ETV Bharat / state

విదేశీ మద్యం పేరుతో భారీగా 'పన్ను ఎగవేత' - సమగ్ర విచారణకు ప్రభుత్వ ఆదేశం

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 6, 2024, 1:49 PM IST

Tax Evasion in Foreign Liquor Telangana : విదేశీ మద్యం పేరుతో ప్రభుత్వానికి భారీగా పన్ను ఎగవేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విదేశీ మద్యం అమ్మకాల పేరుతో ఒక దుకాణానికి లైసెన్స్‌ తీసుకుని 9 చోట్ల అమ్మకాలు జరిపినట్లు వాణిజ్య పన్నులశాఖ అధికారులు గుర్తించారు. ఆరేళ్లుగా రూ.వందల కోట్ల వ్యాట్‌ ఎగవేశారని అంచనా వేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

Foreign Liquor
Foreign Liquor

Tax Evasion in Foreign Liquor in Telangana : హైదరాబాద్‌లో విదేశీ మద్యం అమ్మకాల పేరుతో రూ.వందల కోట్ల వ్యాట్‌ను ఎగవేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అమ్మకాల కోసం ఒక దుకాణం ఏర్పాటుకు 2016లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీఓ విడుదల చేయించుకుని భారీ కుంభకోణానికి పాల్పడ్డట్లు వాణిజ్య పన్నులశాఖ సోదాల్లో బహిర్గతమైంది. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కార్ వాణిజ్య పన్నుల శాఖను మంగళవారం ఆదేశాలిచ్చింది. ఇంత భారీ కుంభకోణం గత ఆరు సంవత్సరాలుగా జరుగుతుంటే ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులశాఖలు ఎందుకు పట్టించుకోలేదో తేల్చాలని పేర్కొంది.

పక్కా ప్రణాళికతో మోసాలు : ప్రతి దుకాణ లైసెన్స్‌దారు మద్యం అమ్మకాలపై (Liquor Sales) రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్‌ చెల్లించాలి. ప్రతి దుకాణదారు తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ గోదాముల నుంచే మద్యాన్ని తీసుకోవాలి. ఆ మద్యం విలువపై వ్యాట్‌ చెల్లించాలి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో టానిక్‌ పేరుతో ఏర్పాటు చేసిన దుకాణంలో విదేశీ మద్యం విక్రయించడానికి ఒక వ్యాపారి ఎక్సైజ్‌ శాఖ నుంచి లైసెన్సుతోపాటు 2016లో ప్రత్యేక జీఓ తెచ్చుకున్నారు. ఇక్కడి నుంచే అవినీతి బాగోతం మొదలైంది.

వెలుగులోకి మరో కుంభకోణం - రైతు బీమా, రైతుబంధులోనూ గోల్​మాల్ - రూ.2 కోట్లు స్వాహా

ఒక దుకాణంలోనే విదేశీ మద్యం అమ్ముకునేందుకు అనుమతి తీసుకుని మరో 8 చోట్ల విదేశీ మద్యం విక్రయిస్తున్నారు. ఆ 8 దుకాణాల్లో సాధారణ మద్యం విక్రయిస్తామని చెప్పి లైసెన్సులు తీసుకున్నారు. వీటిలో దుకాణంలో పనిచేసే కార్మికుడి పేరుతో ఒక లైసెన్స్‌ ఉంది. మరోవైపు లైసెన్స్‌ తీసుకున్న వ్యక్తులు కాకుండా బినామీలు వీటిలో వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారంలో ఇద్దరు కీలక అధికారుల కుటుంబ సభ్యులకు భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది. అలానే సదరు వ్యాపారి వెనుక కొందరు రాజకీయ నేతలున్నట్లు విచారణలో నిర్ధారించారు.

