ETV Bharat / bharat

దివ్యాంగులకు మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులు.. వారిని భయపెట్టేందుకు రెండు కోతులు!

author img

By

Published : Feb 16, 2023, 1:17 PM IST

అనాథ ఆశ్రమాల ముసుగులో మానసిక రోగులపై ఇటీవల కాలంలో ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. మానసిక దివ్యాంగుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు ఆశ్రమ నిర్వాహకులు. మత్తుమందు ఇచ్చి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా వారిపై దాడి చేసేందుకు రెండు కోతులను సైతం పెంచుతున్నారు. ఇదంతా కలెక్టర్ దృష్టికి చేరడం వల్ల అసలు విషయం బయటపడింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

mentally challenged women rape
మానసిక దివ్యాంగులపై లైంగిక వేధింపులు

తమిళనాడులోని అన్బుజోతి ప్రైవేట్ ఆశ్రమంలో దారుణాలు బయటపడ్డాయి. అధికారులు సోదాలు జరపగా.. అనేక అస్థిపంజరాలు కనిపించాయి. అలాగే తీవ్ర గాయాలతో మానసిక దివ్యాంగులు కనిపించారు. వారిని వైద్యం నిమిత్తం విల్లుపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ జరిగింది..
విల్లుపురంలోని అన్బుజోతి ప్రైవేట్ ఆశ్రమం ఉంది. అందులో మానసిక దివ్యాంగులు, అనాథలు ఉంటున్నారు. అయితే తన బంధువు జహీరుల్లా కనిపించట్లేదని సలీం ఖాన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిల్ వేశాడు. దీంతో మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఫిబ్రవరి 10న ప్రైవేట్ ఆశ్రమంపై దాడులు నిర్వహించారు. అప్పుడు వారికి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అయితే వారు ఆశ్రమంలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు.

ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా అన్బుజ్యోతి ఆశ్రమం వార్త సంచలనం రేపింది. దీంతో స్వయంగా విల్లుపురం కలెక్టర్ అధికారులతో కలిసి ఆశ్రమానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అక్కడున్న 25 మంది మానసిక దివ్యాంగులను రక్షించి విల్లుపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే వారి శరీరంపై తీవ్ర గాయాలున్నట్లు గుర్తించారు. మానసిక రోగులకు మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

మానసిక దివ్యాంగులు, అనాథలకు భయపెట్టేందుకు ఆశ్రమ నిర్వహకురాలు జుబిన్ బేబి రెండు కోతులను పెంచినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నిర్వహకురాలిని కూడా కోతులు కరిచేసినట్లు వెల్లడించారు. ఆమె విల్లుపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారని.. కోలుకున్నాక అరెస్ట్ చేశామని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.