ETV Bharat / opinion

కర్ణాటకలో 'బ్రదర్స్ పాలిటిక్స్'​.. గాలి భార్య X తమ్ముడు.. జార్కిహోలి అన్నదమ్ములు ఢీ!

author img

By

Published : Apr 9, 2023, 5:22 PM IST

karnataka elections 2023 brother politics
karnataka elections 2023 brother politics

కర్ణాటకలో శాసనసభ ఎన్నికల వేడి రాజుకుంది. మే 10న ఒకే విడతలో జరగనున్న ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాలు సత్తా చాటేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. అయితే కన్నడ రాజకీయాల్లో 'బ్రదర్స్​ పాలిటిక్స్​' ఆసక్తికరంగా మారాయి. బ్రదర్స్ పాలిటిక్స్​లో ఉన్న ఆ కీలక నేతలు ఎవరు? వారు ఏఏ పార్టీల్లో ఉన్నారు? వారి పరిస్థితేంటి?

కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడం వల్ల అధికార, ప్రతిపక్షాలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. బీజేపీ, కాంగ్రెస్​ మధ్య ప్రధాన పోటీ ఉండగా.. కుటుంబ పార్టీ జేడీ(ఎస్​) మరోసారి కింగ్​మేకర్​ కావాలని ఆశిస్తోంది. అయితే ఈ సారి రాష్ట్ర రాజకీయాల్లో 'బ్రదర్స్​ పాలిటిక్స్'​ ఆసక్తికరంగా మారాయి. కొందరు అన్మదమ్ములు ఒకే పార్టీలో ఉండగా.. మరికొందరు వేర్వేరు పార్టీల్లో ఉండి పోటీ పడుతున్నారు. కుటుంబ సంబంధాలను పక్కన పెట్టి.. రాజకీయ సమరంలోకి దిగుతున్నారు! వారెవరు? ఈ ఎన్నికల్లో ఆ బ్రదర్స్​ పరిస్థితేంటో తెలుసుకుందాం.

'గాలి' సోదరులు..
కర్ణాటక 'బ్రదర్స్​ పాలిటిక్స్'​లో గాలి సోదరులు కీలకం. 2008లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో వివాదాస్పద మైనింగ్​ వ్యాపారి గాలి జానర్దన రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. రాష్ట్రంలో ఆపరేషన్​ ఆకర్ష్​ను గాలి సోదరులే తొలిసారి ప్రారంభించారు. అయితే వీరి కుటుంబంలో గాలి జనార్ధన రెడ్డితో పాటు గాలి కరుణాకర రెడ్డి, గాలి సోమశేఖర రెడ్డి , రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్నారు. ఈ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బి. శ్రీరాములు కూడా కన్నడ రాజకీయాల్లో ముఖ్యుడు. గాలి సోదరులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారినా.. బళ్లారిపై వారి పట్టు మాత్రం చెక్కుచెదరలేదనే చెప్పొచ్చు.

దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌తో అనుబంధం ఉన్న గాలి సోదరులు బీజేపీలో చేరడం.. వారికి ఒక్కసారిగా రాజకీయ గుర్తింపు తెచ్చిపెట్టింది! 1999 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో బళ్లారి నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీపై సుష్మా స్వరాజ్ పోటీ చేశారు. ఆ సమయంలో సుష్మ ఓడిపోయినా.. ఆమెతో గాలి సోదరులు, శ్రీరాములు సన్నిహితంగా మెలిగినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డితో కూడా గాలి సోదరులకు మంచి సంబంధాలు ఉన్నాయి.

karnataka elections 2023 brother politics
'గాలి' సోదరులు

2001లో గాలి సోదరులు రూ.10 లక్షల వ్యయంతో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)ని ప్రారంభించారు. తొమ్మిదేళ్లలో ఆ కంపెనీ దాదాపు రూ.3,000 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. జనార్ధనరెడ్డి తన రాజకీయ సంబంధాలను ఉపయోగించుకుని తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి ఇతర మైనింగ్ కంపెనీలను ఒకదాని తర్వాత ఒకటి స్వాధీనం చేసుకున్నారు! 2008లో అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత యడియూరప్ప ప్రభుత్వంలో గాలి జనార్దన రెడ్డి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్​లోని కడపలో ఉన్న బ్రాహ్మణి స్టీల్స్‌ బిజినెస్​లో ఆ రాష్ట్ర ప్రస్తుత సీఎం జగన్మోహన రెడ్డితో ఆయన భాగస్వామి అయ్యారు. ఆ సమయంలో గాలి సోదరులు, శ్రీరాములు విలాసవంతమైన జీవనం గడిపారు. వారు దిల్లీలో లేదా మరేదైనా సమావేశా​లకు ప్రత్యేక​ హెలికాప్టర్​లోనే వెళ్లి వచ్చేవారు. అప్పట్లో వారికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 24×7 ఫ్లయింగ్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది.

