ETV Bharat / city

లంపీ స్కిన్​ వ్యాధి, ముందస్తు చర్యలు చేపట్టిన ప్రభుత్వం

author img

By

Published : Aug 29, 2022, 12:35 PM IST

Lumpy skin disease in Telangana 9 రాష్ట్రాల నుంచి వచ్చే పశు రవాణాపై కేంద్రం తాజాగా నిషేధం విధించింది. లంపీస్కిన్​ వ్యాధి ఈ రాష్ట్రాల పశువులకు సోకడం వల్ల చనిపోతున్నాయని వీటి రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అన్ని జిల్లాల అధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యాధి సోకితే తీసుకోవలసిన జాగ్రత్తలను అధికారులు వివరించారు.

Lumpy skin disease
లంపీస్కిన్​ వ్యాధి

Lumpy skin disease in Telangana:దేశవ్యాప్తంగా లంపీస్కిన్‌ వ్యాధి విస్తరణపై ఆందోళన పెరుగుతోంది. తెలంగాణలో పశువులకు ఇది సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ తాజాగా అన్ని జిల్లాల అధికారులకు అత్యవసర ఆదేశాలను జారీచేసింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏ పశువును తీసుకొచ్చినా సరిహద్దుల్లోనే వాటిని అడ్డుకుని అక్కడే 15 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించింది.

దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ వ్యాధి సోకి 27 వేల పశువులు చనిపోయాయని, ఇంకా విస్తరిస్తున్నందున రాష్ట్రాల మధ్య రవాణాపై దృష్టి పెట్టాలని కేంద్రం హెచ్చరించింది. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, హరియాణ, జమ్మూకాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడంపై పూర్తిగా నిషేధం విధించినట్లు కేంద్రం తెలిపింది.

తెలంగాణలోకి నిత్యం తీసుకొస్తున్న వాటి వివరాలను ఇంతకాలం ఎవరూ పక్కాగా సేకరించలేదు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉండే పశువైద్యాధికారులు కొత్తగా వచ్చే పశువుల వివరాలను సేకరించాలని వాటిని క్వారంటైన్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

అందుబాటులో 20 లక్షల డోసుల వ్యాక్సిన్లు.. లంపీస్కిన్‌ వ్యాధి సోకిన పశువులకు చర్మంపై పెద్ద పెద్ద కురుపులు, దద్దుర్లు వస్తాయి. వీటిపై వాలే దోమలు, ఈగలు అక్కడి నుంచి వైరస్‌ను ఇతర పశువులకు వ్యాపింపచేస్తున్నాయి. పశువు శరీర లోపలి భాగాలకు వ్యాధి విస్తరించి క్రమంగా చనిపోతున్నాయి. దీన్ని నియంత్రించేందుకు తెలంగాణలో వ్యాక్సిన్‌ ఇస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్‌ రాంచందర్‌ తెలిపారు. గతంలో పశువులకు అమ్మతల్లి వంటి వ్యాధులు రాకుండా ఇచ్చే ఈ వ్యాక్సిన్‌ లంపీస్కిన్‌ రాకుండా నియంత్రించేందుకు బాగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల డోసులు నిల్వ ఉన్నాయి. 35 లక్షల డోసులను ఇతర రాష్ట్రాలకు ఇచ్చాము. పక్షం రోజుల్లో మరో 40 లక్షల డోసులు ఉత్పత్తి చేస్తాము. ఈ వ్యాధి సోకితే సాధారణంగా రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉన్న పశువులకైతే 2 లేదా 3 వారాల్లో తగ్గుతుంది. వ్యాధి ముదిరితే కొన్ని చనిపోతున్నాయి. వ్యాధి తగ్గినా కొంతకాలం పాటు పాల ఉత్పత్తి 20 శాతం వరకూ తగ్గుతుందని డాక్టర్‌ రాంచందర్‌ వివరించారు. వ్యాధి సోకిన పశువులకు జ్వరం అధికంగా ఉంటే పారాసిటమాల్‌తో పాటు యాంటీబయాటిక్స్‌ మందులు కూడా వాడాలని పశువైద్యులకు సూచించినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.