AYESHA MEERA DEATH : తమ కుమార్తె హత్య జరిగి 15 సంవత్సరాలు పూర్తైన ఇంతవరకు నిందితులకు శిక్ష పడలేదని అయేషా మీరా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు నిందితులు దర్జాగా తిరుగుతుంటే.. మధ్యలో కొందరు అమాయకులను అరెస్టు చేసి హడావిడి చేశారని మండిపడ్డారు. అయేషా నిందితులకు శిక్ష పడేదాకా.. తమ ప్రాణాలు పోయినా పోరాటం ఆపేది లేదని స్పష్టంచేశారు.
"మా పాప హత్యకు గురై 15 సంవత్సరాలు పూర్తైన ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా న్యాయం చేయలేదు. పోస్టుమార్టం పూర్తి చేసి 4సంవత్సరాలు అయినా ఇంతవరకు దానికి సంబంధించిన నివేదిక అందలేదు. ఇప్పటికైనా మా పాప హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చేయండి"-శంషాద్ బేగం, అయేషా మీరా తల్లి
న్యాయం కోసం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ఈ కేసును డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తప్పుదోవ పట్టించారని అయేషా తల్లి శంషాద్ బేగం ఆరోపించారు. సత్యం బాబును అరెస్టు చేసినా దోషిగా నిర్ధారించలేదని మండిపడ్డారు. అన్ని వివరాలు సీబీఐకి ఇచ్చినా ప్రయోజనం లేదని వాపోయారు. నిర్భయ తరహాలో అయేషా పేరుతో చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
"ఈ భారతదేశంలో మైనార్టీ ప్రజలకు రక్షణ లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతుంటే మాకు ఎందుకు న్యాయం చేయలేదు. రీ పోస్టుమార్టం చేసినప్పుడు సీబీఐ అధికారులు నెల రోజుల్లో నివేదిక అందిస్తామన్నారు. కానీ ఇంతవరకు అందించలేదు. జగన్ రెడ్డి గారు మీరు మహిళల పట్ల సానుకూలత అంటున్నారు కాబట్టి.. మా పాప కేసులో దోషులను శిక్షించి మాకు న్యాయం చేయండి"-ఇక్బాల్ బాషా, అయేషా మీరా తండ్రి
ఇవీ చదవండి: