ETV Bharat / state

పల్నాడు గొడవల్లో కోవర్ట్ ఆపరేషన్? - ఇంటిదొంగలపై పోలీస్​శాఖ విచారణ - POLICE HELP IN PALNADU VIOLENCE

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 7:36 AM IST

Police Help Behind Violence in Palnadu District: పల్నాడు జిల్లాలో పోలింగ్‌ రోజు దాడులు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలపై పోలీస్‌శాఖలో కొత్త చర్చ నడుస్తోంది. కొందరు అధికారులు వైఎస్సార్సీపీ నేతలకు తొత్తులుగా మారి అరాచకాలకు ఆజ్యం పోసినట్లు పోలీస్‌శాఖలో, అంతర్గత చర్చ జరుగుతోంది. ఈనెల 13, 14 తేదీల్లో జరిగిన ఘటనలను క్షుణ్నంగా పరిశీలిస్తున్న అధికారులు, అనుమానితుల చరవాణిల నుంచి వెళ్లిన ఫోన్లు, సందేశాలను విశ్లేషిస్తున్నారు.

Violence in Palnadu District
Violence in Palnadu District (ETV Bharat)

Police Help Behind Violence in Palnadu District: పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజున జరిగిన దాడులు, ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలను పోలీస్ ఉన్నతాధికారులు విశ్లేషించే పనిలో పడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ రోజు కొందరు సీఐలు, ఎస్‌ఐలు, పూర్తిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు చెప్పినట్లే పనిచేసినట్లు గుర్తించారు. పోలింగ్‌ రోజు మాచర్ల నియోజకవర్గ సరిహద్దు పోలీసుస్టేషన్‌లో పనిచేసే ఎస్సై ఒకరు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి దగ్గరుండి టీడీపీ ఏజెంట్లను బయటికి పంపించినట్లు తెలిసింది. ఇంకో గ్రామంలో టీడీపీ ఏజెంట్లను బయటికి తరిమేసి ఏకపక్షంగా పోలింగ్‌ చేసుకుంటున్న వైఎస్సార్సీపీ ఏజంట్లను ఒక ఎస్సై అడ్డుకున్నా, సీఐ వెంటనే ఫోన్‌ చేసి జోక్యం చేసుకోకుండా నిలువరిచినట్లు తెలుస్తోంది.

పిన్నెల్లి సోదరులకు చేరవేశారు: పిన్నెల్లి సోదరులు పదుల సంఖ్యలో వాహనాల్లో తిరుగుతున్నా చోద్యం చూసిన సదరు సీఐ, ప్రత్యర్థుల రాకపోకల సమాచారాన్ని వైసీపీ వారికి ఇచ్చిమరీ దాడులకు ఉసిగొల్పారని అనుమానిస్తున్నారు. కారంపూడి సర్కిల్‌ పరిధిలోని ఎస్‌ఐ ఒకరు పోలింగ్‌ రోజు ప్రతిపక్ష నేతల కార్యకలాపాలు, పోలీసు సిబ్బంది కదలికల్ని పిన్నెల్లి సోదరులకు చేరవేశారు. కారంపూడిలో మంగళవారం నాటి ఘటనల్లోనూ సదరు ఎస్‌ఐ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. రెంటచింతల మండలం రెంటాలలో బ్రహ్మారెడ్డిపై దాడి జరిగిన గంటకు కూడా అక్కడి బలగాలు చేరుకోకపోవడానికీ ఒక సీఐ నిర్వాకం, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమే కారణమనే అపవాదును పోలీసు శాఖ మూటగట్టుకుంది.

రాష్ట్రం రావణకాష్టంలా మారుతుంటే ఎందుకీ మౌనం- సీఎస్, డీజీపీపై ఈసీ సీరియస్ - EC summons Andhra Pradesh DGP

పల్నాడు గొడవల్లో కోవర్ట్ ఆపరేషన్? - ఇంటిదొంగలపై పోలీస్​శాఖ విచారణ (ETV Bharat)

పోలీసుల నిర్లక్ష్యం: నరసరావుపేట మండలం దొండపాడులో పోలింగ్‌ సరళిని పరిశీలించడానికి వెళ్లిన తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కారును వైఎస్సార్సీపీ మూకలు ధ్వంసం చేశారు. ఎంపీ దొండపాడు వెళ్తున్నారనే సమాచారన్ని వైఎస్సార్సీపీ నేతలకు ఒక ఎస్‌ఐ చేరవేసినట్లు అనుమానిస్తున్నారు! పోలింగ్‌రోజు నరసరావుపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు కారుపైనా రాళ్ల దాడి జరిగింది. దానీకీ ఎస్సై పరోక్షంగా సహకరించారనే ఆరోపణలున్నాయి.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డే ఆ ఎస్సైకి అక్కడ పోస్టింగ్‌ ఇప్పించారని, అందుకే రుణం తీర్చుకున్నారని భావిస్తున్నారు. నరసరావుపేట జిల్లా కేంద్రంలో కీలక స్థానంలో ఉన్న ఒక సీఐ కూడా ఉద్రిక్త పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చెప్పకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుని అధికారపార్టీకి ఇతోధికంగా సాయం అందించారని తెలుస్తోంది. పోలింగ్‌ మరుసటి రోజు వైఎస్సార్సీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తల ఆస్తుల విధ్వంసానికి తెగబడడానికీ కొందరు పోలీసుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది!

తాడిపత్రిలో అగ్నికి ఆజ్యం పోసిన డీఎస్పీ చైతన్య!- జేసీ ఇంటికెళ్లి దాడి - TADIPATRI VIOLENCE

ఘర్షణలు కట్టడి చేయకుండా సహకారం: హింసాత్మక ఘటనలు జరిగాక బలగాలు ఎంతసమయంలో ఎక్కడికి వస్తున్నాయనే సమాచారం వైఎస్సార్సీపీ నేతలకు చేరవేసి, వారంతా పోలీసులకు దొరకకుండా లోపాయికారీగా పనిచేసినట్లు అనుమానిస్తున్నారు. జిల్లా స్థాయిలోని అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు ఎస్సైలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉంటూ దాడులకు సహకరించారు. ఘర్షణలు కట్టడి చేయకుండా పరోక్షంగా సహకారం అందించారు.

ఇక వినుకొండ నియోజకవర్గం పాతకొత్తపాలెం, కొత్తనాగిరెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ దాడుల్ని అక్కడ భద్రతా విధులు పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారే ప్రోత్సహించారని తెలుస్తోంది. దాడులు జరిగిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా, కొట్టండి నేను చూసుకుంటానంటూ వైఎస్సార్సీపీ వారిని మరింత ఉసిగొల్పారనే చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలోని ఇంటిదొంగల వ్యవహారశైలిపై సమగ్రదర్యాప్తు చేయించి చర్యలు తీసుకోవడానికి పోలీస్‌ శాఖలో రంగం సిద్ధమవుతోంది.

రాష్ట్రంలో అల్లర్లపై ఈసీ సీరియస్​- సీఎస్‌, డీజీపీకి సమన్లు జారీ - EC Issued Summons to AP CS and DGP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.