ETV Bharat / opinion

అమూల్ X నందిని.. 120 సీట్లపై 'పాల రాజకీయం' ఎఫెక్ట్​.. లాభం ఎవరికో?

author img

By

Published : Apr 11, 2023, 4:43 PM IST

అమూల్ వర్సెస్ నందిని! కర్ణాటకలో హాట్​టాపిక్ ఇదే. శాసనసభ ఎన్నికల వేడి ఓవైపు.. అమూల్ వర్సెస్ నందిని రచ్చ మరోవైపు. పాలు, పెరుగు వ్యాపారంపై ఎందుకింత రగడ? లోకల్​ వర్సెస్​ నాన్​ లోకల్​ వివాదంగా మారుతున్న ఈ వ్యవహారం.. ఏ పార్టీకి లాభదాయకంగా మారుతుంది?

amul vs nandini row
amul vs nandini row

శాసనసభ ఎన్నికల వేళ కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. కర్ణాటక పాల సమాఖ్య ఆధ్వర్యంలోని నందిని పాల ఉత్పత్తులకు పోటీగా గుజరాత్‌కు చెందిన అమూల్‌ సంస్థకు అవకాశం కల్పించడం రాజకీయంగా పెనుదుమారం రేపింది. గుజరాత్‌ రాష్ట్ర పాల సహకార సంస్థ బ్రాండ్‌- అమూల్‌, కర్ణాటక పాల సహకార సమాఖ్య బ్రాండ్‌(కేఎంఎఫ్)- నందిని కలిసి పనిచేయాలని కొద్ది నెలల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. అలాగే త్వరలోనే బెంగళూరులోనూ అమూల్‌ పాలు, పెరుగు అందుబాటులోకి రానున్నాయంటూ ఆ కంపెనీ ట్వీట్‌ చేసింది. ఈ రెండింటి నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అధికార బీజేపీపై మండిపడ్డాయి.

కర్ణాటకలో నందినిని(కేఎంఎఫ్​).. గుజరాత్​కు చెందిన అమూల్​కు అమ్మేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్​దీప్ సూర్జేవాలా ఆరోపించారు. మరోవైపు కర్ణాటకలో నందినిని అంతమొందించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి విమర్శించారు. బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 'ఒకే దేశం, ఒకే అమూల్​, ఒకే మిల్క్, ఒకే గుజరాత్​' నినాదంతో ముందుకు సాగుతోందని ఆయన చురకలంటించారు.

మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఖండించారు. కర్ణాటకలో అమూల్ ప్రవేశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ఆయన అన్నారు. 'అమూల్‌కు సంబంధించి మాకు పూర్తి స్పష్టత ఉంది. నందిని జాతీయ బ్రాండ్. ఇది కర్ణాటకకు పరిమితం కాదు. ఇతర రాష్ట్రాల్లో కూడా నందినికి గొప్ప బ్రాండ్​గా పేరుంది.' అని అన్నారు.

కర్ణాటకలో 'బ్రదర్స్ పాలిటిక్స్'​.. గాలి భార్య X తమ్ముడు.. జార్కిహోలి అన్నదమ్ములు ఢీ!

1. కర్ణాటకలో అమూల్ వ్యాపారం చేస్తే ఏంటి ఇబ్బంది?
గతేడాది డిసెంబరులో మండ్యలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ​(కేఎంఎఫ్​) మెగా డెయిరీ ప్రారంభోత్సవం సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 'అమూల్, నందిని కలిస్తే డెయిరీ రంగంలో అద్భుతాలు సృష్టించగలవు' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. నందిని డెయిరీని గుజరాత్​కు చెందిన అమూల్​లో విలీనం చేసే ఆలోచనగా కాంగ్రెస్​, జేడీఎస్ విమర్శించాయి. ఈ ఆరోపణల్ని అప్పట్లో అధికార బీజేపీ కొట్టిపారేసింది. మరోవైపు.. మార్చి నెలలో పెరుగు ప్యాకెట్లపై దహీ అని హిందీలో ప్రింట్ చేయాలని ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆదేశించింది. ఈ నిర్ణయంపై కూడా ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ పరిణామాల మధ్య.. మే నెలలో జరిగే ఎన్నికలకు ముందు అమూల్​-నందిని వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది.

2. అమూల్ ఇంతకు ముందు కర్ణాటకలో లేదా?
అమూల్ కొన్నేళ్ల కిందటే కర్ణాటకలో ప్రవేశించింది. వెన్న, నెయ్యి, పెరుగు, ఐస్‌క్రీమ్‌ వంటి పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. అమూల్ మాత్రమే కాదు.. దొడ్ల, హెరిటేజ్, తిరుమల, ఆరోక్య, మిల్కీ మిస్ట్( తమిళనాడు), నామ్‌ధారి, అక్షయకల్ప (కర్ణాటక) వంటి బ్రాండ్​లు కూడా కన్నడనాట వ్యాపారాలు చేస్తున్నాయి.

