ETV Bharat / international

'భర్తను చంపడమెలా?' అనే వ్యాసం రాసి.. భర్తను హత్య చేసిన రచయిత

author img

By

Published : Jun 14, 2022, 7:40 AM IST

ఓ రచయిత తన భర్తను కిరాతకంగా కాల్చి చంపింది. ఈ ఘటనకు కొద్ది సంవత్సరాల ముందే ఆ మహిళ 'భర్తను హత్య చేయడం ఎలా?' అనే వ్యాసాన్ని రాసింది. దోషిగా తేలిన మహిళకు.. న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

how-to-murder-your-husband
how-to-murder-your-husband

'భర్తను చంపడం ఎలా?' అనే వ్యాసం రాసిన ఓ మహిళ.. సొంత భర్తను హత్య చేసిన కేసులో కటకటాలపాలైంది. అమెరికా పోర్ట్​లాండ్​కు చెందిన నిందితురాలు నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీకి (71) న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.
వివరాల్లోకి వెళితే..

రొమాంటిక్ నవలలు రాసే నాన్సీ.. తన భర్త డేన్ బ్రోఫీని (63) అతడి ఆఫీసులోనే హత్య చేసింది. నాలుగేళ్ల క్రితం ఈ ఘటన జరిగింది. 2018లో ఒరేగాన్ కల్నరీ ఇన్​స్టిట్యూట్​లో డేన్ బ్రోఫీ పనిచేస్తుండగా.. అతడిని తుపాకీతో కాల్చి చంపింది నాన్సీ. జీవిత బీమా డబ్బుల కోసమే అతడిని హత్య చేసినట్లు తేలింది. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు చాలా ఏళ్ల ముందే 'భర్తను హత్య చేయడం ఎలా?' అనే వ్యాసం రాసి వార్తల్లో నిలిచింది నాన్సీ.

how-to-murder-your-husband
నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ

ఇంటర్నెట్​లో వెతికి మరీ..
హత్య జరిగిన సమయంలో దంపతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఇంటర్నెట్​లో వెతికి మరీ.. ఓ ఘోస్ట్ గన్ కిట్​ను నాన్సీ కొనుగోలు చేసిందని తెలిపారు. ఆ తర్వాత గ్లాక్ 17 అనే హ్యాండ్​ గన్​ను ఓ ప్రదర్శన నుంచి సేకరించిందని చెప్పారు. అయితే, నాన్సీ తరఫు న్యాయవాది ఈ వాదనలను కొట్టిపారేశారు. దంపతులు ఆర్థిక కష్టాల్లో ఉన్న విషయం వాస్తవం కాదన్నారు. వీరిద్దరి మధ్య అన్యోన్య దాంపత్య బంధం ఉండేదని తెలిపారు. ఈ మేరకు పలువురు సాక్షులను సైతం ప్రవేశపెట్టారు. తన భర్తతో కలిసి సంయుక్తంగానే జీవిత బీమా తీసుకున్నామని నాన్సీ స్పష్టం చేశారు. ఇక, అంతర్జాలంలో తుపాకుల గురించి వెతకడంపైనా స్పష్టతనిచ్చారు. తర్వాతి నవల రాయడం కోసం తాను తుపాకుల గురించి పరిశోధించానని చెప్పుకొచ్చారు.

25ఏళ్ల తర్వాత పెరోల్!
ఏడు వారాల పాటు సాగిన విచారణలో.. వాదనలన్నీ విన్న జడ్జీలు, జ్యూరీ.. నాన్సీని దోషిగా తేల్చారు. సెకండ్ డిగ్రీ హత్యకు పాల్పడినట్లు నిర్ధరించారు. అనంతరం జీవిత ఖైదు విధించారు. 25 ఏళ్ల జైలు శిక్ష తర్వాత పెరోల్​ లభించేలా తీర్పు వెలువరించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.