ETV Bharat / bharat

'అమెరికా మోడల్'​తో బీజేపీ మాస్టర్ ప్లాన్.. కర్ణాటక ఎన్నికల్లో ప్రయోగం.. గెలుపే లక్ష్యం!

author img

By

Published : Apr 5, 2023, 6:42 AM IST

కర్ణాటకలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు భారతీయ జనతా పార్టీ.. వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. అభ్యర్థుల ఎంపిక వేళ.. అసంతృప్తులకు చెక్‌ పెట్టేలా.. సరైన అభ్యర్థిని ఎంపిక చేసేలా.. అమెరికా విధానాన్ని అవలంబించింది. ప్రైమరీ విధానంలో అంతర్గత ఎన్నికల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ విధానం ద్వారా అసమ్మతికి చెక్‌ పెట్టి విజయావకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులను ఎన్నికల రణ క్షేత్రంలోకి దింపేందుకు పకడ్బందీ ప్రణాళిక అమలు చేసింది.

karnataka assembly election 2023 primary strategy
karnataka assembly election 2023 primary strategy

కర్ణాటకలో శాసనసభ ఎన్నికల వేడి రాజుకుంది. మే 10న ఒకే విడతలో ఎన్నికలు జరగనుండడం వల్ల అధికార ప్రతిపక్షాలు సత్తా చాటేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌, జేడీఎస్​ పార్టీలు.. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా.. అధికార బీజేపీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపిక వేళ.. అస‌మ్మతికి చెక్‌ పెట్టేందుకు అమెరికా ప్రైమరీ విధానాన్ని అమలు చేసింది. ఈ ఎన్నికల్లో ఈ కొత్త ప్రయోగం ద్వారా.. అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో దించేందుకు అక్కడి పార్టీలు అమలు చేసే ప్రైమరీ విధానాన్ని.. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అనుసరించింది.

కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా.. ఈ స్థానాలకు బీజేపీ నాయకత్వం నియోజకవర్గాల స్థాయిలో ప్రైమరీలు నిర్వహించింది. ఈ ఎన్నికల ద్వారా ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు మెరుగైన అభ్యర్థులను కమలం పార్టీ ఎంపిక చేసింది. ప్రతి అసెంబ్లీ స్థానంలో సగటున 150 మంది ఓటేశారు. నియోజకవర్గ స్థాయిలో బీజేపీ ఆఫీసు–బేరర్లు, మండల కమిటీ అధ్యక్షులు, సభ్యులు, మహిళా మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఓబీసీ మోర్చా, యూత్‌ మోర్చా, రైతు మోర్చా, మైనార్టీ మోర్చా సభ్యులు ఓటు వేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రైమరీలను పర్యవేక్షించడానికి ఇద్దరు సీనియర్‌ నేతలను అధిష్ఠానం నియమించింది. 224 నియోజకవర్గాల్లో ప్రైమరీలు సజావుగా ముగియడం వల్ల.. అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించే పనిలో బీజేపీ నిమగ్నమైంది.

అసమ్మతి వర్గాలు, అంతర్గత కుమ్ములాటల మధ్య అందరినీ సంతృప్తిపరుస్తూ సమర్థుల్ని ఎంపిక చేసేందుకు ఈ ప్రైమరీ విధానం ఉపయోగ పడుతుందని బీజేపీ నేతలు చెప్తున్నారు. అంతర్గత ఎన్నిక ద్వారా నేతలు, కార్యకర్తల అభిప్రాయానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని.. ఎక్కువ మందికి నచ్చిన అభ్యర్థే ఎన్నికల్లో పోటీకి దిగుతాడని బీజేపీ కర్ణాటక నేతలు చెప్తున్నారు. అసమ్మతిని చల్లార్చడానికి, అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి రావడానికి ప్రైమరీలు దోహదపడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. కానీ ఈ ప్రైమరీ విధానం కమలం పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో గుబులు పెంచుతోంది. ఈసారి తమ టికెట్‌ గల్లంతు అవుతుందని, తమ స్థానాల్లోకి కొత్త అభ్యర్థులు వస్తారని బెంబేలెత్తిపోతున్నారు. అయితే, గెలిచే సామర్థ్యం ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ఈ నెల 10వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు.

2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌... ఇలాంటి ప్రైమరీ ప్రయోగమే చేసింది. దీనికి 'ఎంచుకో, ఎన్నుకో' అని పేరు పెట్టింది. ఆశావహుల నుంచి దరఖాస్తు రుసుము కింద రూ.2 లక్షలు వసూలు చేసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్‌ నాయకత్వం వసూళ్ల ప్రక్రియగా మార్చేసిందని బీజేపీ విమర్శించింది. ఇప్పుడు తాము పూర్తి ఉచితంగా ఈ ప్రక్రియ చేపడుతున్నామని వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.