ETV Bharat / health

మద్యం మానలేకపోతున్నారా? - కనీసం ఆరోగ్యమైనా ఇలా కాపాడుకోండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 3:45 PM IST

Alcohol Drinkers How to Secure Health : మద్యం ఎంత తాగినా దీర్ఘకాలంలో ప్రమాదమేనని నిపుణులు చెబుతుంటారు. అయినప్పటికీ.. చాలా మంది మందు పుచ్చుకుంటూనే ఉంటారు. అయితే.. కొందరు వీకెండ్​ మాత్రమే మందు తాగితే.. మరి కొందరు వారానికి ఏడు రోజులూ తాగుతుంటారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతుంటాయి. ఇలాంటి వారు కొన్ని పనులు చేయడం ద్వారా ఆరోగ్యం త్వరగా పాడైపోకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Best Diet For Alcohol Drinkers
Best Diet For Alcohol Drinkers

ఉప్పు తగ్గించండి..

అధిక ఉప్పు మద్యం తాగని వారికి కూడా ముప్పే. కానీ.. మద్యం తాగేవారికి మరింత ముప్పు. లేటెస్ట్ అధ్యయనం ప్రకారం.. అధిక ఉప్పు కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. మద్యం చేసే పని కూడా అదే. కాబట్టి.. లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం రెండింతలు ఉంటుందన్నమాట. అందుకే.. ఉప్ప కచ్చితంగా తగ్గించాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. రోజుకు 2,300 మిల్లీ గ్రాములకన్నా తక్కువ ఉప్పు తినాలి. కానీ.. మెజారిటీ జనం 50% ఎక్కువగా తీసుకుంటున్నారట! సో.. మద్యం తాగేవారు తప్పకుండా ఉప్పు తగ్గించాలి.

హైడ్రేటెడ్ గా ఉండండి..

మందు తాగితే లివర్, కిడ్నీలపై చాలా ప్రభావం పడుతుంది. దీన్ని తగ్గించడానికి నీళ్లు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం. మాయో క్లినిక్ ప్రకారం.. సరిపడా నీళ్లు తాగడం వల్ల కిడ్నీలు, కాలేయంపై పడే భారం తగ్గుతుంది. వ్యర్థాలను లివర్ క్లీన్ చేయడానికి నీరు సహకరిస్తుంది. అందువల్ల రోజూ కనీసం.. 8 నుండి 12 గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుందట. ఇది మనిషిని బట్టి మారుతుందని.. వయస్సు, తిండి, వాతావరణం, వాడుతున్న మందులను బట్టి ఉంటుందట.

హెల్దీ వెయిట్..

మనిషి బరువుకు, కాలేయ పనితీరు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అందుకే.. హెల్దీ వెయిట్​ మెయింటెయిన్ చేయాలి. అధిక బరువు కాలేయంపై ఒత్తిడి పెంచుతుంది. ఇది లివర్​లో మంటతోపాటు ఫైబ్రోసిస్‌ పరిస్థితికి దారి తీస్తుంది. ఈ పరిస్థితి రాకుండా బరువు చూసుకోవాలి. ఆరోగ్యకరమైన బరువు అంటే.. BMI సూచించిన బరువు. అంటే.. మనిషి ఎత్తుకు తగిన బరువు ఉండాలి.

క్రమం తప్పని వ్యాయామం..

వ్యాయామం కండల కోసం, గుండె కోసం మాత్రమే కాదు. కాలేయానికి కూడా చాలా అవసరం. వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కాలేయంలో కొవ్వు తగ్గుతుంది. శారీరక శ్రమ అనేది.. లివర్ సిర్రోసిస్ ఉన్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. U.S. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ నిపుణుల ప్రకారం.. వారంలో కనీసం 150 నుండి 300 నిమిషాల వరకు వ్యాయామం చేయాలి.

హెపటైటిస్ టీకాలు..

హెపటైటిస్ A, B టీకాలు తీసుకోవాలి. హెపటైటిస్ A అనేది కలుషితమైన ఆహారం తినడం ద్వారా వస్తుంది. లేదా అది ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉండడం వల్ల వ్యాపిస్తుంది. ఇది అంటు వ్యాధి. హెపటైటిస్ B మాత్రం.. శారీరక ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్‌ల కోసం టీకాలు అందుబాటులో ఉన్నాయి. వైద్యులను సంప్రదించి.. వారి సూచన మేరకు ఈ టీకాలు తీసుకోవాలి.

ఆ మందు.. ఈ మద్యం కలపొద్దు!

అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యులు సూచించిన మందులు వేసుకుంటారు. ఇలాంటి సమయంలో మద్యం తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. 2021లో విడుదల చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. 18 నుండి 79 సంవత్సరాల వయసున్న వారిని పరిశీలించారు. మెడిసిన్​ మాత్రమే తీసుకున్న వారితో పోలిస్తే.. మందుతో మద్యాన్ని మిక్స్ చేసిన వారిలో లివర్ దెబ్బతిన్నదని గుర్తించారు.

హెల్దీ ఫుడ్..

మరో ముఖ్యమైన అంశం ఆహారం. మద్యం తాగేవారు తప్పకుండా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. తిన్న తిండిని ప్రాసెస్ చేసేది కూడా కాలేయమే. అప్పటికే మద్యంతో ఇబ్బంది పడుతున్న కాలేయం.. అనారోగ్యకర ఆహారం తినడం ద్వారా మరింతగా ఇబ్బంది పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో లివర్ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. మద్యం తాగేవారు తప్పకుండా పోషకాలు నిండిన మంచి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మందు తగ్గించండి..

పైన చెప్పిన రక్షణ సూత్రాలు పాటించడంతోపాటు.. మద్యం చాలా తక్కువగా తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కెనడియన్ సెంటర్ ఆన్ సబ్‌స్టాన్స్ అబ్యూజ్ అండ్ అడిక్షన్ - 2023 ప్రకారం.. వారానికి 30 ml కంటే ఎక్కువ తాగకూడదట. ఆల్కహాల్ ఎంత తీసుకున్నా.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని నివేదిక వెల్లడించింది. కాబట్టి.. వీలైతే మద్యం తీసుకోవడం మానుకోవడం మంచిదని నిపుణులు (Alcohol Drinkers How to Secure Health) సూచిస్తున్నారు. వీలు కానివారు చాలా తక్కువ తీసుకుంటూ.. హెల్దీ లైఫ్​ స్టైల్ మెయింటెయిన్ చేయడం ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

గమనిక : ఇది కేవలం మీ అవహగాహన కోసం మాత్రమే. ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించడం మేలు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.