ETV Bharat / state

రాష్ట్ర బడ్జెట్​ 2023.. సాగుకు భళా.. సంక్షేమ కళ.. పేదల గూటికి ప్రాధాన్యం

author img

By

Published : Feb 7, 2023, 7:09 AM IST

Telangana Annual Budget
Telangana Annual Budget

Telangana Annual Budget 2023-24: సంక్షేమంతోపాటు సాగుకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు భారీ బడ్జెట్ తీసుకొచ్చింది. ప్రస్తుత కార్యక్రమాల కొనసాగింపు, ఎన్నికల హామీలే ధ్యేయంగా పద్దు ప్రవేశపెట్టింది. సొంతఆదాయంపై ఎక్కువగా ఆధారపడుతూ ఆశావహ బడ్జెట్ తీసుకొచ్చిన సర్కార్.. కేంద్రం సహకరించడం లేదంటూనే గ్రాంట్లపై ఆశలు పెట్టుకొంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కేటాయింపులు చేసింది.

Telangana Annual Budget 2023-24: ఈ ఏడాది శాసనసభ ఎన్నికలకు వెళ్తున్న ప్రభుత్వం.... మరోమారు భారీ బడ్జెట్ తీసుకొచ్చింది. కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన 11వ బడ్జెట్‌లో... 2లక్షల 90వేల 396 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. సొంత రాబడులపైనే ఎక్కువ ఆధారపడ్డారు. సొంతపన్నులు, పన్నేతర ఆదాయం అంచనాల్లో సగానికిపైగా ఉంది. అప్పులపై కేంద్రం ఆంక్షలవేళ 2022-23 కంటే తక్కువ మొత్తాన్ని ఎఫ్​ఆర్​బీఎం రుణంగా ప్రతిపాదించింది. కేంద్రం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని... రుణాలు, గ్రాంట్లు, ఆర్థిక సంఘం - నీతి అయోగ్ సిఫారసులు, బకాయిల విషయంలో అన్యాయం చేస్తోందని ఆక్షేపించింది. కేంద్రం నుంచి ఆశించిన గ్రాంట్లు రాకపోయినా మరోమారు 41 వేల కోట్లు ప్రతిపాదించింది. వివిధ శాఖలకు పెంచిన నిధుల వివరాలను బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థికమంత్రి హరీశ్‌రావు వివరించారు.

సంక్షేమ రంగానికి అగ్ర తాంబూలం : కేటాయింపుల్లో ఎప్పటిలాగే సంక్షేమ రంగానికి సర్కార్‌ పెద్దపీట వేసింది. వ్యవసాయం, నీటిపారుదలకు ప్రాధాన్యందక్కింది. పంచాయతీరాజ్, పురపాలకశాఖలకు పద్దు పెంచిన ప్రభుత్వం... స్థానిక సంస్థల నిధుల విషయంలో కీలకనిర్ణయం తీసుకొంది. చేసిన పనులకు నిధులకొరత, బిల్లులు రాకపోవడం సమస్యలతో సర్పంచులు, ప్రజాప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని... పల్లెప్రగతి, పట్టణప్రగతి నిధులను నేరుగా స్థానిక సంస్థలకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. సొంత స్థలం ఉన్నవారికి 3లక్షల ఆర్థిక సాయాన్ని నియోజకవర్గానికి 2వేల మంది చొప్పున అందించేలా నిధులు కేటాయించారు.

ఆ పథకాలకు బడ్జెట్​లో పెద్దపీట : దళితబంధు పథకానికి 17వేల 100 కోట్లు కేటాయించారు. 118 నియోజకవర్గాల్లో 1100 మంది చొప్పున దళితబంధుకు నిధులిచ్చారు. దళితబంధు తర్వాత అత్యధిక నిధులు కేటాయించిన... రెండో పథకంగా రైతుబంధుకు 15వేల 75 కోట్లు కేటాయించింది. గతేడాది వానాకాలంలో ఆ పథకం కింద 65 లక్షల మందికి ఎకరానికి 5 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమచేయగా... వచ్చే వానాకాలంలో 70 లక్షల మందికిపైగా రైతులుంటారని నిధులు పెంచినట్లు తెలుస్తోంది. 6,385 కోట్లు రైతు రుణమాఫీ కోసం కేటాయించింది. ఆ సొమ్మునంతా ప్రభుత్వం బ్యాంకులకు విడుదలచేస్తే 90వేల వరకు బకాయి ఉన్న రైతులందరిపంటరుణాలు మాఫీవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

నిధుల పారుదలే! : సాగునీటి రంగానికి 26వేల 885 కోట్లు కేటాయించారు. గతేడుకన్నా సుమారు 6వేల కోట్లు అదనం. నీటిపారుదలశాఖలో సింహభాగం కేటాయింపులు రుణాలు, వడ్డీల చెల్లింపులకే వెళ్లనున్నాయి. కాళేశ్వరం కార్పోరేషన్ చెల్లింపులకు 12,500 కోట్లు, జలవనరుల అభివృద్ధి సంస్థచెల్లింపులకు 3200 కోట్లు ప్రతిపాదించారు. ప్రాజెక్టుల వారీ కేటాయింపులో మరోమారు కాళేశ్వరం ప్రాజెక్టుకే అధికంగా 2614 కోట్లు కేటాయించారు. పాలమూరు - రంగారెడ్డికి 1187 కోట్లు, సీతారామకు 948 కోట్లు దక్కాయి. హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టులకు 2500కోట్లు కేటాయించినట్లు పద్దులో చూపించారు.

46 వేల కోట్లకుపైగా రుణాలు తీసుకోనున్న ప్రభుత్వం : ముఖ్యమంత్రి వద్ద అందుబాటులో ఉండే ప్రత్యేక అభివృద్ధి నిధిని భారీగా పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2వేలకోట్లుగా ఉన్న ఎస్​డీఎఫ్​ను ఏకంగా ఐదు రెట్లు అంటే 10వేల 348 కోట్లకి పెంచారు. ఎన్నికల ఏడాదిలో ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు, ఇతర సమయాల్లో వచ్చేవిజ్ఞప్తులు, ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆమొత్తాన్ని పెంచారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఒక్కొక్కరికి 5కోట్ల చొప్పున 800 కోట్లు కేటాయించారు.

ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 46 వేల కోట్లకుపైగా రుణాలు తీసుకోనుంది. మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అప్పుల విలువ మూడున్నర లక్షల కోట్లు దాటనుంది. జీఎస్​డీపీలో ఇది 23.8 శాతమన్న రాష్ట్ర ప్రభుత్వం... ప్రతి ఏడాది క్రమంగా తగ్గుతున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల మొత్తం ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి లక్షా 29వేల కోట్లకు చేరింది.

.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.