CBI Investigation on Ayesha Meera Case: ఆయేషా మీరా హత్య కేసు.. మళ్లీ దృష్టి సారించిన సీబీఐ
Published: Sep 6, 2023, 5:25 PM


CBI Investigation on Ayesha Meera Case: ఆయేషా మీరా హత్య కేసు.. మళ్లీ దృష్టి సారించిన సీబీఐ
Published: Sep 6, 2023, 5:25 PM

CBI Investigation on Ayesha Meera Case: ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు ప్రారంభించింది. ఆయేషా మీరా ఫ్యామిలీ ఫ్రెండ్ వెంకటకృష్ణను సీబీఐ అధికారులు విచారించారు. విజయవాడలోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విచారించారు. ఆయేషా మృతి కేసును త్వరితగతిన విచారించి... ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని... సీబీఐ అధికారులను కోరినట్లు వెంకటకృష్ణ తెలిపారు.
CBI Speeds up Investigation on Ayesha Meera Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు ప్రారంభించింది. ఆయేషా మీరా ఫ్యామిలీ ఫ్రెండ్ వెంకట కృష్ణను సీబీఐ అధికారులు విచారించారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని సీబీఐ క్యాంప్ కార్యాలయం(CBI Camp Office)లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విచారించారు. ఆయేషా చనిపోయిన రోజు ఎన్ని గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు? ఎంత సేపు అక్కడ ఉన్నారు? మృతురాలి శరీరంపై గాయాలను చూశారా ? అని పలు రకాల ప్రశ్నలు సీబీఐ అధికారులు వేశారని వెంకట కృష్ణ తెలిపారు.
పోలీసులు ఈ తరహా ప్రశ్నలే అడిగారు: సీబీఐ(CBI) అధికారులు వెంకట కృష్ణను సీఆర్పీసీ 160 ప్రకారం సాక్షిగా విచారణకు పిలిచినట్లు తెలిపారు. ఆయేషా మృతి చెందిన తర్వాత ఏం జరిగిందని అని అడిగారన్నారు. శరీరంపై గాయాల గురించి పోలీసులు చెప్పిన దాని ప్రకారమే పంచనామాలో రాసినట్లు తెలిపారు. మృతి చెందిన రోజు పంచనామా ను తానే రాశానన్నారు. ఆ కాగితాలను చూపి అధికారులు తనను ప్రశ్నించారని వెంకట కృష్ణ తెలిపారు. పూర్తి వివరాలు అధికారులకు తెలిపానన్నారు. గతంలో కూడా సిట్, పోలీసులు ఈ తరహా ప్రశ్నలే అడిగారని అన్నారు. ఆయేషా మృతి కేసును (Ayesha Meera Case) త్వరితగతిన విచారించి. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని సీబీఐ అధికారులను కోరానని వెంకట కృష్ణ తెలిపారు.
నాలుగేళ్లు గడుస్తున్నా కొలిక్కిరాని కేసు: మరోవైపు ఆయేషా మీరా తరపున కేసు వాదిస్తున్న న్యాయవాది పిచ్చుకా శ్రీనివాస్ సైతం సీబీఐ అధికారులను కలిశారు. కేసు లో బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న భరోసాను సీబీఐ కల్పించాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికే సత్యం బాబు, అనాసాగరంలోని అతని స్నేహితులను సీబీఐ అధికారులు విచారించారు. కేసు దర్యాప్తు(Investigate) చేసిన అప్పటి పోలీసు అధికారులను సైతం విచారించారని న్యాయవాది శ్రీనివాస్ తెలిపారు. ఆయేషా మృతదేహానికి రీ పోస్ట్ మార్టం(re postmortem) చేసేందుకు సీబీఐ అధికారులు ఆమె అవశేషాలు తీసుకెళ్లి.. ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదన్నారు. ఎప్పుడు ఇస్తారని అధికారులను కోరినట్లు న్యాయవాది తెలిపారు. వాటిని కోర్టులో సబ్ మిట్ చేస్తామని అధికారులు చెప్పారన్నారు. కేసు నమోదు చేసి నాలుగేళ్ల పై గడుస్తున్నా కేసు ఓ కొలిక్కి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన దిశలోనే కేసు దర్యాప్తు వెళుతుందని ఆయన అన్నారు.
'అయేషా మీరా హత్య కేసు విచారణకు సంబంధించిన... అయేషా కుటుంబసభ్యులు, ప్రజాసంఘాలు వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా విచారణ కొనసాగుతోంది తప్పా... విచారణ ఓ కొలిక్కి రావడంలేదు. ఇదే అంశంపై సీబీఐ వారిని వివరణ కోరితే త్వరలోనే కేసును పూర్తి చేస్తామని చెబుతున్నారు.'- న్యాయవాది శ్రీనివాస్