Foreign Liquor Sales Scam in Hyderabad : మరోవైపు విదేశీ మద్యం విక్రయించడానికి జారీచేసిన జీఓలో టానిక్‌ దుకాణానికి తప్పనిసరిగా వ్యాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించాలనే నిబంధన పెట్టలేదు. ఈ నిబంధన జీఓలో లేదనే సాకుతో సదరు దుకాణ లైసెన్సుదారు 2016 నుంచి ఇప్పటిదాకా వ్యాట్‌ చెల్లించకుండా రూ.వందల కోట్ల విలువైన మద్యం (Liquor Sales in Telangana)అమ్మేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యంపై వ్యాట్‌ కట్టకపోగా, అక్కడే తాగడానికీ ఏర్పాట్లు చేశారు. తినడానికి ఆహార పదార్థాలు అమ్ముతున్నారు. వీటి అమ్మకాలపై జీఎస్టీ కూడా చెల్లించలేదని తనిఖీల్లో తేలింది. వ్యాట్‌, జీఎస్టీ ఎగవేతతో 2016 నుంచి ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లింది. ఈ అమ్మకాల విలువ తేలితే గానీ ఎంత వ్యాట్‌, జీఎస్టీ ఎగవేశారనే లెక్క తేలదని అధికారులు పేర్కొన్నారు.

ఆఫ్రికా దేశాలకు భారీ వాహనాల స్మగ్లింగ్‌ విలువ రూ.100 కోట్లు

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పాత్ర? : ఈ వ్యవహారం వెనుక అప్పటి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరి సహకారం కూడా ఉందా? అనే కోణంలో తెలంగాణ ప్రభుత్వం విచారణ జరుపుతోంది. సీనియర్‌ అధికారుల సహకారం లేకపోతే రూ.వందల కోట్ల పన్నులు ఎగవేయడం సాధ్యం కాదని సర్కార్ గట్టిగా భావిస్తోంది.

ప్రత్యేక జీఓలో మతలబులు :

  • సాధారణంగా ఒక మద్యం దుకాణం లైసెన్సు రుసుం విలువకు ఏడు రెట్లు ఎక్కువగా అమ్మకాలు జరిగితే అదనంగా టర్నోవర్‌ ట్యాక్స్‌ విధిస్తారు. ఈ విదేశీ మద్యం దుకాణానికి మూడు సంవత్సరాల వరకూ టర్నోవర్‌ ట్యాక్స్‌ విధించకుండా ప్రత్యేక జీఓలో మినహాయింపు ఇవ్వడం గమనార్హం.
  • ఈ దుకాణంలో రూ.1,300కన్నా ఎక్కువ ధర ఉన్న మద్యం సీసాలనే అమ్మాలనే నిబంధనను జీఓలో పేర్కొన్నారు. కానీ ఇష్టమైన రేట్లకు అమ్మేస్తున్నారు.
  • దుకాణాలకు మద్యం సరఫరాకు తెలంగాణ వ్యాప్తంగా 18 చోట్ల గోదాములను రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. ఎక్కడైనా ఒక దుకాణం ఏర్పాటుకు ఎక్సైజ్‌ శాఖ లైసెన్సు ఇచ్చినప్పుడు దానికి సమీపంలో ఉన్న ఏదో ఒక గోదాము నుంచే మద్యం తీసుకెళ్లాలనే నిబంధన పెడుతుంది. ఈ నిబంధనను తుంగలో తొక్కి విదేశీ మద్యం అమ్మే దుకాణానికి అవసరమైన మద్యాన్ని రాష్ట్రంలోని 18 గోదాముల్లో ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ప్రత్యేక జీఓలో వెసులుబాటు కల్పించడంపై ప్రస్తుత సర్కార్ విస్మయం వ్యక్తంచేస్తోంది.
  • ఈ వెసులుబాటును అడ్డం పెట్టుకుని ఒక దుకాణానికి ఇచ్చిన విదేశీ మద్యం అమ్మకాల అనుమతి ఆసరాగా ఏకంగా 9 చోట్ల విచ్చలవిడిగా విదేశీ, స్వదేశీ మద్యం అమ్ముతూ వ్యాట్‌, జీఎస్టీ ఎగవేసి తెలంగాణ సర్కార్‌కు భారీ నష్టం తెచ్చినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ప్రత్యేక జీఓ వెసులుబాటుతో పక్క రాష్ట్రంలో కూడా ఈ వ్యాపారులు విదేశీ మద్యాన్ని అక్రమంగా అమ్ముతున్నట్లు ఆరోపణలున్నాయి.

గొర్రెల పంపిణీ స్కామ్​ కేసులో విచారణ ముమ్మరం - మరో అధికారి ప్రమేయం గుర్తించిన ఏసీబీ

బల్దియాలో భారీ కుంభకోణం - బస్ షెల్టర్లు, మెట్రో పిల్లర్లపై అక్రమంగా వాణిజ్య ప్రకటనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.