ETV Bharat / bharat

దేశంలోకి మరిన్ని చీతాలు.. బయల్దేరిన స్పెషల్ విమానం.. ఎప్పుడు వస్తాయంటే?

author img

By

Published : Feb 16, 2023, 4:08 PM IST

భారత్​కు మరో 12 చీతాలు రానున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని కేంద్రం పంపించింది. భారత్​కు వచ్చే వాటిలో ఏడు మగ, ఐదు ఆడ చీతాలు ఉన్నాయి.

center will bring 12 more leopards to the country
మరో 12 చిరుతలను దేశానికి తీసుకురానున్న కేంద్రం

74 ఏళ్ల తర్వాత దేశంలో చీతాలను ప్రవేశపెట్టిన భారత సర్కారు.. వాటి సంఖ్యను పెంచేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే నమీబియా నుంచి 8 చీతాలను భారత్​కు తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం.. తాజాగా దక్షిణాఫ్రికా నుంచి మరిన్ని చీతాలను రప్పిస్తోంది. ఫిబ్రవరి 18న 12 చీతాలు దక్షిణాఫ్రికా నుంచి భారత్​కు చేరుకుంటాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. ఈమేరకు ప్రత్యేక వసతులతో కూడిన విమానాన్ని కేంద్రం ఆ దేశానికి పంపించింది. భారత్​కు తీసుకురానున్న వాటిలో ఏడు మగ, ఐదు ఆడ చీతాలు ఉండనున్నాయి. మధ్యప్రదేశ్​లోని కునో జాతీయ పార్క్​కు ఈ 12 చిరుతలను అధికారులు తరలించనున్నారు.

1948లో దేశంలో చీతాలు అంతరించిపోయాయి. గతేడాది సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా ఎనిమిది చీతాలను కునో పార్క్​లోకి విడిచిపెట్టారు. వాటిలో ఐదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి. దీంతో 74 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చీతాలు దేశంలోకి వచ్చినట్లైంది. ప్రస్తుతం రెండో దశలో భాగంగా 12 చీతాలను రప్పిస్తున్నారు. ఈ చీతాల కోసం కునో పార్క్​లో ప్రత్యేకంగా 10 ఎన్​క్లోజర్లను జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఏర్పాటు చేసింది.

గురువారం ఉదయం గాజియాబాద్​లోని హిండన్ వైమానిక స్థావరం నుంచి సీ17 గ్లోబ్​మాస్టర్ విమానం బయలుదేరి వెళ్లింది. శనివారం ఉదయం 10 గంటలకు మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్ ఎయిర్​ఫోర్స్ స్టేషన్​కు చీతాలు చేరుకోనున్నాయని అధికారులు వెల్లడించారు. భారత్​కు పంపనున్న చీతాలను దక్షిణాఫ్రికా అధికారులు క్వారంటైన్​లో ఉంచారు. ప్రస్తుతం కునో పార్క్​లో ఉన్న ఎనిమిది చీతాలు మంచి ఆరోగ్యంతో ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే వాటిలో ఒక ఆడ చిరుతకు క్రియాటినిన్ స్థాయిలు పెరగటం వల్ల అది అస్వస్థతకు గురైంది. అయితే చికిత్స అందించటం వల్ల ప్రస్తుతం ఆ చిరుత కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.

దేశంలో కొత్త చీతాల సంఖ్య వృద్ధి చెందాలంటే కనీసం 12-14 చీతాలు అవసరమవుతాయి. శనివారం భారత్​కు చేరుకొనే చీతాలను పరిగణలోకి తీసుకుంటే దేశంలో వాటి సంఖ్య 20కి చేరుతుంది. వచ్చే పదేళ్ల వరకు ఏటా 12 చీతాలను దేశంలోకి దిగుమతి చేసుకునేలా కేంద్రం ఇదివరకే ప్రణాళికలు రచించింది. ప్రపంచంలో దాదాపు 7వేలకు పైగా చీతాలు ఉన్నట్లు అంచనా. అందులో మెజారిటీ ప్రాణులు దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్​వానాలో ఉంటాయి.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.