ETV Bharat / state

రూ.2.95 లక్షల కోట్లతో నేడు ఓట్​ ఆన్​ అకౌంట్ బడ్జెట్​! - ఆరు గ్యారంటీలకే పెద్దపీట

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2024, 7:16 AM IST

Updated : Feb 10, 2024, 7:24 AM IST

Telangana Budget 2024 : ఆరు గ్యారంటీలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజాకర్షకంగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ రానుంది. ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని, రాబడుల్ని బేరీజు వేసుకొని వాస్తవిక అంచనాలకు అనుగుణంగా వార్షిక ప్రణాళిక ఉండే అవకాశం ఉంది. రూ.3 లక్షల కోట్లకు దిగువగానే పద్దు ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ అయినందున పూర్తి పద్దులో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Telangana Budget 2024
Telangana Budget 2024

రాష్ట్రంలోనూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సర్కార్‌

Telangana Budget 2024 : రాష్ట్ర బడ్జెట్ ఇవాళ ఉభయసభల ముందుకు రానుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు మండలిలో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అదే తరహాలో రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టనున్నారు.

Telangana Budget 2024-25 : 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ అంచనాలతో పాటు, 2022-23 సంవత్సరానికి (Telangana Budget 2023) చెందిన లెక్కలు, 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలు కూడా వెల్లడి కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దిశానిర్దేశానికి అనుగుణంగా పద్దు ప్రతిపాదనలు రూపొందించారు. లేని గొప్పలు వద్దని, వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని సీఎం గతంలోనే అధికారులకు స్పష్టం చేసిన ప్రకారమే 2024-25 బడ్జెట్ రానుంది.

రుణాల చెల్లింపులకే రూ.16 వేల కోట్లు - నీటి పారుదల ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అవసరం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేసీఆర్ సర్కార్ రూ.2.90 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ తీసుకొచ్చింది. అందులో డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం మొత్తం రూ.1.56,000ల కోట్లకు పైగా ఉంది. పన్ను ఆదాయం లక్ష కోట్ల వరకు, రెవెన్యూ రాబడులు లక్షా పాతిక వేల కోట్లు ఖజానాకు సమకూరాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.2 లక్షల కోట్లను దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.30,000ల కోట్ల వరకు పెరగవచ్చని భావిస్తున్నారు.

వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని 2024-25 వార్షిక బడ్జెట్‌ను ఖరారు చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, కొన్ని విభాగాల్లో అంచనాలకు దూరంగానే ఉన్న పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి వస్తాయన్న ఆశతో భారీగా అంచనా వేసిన గ్రాంట్లు కూడా చాలా స్వల్పంగానే వచ్చాయి. రుణాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రత్యేకించి కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పుల విషయంలో వ్యతిరేక ధోరణితో ఉన్నారు.

Vote on Account Budget Telangana 2024 : ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని తాజా బడ్జెట్ రానుంది. ప్రస్తుత పద్దు అంచనా కంటే స్వల్పంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లు కాగా, రానున్న ఆర్థిక సంవత్సరానికి కాస్త పెరిగి రూ.2.95 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మధ్యతరగతికి నిర్మల గుడ్​న్యూస్! ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం- ఐదేళ్లలో రెండు కోట్ల ఆవాసాలు

Telangana Budget on Six Guarantees : శాసనసభ ఎన్నికల అనంతరం లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ కావడంతో ప్రజాకర్షకంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకించి 6 గ్యారంటీలకు (Congress Six Guarantees) పద్దులో ప్రాధాన్యం దక్కనుంది. ఇప్పటికే రెండు హామీలు అమలు చేసిన సర్కార్, మరో రెండింటిని త్వరలోనే అమలు చేయనుంది. అన్ని గ్యారంటీలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని తెలిపింది. దీంతో వీటి అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు. ఇందుకోసం ఏడాదికి రూ.60,000ల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు చెప్తున్నారు.

వీటితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీల కోసం కూడా కేటాయింపులు చేయనున్నారు. రుణమాఫీకి సంబంధించి బడ్జెట్‌లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, బడ్జెట్​లో అందుకు తగ్గట్లుగా ప్రతిపాదనలు చేయనుంది. శాఖల వారీగా చూస్తే చాలా శాఖలకు సంబంధించిన ప్రగతి పద్దులో కోత పడినట్లు సమాచారం. ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయా శాఖలకు ప్రస్తుత కేటాయింపుల కంటే తక్కువగానే ప్రతిపాదించినట్లు తెలిసింది.

Telangana Budget Sessions 2024 : ఓట్ ఆన్ అకౌంట్ అయినప్పటికీ ఏడాదికి సరిపడా ప్రతిపాదనలు ఉండనున్నాయి. అయితే పూర్తి బడ్జెట్ తరహాలో సమగ్ర వివరాలు ఉండవు. ఆయా శాఖల పద్దులకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఉండవు. దీంతో పద్దులపై చర్చకు అవకాశం ఉండదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ సమయంలో అన్ని అంశాలను మరింత సమగ్రంగా బేరీజు వేసుకొని అవసరమైన మార్పులు, చేర్పులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

నీటి పారుదల శాఖకు భారీ బడ్జెట్ - రూ.40 వేల కోట్లతో ప్రతిపాదనలు!

ఆశల పల్లకిలో కొత్త బడ్జెట్​ - ఆర్థిక అవరోధాలను అధిగమించడం ఎలా?

Last Updated :Feb 10, 2024, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.