karnataka elections 2023 brother politics
గాలి జనార్దన రెడ్డి ఫ్యామిలీ

అయితే ఇటీవలే గాలి జనార్దన రెడ్డి.. బీజేపీకి గుడ్​బై చెప్పి కల్యాణ రాజ్య ప్రగతి పేరుతో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారు. పార్టీని స్థాపించే సమయంలో బీజేపీతో తన బంధంపై గాలి జనార్దన్​ రెడ్డి స్పష్టతనిచ్చారు. తాను కమలం పార్టీలో సభ్యుడ్ని కాదని తెలిపారు. ప్రతి పల్లెకు, గడప గడపకూ వెళ్తానని.. కర్ణాటకను సంక్షేమ రాజ్యంగా మారుస్తానని హామీ ఇచ్చారు. గంగావతి నుంచి తాను పోటీ చేస్తానని చెప్పిన జనార్దన్‌రెడ్డి.. బళ్లారి నుంచి తన భార్య అరుణ లక్ష్మీ పోటీలో ఉంటారని వెల్లడించారు. అయితే బళ్లారి నుంచి బీజేపీ టికెట్​ మీదే తాను బరిలో ఉంటానని ఇటీవల గాలి సోమశేఖర్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ వదిన- మరిది మధ్య గట్టి పోటీ ఉండనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మాజీ సీఎం కుమారస్వామి సోదరులు..
మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ కుమారులు కుమారస్వామి, రేవన్న.. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు కుమారస్వామి ముఖ్యమంత్రిగా పనిచేయగా.. రేవన్నకు అవకాశం రాలేదు. కుమారస్వామి రాజకీయాల్లో ఉన్నంత వరకు.. రేవన్నకు సీఎం పదవి అందని ద్రాక్షేనని ఆయన సన్నిహితులు అంటున్నారు.

కుమారస్వామి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు.. రేవన్న 'సూపర్​ సీఎం'గా పేరు సంపాదించారు. రాష్ట్ర పరిపాలనలో రేవన్న అధికార పాత్ర పోషించారు. కుమారస్వామి నుంచి ఏవైనా ఫైళ్లకు అనుమతి కావాలంటే ఆయనను ఒప్పించే ఏకైక వ్యక్తి రేవన్న అని అంతా భావించారు. అది గౌరవమని కొందరు.. భయమని మరికొందరు అంటుంటారు. అన్నయ్య అడిగేసరికి కుమారస్వామి.. ఓకే చెప్పేస్తారని అనేవారు.

karnataka elections 2023 brother politics
రేవన్న, కుమారస్వామి

రేవన్న.. అట్టడుగు స్థాయి నుంచి కీలక రాజకీయ నాయకుడిగా ఎదిగారు. తమ సొంత జిల్లా హాసన్​లో పంచాయతీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత దేవెగౌడ.. దేశ ప్రధాని అయినప్పుడు శక్తిమంతంగా ఎదిగారు. 1994లో హోలెనరసిపుర అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది జేహెచ్​ పటేల్​ క్యాబినెట్​లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చేశారు. తన జిల్లాలోని పాల సంఘాలపై రేవన్నకు గట్టి పట్టు ఉంది. 13 సంవత్సరాలుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. పలు సంస్కరణలకు హామీలు కూడా ఇచ్చారు. దాని ద్వారా రేవన్న.. రైతుల విశ్వాసాన్ని, గౌరవాన్ని సంపాదించారు.

డీకే శివకుమార్​ సోదరులు..
కర్ణాటకలో ప్రదేశ్​ కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డీకే శివకుమార్​ సోదరులు కూడా రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. 1962లో కనకపురలో జన్మించిన డీకే శివకుమార్​.. ఆర్​సీ కాలేజీలో చదువుతున్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత యువజన కాంగ్రెస్​లో​ చేరారు. 1983-85 వరకు కర్ణాటక రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా శివకుమార్​ పోటీ చేసి గెలిచారు. రెండేళ్ల తర్వాత బంగారప్ప క్యాబినెట్​లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన మంత్రిగా ఘనత సాధించారు.

