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్​.. భూములు కట్టబెట్టడం ద్వారా సీఎం కేసీఆర్ రూ.లక్ష కోట్లు అక్రమంగా పోగేసుకున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం తమకు నచ్చిన వారికి భూములు కట్టబెడుతోంది: హైదరాబాద్​ ఖానామేట్​లో 41/14 సర్వే నంబర్​లో రూ. 800 కోట్లు విలువైన 8 ఎకరాల భూమిని వందకోట్లకే కేసీఆర్ కుటుంబం, యశోదా ఆసుపత్రి యాజమాన్యం దోపిడీ చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. యశోద ఆస్పత్రికి ప్రభుత్వం అప్పనంగా భూములు కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తమకు నచ్చిన వారికి భూములు కట్టబెడుతోందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడ్డాక భూములపై కేసీఆర్​ కుటుంబం కన్ను పడిందన్నారు. 2012లోనే ఖానామెట్‌లో ఎకరా రూ.12 కోట్లు ధరగా నిర్ణయించారన్న రేవంత్​.. తక్కువ ధరకు భూములు పొందిన కంపెనీలకు హెచ్‌ఎండీఏ నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. అలెగ్జాండ్రియా ఫార్మా, మారుతీ సుజుకీ కంపెనీలకు హెచ్‌ఎండీఏ నోటీసులు ఇచ్చిందన్నారు. మారుతీ సుజుకీ కంపెనీ ఎకరా రూ. 12 కోట్లు చొప్పున చెల్లించిందన్న రేవంత్​రెడ్డి... అలెగ్జాండ్రియా ఫార్మా మాత్రం భూమి ధర విషయంలో కోర్టుకెళ్లిందని తెలిపారు.

భూములు కొల్లగొట్టి కేసీఆర్‌ లక్ష కోట్లు పోగేసుకున్నారు: రేవంత్​ రెడ్డి

'అలెగ్జాండ్రియా ఫార్మాకు కేటాయించిన భూములపై కేసీఆర్‌ కుటుంబం కళ్లుపడ్డాయి. యశోద ఆస్పత్రికి ఇచ్చేందు కోసం అలెగ్జాండ్రియా ఫార్మాపై ఒత్తిడి తెచ్చారు. రవీంద్రరావు, కల్వకుంట్ల జగన్నాథరావు అలెగ్జాండ్రియా ఫార్మా భూములు కొట్టేయాలనుకున్నారు. రవీంద్రరావు, కల్వకుంట్ల జగన్నాథరావు అలెగ్జాండ్రియా ఫార్మా కంపెనీలో బలవంతంగా చేరారు. రవీంద్రరావు, జగన్నాథరావు, దేవేంద్రరావు హైకోర్టులో కేసు గెలుచుకుని భూమి దక్కించుకున్నారు. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లట్లేదు?.'-రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

కేసీఆర్​కు వేల ఎకరాల భూములు ఎలా వచ్చాయి: భూములు కట్టబెట్టడం ద్వారా కేసీఆర్‌ రూ.లక్ష కోట్లు అక్రమంగా పోగేసుకున్నారని రేవంత్​ ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును రాజకీయాల్లో పెట్టుబడి పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యమకారుడినని చెప్పుకున్న కేసీఆర్​కు వేల ఎకరాల భూములు ఎలా వచ్చాయి.. ఫామ్​హౌజ్​లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. పేద ప్రజలకు చెందాల్సిన సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ కేబీఆర్ పక్కన నమస్తే తెలంగాణకు 3వేల గజాలు ఎలా వచ్చిందో చెప్పాలన్న రేవంత్​... 5 అంతస్తులు కట్టాల్సిన బిల్డర్ 16 అంతస్తులు కడుతుంటే కేటీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

సర్కారు నిర్ణయంతో రాష్ట్రానికి రూ.700 కోట్ల నష్టం : కేసీఆర్‌ హైదరాబాద్​లో తన బంధువులకు 5 ఎకరాలను పరోక్షంగా కట్టబెట్టారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ మండిపడ్డారు. ఆ 5 ఎకరాల పక్కన ఉన్న 3 ఎకరాలను కూడా హస్తగతం చేసుకోవాలనుకున్నారు. హైటెక్‌ సిటీకి ఆనుకుని ఉన్న 3 ఎకరాల భూమిని గజానికి రూ. 36 వేల చొప్పున కట్టబెట్టారన్న రేవంత్​.. గజం రూ.80 వేలు ఉన్న భూమిని గజం రూ.36 వేలకే ఇచ్చేశారని ఆరోపించారు. 2016లో ఖానామెట్​లో ఎకరం రూ.33 కోట్లు ధరగా రెవెన్యూ అధికారులే నిర్ణయించారని రేవంత్​ పేర్కొన్నారు. కానీ యశోద ఆస్పత్రికి మాత్రం ఎకరం రూ. 18 కోట్లకే వేలంలో ఇచ్చేశారన్నారు. మొత్తం రూ.800 కోట్ల విలువైన 8 ఎకరాల భూమిని రూ.100 కోట్లకే ఇచ్చేశారన్న ఆయన... కేసీఆర్ సర్కారు నిర్ణయంతో రాష్ట్రానికి రూ.700 కోట్ల నష్టం వచ్చిందని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

Last Updated :Apr 11, 2023, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.