3. ప్రతిపక్షాల మాటేంటి?
"కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం నందిని పాల ఉత్పత్తుల కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. అప్పుడు రాష్ట్రంలో అమూల్​కు పోటీగా మరే బ్రాండ్​లు ఉండవు. కచ్చితంగా ప్రజలు అమూల్ ఉత్పత్తులను కొనుగోలు చేయమని బీజేపీ బలవంతం చేస్తుంది." అనేది విపక్షాల ఆరోపణ.

కిట్టూర్-కర్ణాటకలో బీజేపీ x కాంగ్రెస్​.. లింగాయత్‌లే కీలకం.. పీఠం ఎవరిదో?

4.అమూల్​-నందిని వివాదంపై బీజేపీ వైఖరి ఏంటి?
నందినిని అమూల్‌లో విలీనం చేసే ఆలోచన లేదని అధికార బీజేపీ చెబుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించి.. వారిలో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపిస్తోంది. బీజేపీ పాలనలోనే రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరిగిందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు.

5.పాల ఉత్పత్తి ఏమైనా తగ్గిందా?
బెంగుళూరు మిల్క్ యూనియన్ లిమిటెడ్ ప్రతి సంవత్సరం వేసవిలాగే ఈ ఏడాది కూడా పాల ఉత్పత్తి తగ్గిందని పేర్కొంది. పాల ఉత్పత్తి రోజుకు 90 లక్షల లీటర్ల నుంచి 75 లక్షల లీటర్లకు తగ్గిందని వెల్లడించింది.

6.నందిని బ్రాండ్ మార్కెట్ విలువ ఎంత?
గుజరాత్​కు చెందిన అమూల్ సంస్థ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద పాల సహకార సమాఖ్య నందినియే(కేఎంఎఫ్​). కేఎంఎఫ్ టర్నోవర్ రూ. 21వేల కోట్లని బెంగుళూరు మిల్క్ యూనియన్ లిమిటెడ్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు. 'అమూల్ ప్రతిరోజూ 1.8 కోట్ల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. KMF రోజుకు 90 లక్షల లీటర్లకు పైగా పాలను ఉత్పత్తి చేస్తుంది.' అని నాగరాజు వెల్లడించారు.

7.నందిని మార్కెట్ లీడర్ ఎందుకు?
'నందిని పాలు స్వచ్ఛంగా ఉంటాయి. కల్తీ అసలు ఉండదు. అందుకే నందిని పాలకు మంచి మార్కెట్ ఉంది.' అని బెంగుళూరు మిల్క్ యూనియన్ లిమిటెడ్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు.

'అమెరికా మోడల్'​తో బీజేపీ మాస్టర్ ప్లాన్.. కర్ణాటక ఎన్నికల్లో ప్రయోగం.. గెలుపే లక్ష్యం!

8.కర్ణాటక కాకుండా KMF తన ఉత్పత్తులను ఇంకెక్కడ విక్రయిస్తుంది.?
నందిని బ్రాండ్ తమ పాల ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రలో విక్రయిస్తోంది.

9.నందిని బ్రాండ్​ తన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తే తప్పులేదు. కర్ణాటకలో అమూల్ వ్యాపారం చేయడంలో తప్పేంటి?
మహారాష్ట్రలో మహానంద్​ డైరీ ఉండేది. గుజరాత్‌ రాష్ట్ర పాల సహకార సంస్థ అమూల్ మహారాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి మహానంద్ వ్యాపారం పడిపోయింది. అదే విధంగా ఏపీ, తెలంగాణలో కూడా అమూల్ రాకతో పాల సహకార సంస్థలు నెమ్మదించాయనే వాదన ఉంది.

10. నందిని వివాదంతో బీజేపీకి ఇబ్బందులేంటి?
కన్నడ అస్థిత్వంతో ముడిపడ్డ నందిని బ్రాండ్‌ను బీజేపీ ముంచేయాలని చూస్తోందని, అమూల్‌కు నందినిని కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో మరోసారి అధికారం నిలుపుకోవాలంటే బీజేపీ ఈ విమర్శలను తిప్పికొట్టాలి. లేదంటే మండ్య, మైసూరు, రామనగర, కోలార్‌, దావణగెరె జిల్లాలోనే దాదాపు 120 నియోజకవర్గాలో అధికార బీజేపీకి తలనొప్పులు తప్పవు.

11.పాల సహకార రంగానిని బీజేపీ చేసిన సాయం ఏంటి?
KMFలో గత కొన్నాళ్లుగా జేడీఎస్​దే హవా. మాజీ ప్రధాని దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్​డీ రేవన్న తొమ్మిదేళ్ల పాటు కేఎంఎఫ్ ఛైర్మన్​గా ఉన్నారు. 2019లో పాల సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. అరభావి ఎమ్మెల్యే కేఎంఎఫ్ అధ్యక్షుడిగా బాలచంద్ర జార్ఖిహోళిని చేసింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న బీఎస్ యుడియూరప్ప పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.2 అదనపు ప్రోత్సాహకాన్ని అందించారు.

12. అమూల్​ స్పందన ఏంటి?
నందిని, అమూల్ మధ్య మంచి అనుబంధం ఉందని అమూల్ ఎండీ జయన్ మోహతా అన్నారు. భవిష్యత్తులోనూ అది కొనసాగుతుందని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.