రాంచీలో స్వైన్ ఫ్లూ కలకలం, ఆఫ్రికన్ ఫీవర్​కు 3 వేల పందులు బలి

author img

By

Published : Aug 28, 2022, 9:14 PM IST

swine flu

swine flu in Ranchi ఝార్ఖండ్​లో ముగ్గురికి స్వైన్​ ఫ్లూ సోకింది. వీరందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఆఫ్రికన్ స్వైన్​ ఫీవర్​ ఝార్ఖండ్, మధ్యప్రదేశ్​లో కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్​తో 3 వేల పందుల మరణించినట్లు అధికారులు తెలిపారు.

swine flu in Ranchi: ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో మూడు స్వైన్ ​ఫ్లూ కేసులు నమోదయ్యాయి. బాధితులను రాంచీలోని భగవాన్‌ మహావీర్‌ మెడికల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మరో ఇద్దరు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని, వారికి సంబంధించిన రిపోర్టులు సోమవారం వస్తాయని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

రాంచీకి చెందిన 37 ఏళ్ల మహిళకు, ధన్​బాద్​కు చెందిన 56 ఏళ్ల మహిళకు, బంగాల్​లోని పురులియాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి స్వైన్​ఫ్లూ నిర్ధరణ అయినట్లు అధికారులు వెల్లడించారు. రోగులు మొదట కొవిడ్ పరీక్ష చేయించుకోగా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. అయితే వారికి వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకినట్లు అనుమానం రావడం వల్ల పరీక్షలు చేయగా.. స్వైన్‌ ఫ్లూగా తేలిందని హాస్పిటల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ విజయ్‌ మిశ్రా పేర్కొన్నారు.

"రోగులకు ఎటువంటి ప్రయాణ చరిత్ర లేదు. పలువురు రోగులు కొవిడ్‌ లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్నారు. టెస్టుల్లో నెగెటివ్‌గా వచ్చిన సమయంలో తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు. అయితే కొవిడ్‌ లక్షణాలు ఉండి.. నెగెటివ్‌ వచ్చిన వారంతా స్వైన్‌ ఫ్లూ పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే మరింత మందికి స్వైన్​ఫ్లూ సోకుతుంది."
-విజయ్‌ మిశ్రా, భగవాన్ మహావీర్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్

మరోవైపు, రాంచీలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం సృష్టిస్తోంది. జులై 27 నుంచి ఇప్పటి వరకు 800కు పైగా పందులు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వల్ల మరణించాయని అధికారులు తెలిపారు. భారత్​లో మొదటి సారిగా అసోంలో ఆఫ్రికన్ స్వైన్ పీవర్​ కేసులు బయటపడ్డాయి.

"ఆగస్టు నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు 800కు పైగా పందులు మరణించాయి. పందుల శాంపిళ్లను భోపాల్ ల్యాబ్​కు పరీక్షల నిమిత్తం పంపాం. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 1,000 పందులు చనిపోయాయి. ఇప్పటివరకు రాంచీలోనే ఎక్కువ పందులు మరణించాయి. అయినప్పటికి రాష్ట్రంలోని 24 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. పందుల పెంపకందారులు వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి మాంసం అమ్మకాలను నిలిపివేయాలి."
-పశు సంవర్ధకశాఖ అధికారులు

మరోవైపు మధ్యప్రదేశ్​ రీవా జిల్లాలోనూ ఆఫ్రికన్​ స్వైన్​ ఫీవర్​ కలకలం సృష్టిస్తోంది. గత రెండు వారాల్లో రీవా జిల్లాలోనే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్​తో 2,000 పందులు మరణించినట్లు అధికారులు తెలిపారు. పంది మాంసం కొనుగోలుపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. భోపాల్​లోని ల్యాబ్​కు శాంపిళ్లను పంపగా ఆఫ్రికన్ ఫీవర్ బయటపడిందని వెల్లడించారు.

ఆఫ్రికన్ స్వైన్​ ఫీవర్ అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. ఈ వ్యాధి పందులకు సోకడం వల్ల అవి మరణిస్తాయి. పందుల నుంచి మనుషులకు సోకే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధికి ఇప్పటివరకు టీకా అందుబాటులోకి రాలేదు.

ఇవీ చదవండి: రష్యా, ఉక్రెయిన్​ యుద్ధాన్ని మోదీ ఆపారన్న రాజ్​నాథ్​ సింగ్​

బాలికపై వేధింపులు, దళితులన్న కారణంతో పోలీసుల నిర్లక్ష్యం, మరో ముగ్గురిపైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.