అయితే అక్రమ మైనింగ్​ సహా శాంతి నగర్​ హౌసింగ్​ సొసైటీ కుంభకోణం కేసులో ప్రమేయం ఉన్నట్లు శివకుమార్ అప్పట్లో పలు​ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో శివకుమార్​.. కాంగ్రెస్​ పార్టీలో మంచి పట్టు సాధించారు. హస్తం పార్టీలో కీలక నేతగా ఉన్నారు.

karnataka elections 2023 brother politics
డీకే సురేశ్​, డీకే శివకుమార్​

ప్రస్తుతం డీకే శివకుమార్​ తమ్ముడు డీకే సురేశ్ కుమార్​​.. బెంగళూరు రూరల్​ ఎంపీగా లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సొంత జిల్లా అయిన రామనగర నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా సురేశ్​ను బరిలోకి దించే అవకాశం ఉందని శివకుమార్ గత నెలలో తెలిపారు. "సురేశ్​ను రామనగర నియోజకవర్గంలో పోటీకి దించాలని నాకు సందేశం వచ్చింది. దాని గురించి ఇంకా సురేశ్​తో చర్చించలేదు. ఆ విషయంపై ఆలోచిస్తున్నాను" అని ఆయన తెలిపారు.

అయితే రామనగర నియోజకవర్గంలో జేడీ(ఎస్​)పార్టీ.. మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిని రంగంలో దించాలని యోచిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్​.. డీకే సురేశ్​ను పోటీకి దింపితే.. అక్కడ ఇద్దరు వొక్కిలగ నేతల మధ్య గట్టి పోటీ ఉండనుంది!

జార్కిహోలి సోదరులు..
కర్ణాటకలోని 224 అసెంబ్లీ సీట్లలో బెళగావి జిల్లాకు చెందినవి 18 ఉన్నాయి. అయితే ఈ జిల్లా రాజకీయాల్లో జార్కిహోలి సోదరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. జార్కిహోలి ఐదుగురు సోదరుల్లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్​ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉండగా.. మరొకరు ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చారు. రమేశ్​ జార్కిహోలి.. 2019లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి గొకాక్​ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రమేశ్​ సొదరుడు బాలచంద్ర.. అరభవి నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

మరో జార్కిహోలి సోదరుడు సతీశ్​.. కాంగ్రెస్​ ఎమ్మెల్యేగా, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్​గా సేవలందించారు. మరో అన్నదమ్ముడు లఖన్​ జార్కిహోలి.. ఇటీవలే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. మరో సోదరుడు భీమాషి.. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చారు. అయితే వీరంతా బెళగావి జిల్లా కీలక రాజకీయ నాయకులుగా పేరు సంపాదించుకున్నారు. 2019లో కాంగ్రెస్‌ పార్టీ ఫిరాయించిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్‌ కుమతల్లి, శ్రీమంత్‌ పాటిల్‌కు కూడా జార్కిహోలీలు మద్దతు తెలుపుతున్నారు.

karnataka elections 2023 brother politics
జార్కిహోలి బ్రదర్స్​

గత ఎన్నికల్లో జార్కిహోలీ సోదరులు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. ప్రత్యామ్నాయ నాయకత్వం ఏర్పడకుండా చూసేందుకు ఈ ప్రయత్నమని అంతర్గత వర్గాలు అంటున్నాయి. శాసనమండలిలో సాధారణ మెజారిటీకి ఒక్క సీటు తక్కువ ఉన్న బీజేపీకి కీలక బిల్లులు ఆమోదం పొందాలంటే లఖన్ జార్కిహోలీ మద్దతు అవసరం కావచ్చు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై రమేశ్​, సతీశ్​ పోటీపడగా.. బాలచంద్రను బీజేపీ రంగంలోకి దించింది. గతంలో గొకాక్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున లఖన్‌ తన సోదరుడు రమేశ్​పై పోటీ చేశారు.

కర్ణాటకలో మే 10న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 224 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నువ్వా-నేనా స్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. జేడీఎస్​ కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.