ETV Bharat / state

ఆఫ్రికా దేశాలకు భారీ వాహనాల స్మగ్లింగ్‌ విలువ రూ.100 కోట్లు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 12:57 PM IST

Heavy Vehicles Smuggling Scam Updates : బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల రుణాలతో కొనుగోలు చేసిన ఎక్స్‌కవేటర్‌ లాంటి భారీ వాహనాలను దొంగచాటుగా విదేశాలకు తరలించిన కేసు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల విలువైన వాహనాలను దేశం దాటించినట్లు వెల్లడి కావడం గమనార్హం. ఈ వ్యవహారాల్లో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో మహారాష్ట్రలోని ముంబయి, పుణే, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌తో పాటు టాంజానియా, జాంబియా దేశాల మూలాలు బహిర్గతమయ్యాయి.

Heavy Vehicles Smuggling Scam
Heavy Vehicles Smuggling Scam

Heavy Vehicles Smuggling Scam Updates : భారీ వాహనాలు కొనుగోలు చేసి వాటిని అక్రమంగా ఆఫ్రికా దేశాలకు స్మగ్లింగ్ కేసు దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నా కొద్దీ విస్మయకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబయి, పుణె, ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌తో పాటు టాంజానియా, జాంబియా దేశాలకు నౌకల ద్వారా పంపిన వ్యవహారం బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నిర్వాహకులు ఎక్కువ సంఖ్యలో వాహనాల స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు దర్యాప్తు క్రమంలో గుర్తించారు. క్రిసెంట్‌ ఇన్‌ఫ్రా, స్టాండర్డ్‌ ఎర్త్‌మూవర్స్‌, సిద్ధ కన్‌స్ట్రక్షన్స్‌ తదితర కంపెనీలూ స్మగ్లింగ్‌ దందాలో ఉన్నట్లు తాజాగా సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు.

343 మంది నిందితులు 299 మంది అరెస్ట్ : తొలుత ఒక్క కేసుతో మొదలై ప్రస్తుతం ఆరు కేసులకు చేరింది. మొత్తం 98 భారీ వాహనాలను (Illegal Transportation Vehicles)దేశం దాటించినట్లు బహిర్గతమైంది. ఒక్కో వాహనం సుమారు రూ.1.3 కోట్లు ఉంటుందని తెలుస్తుండటంతో మొత్తం రూ.100 కోట్లకు పైగా విలువైన వాహనాలు దేశం దాటినట్లు అంచనా వేస్తున్నారు. ఆయా కేసుల్లో ఇప్పటివరకు ఏకంగా 343 మంది నిందితుల ప్రమేయమున్నట్లు హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీరిలో ఇప్పటికే 299 మందిని అరెస్ట్ చేశారు. మిగిలినవారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుల్లో కొందరు యూకే తదితర విదేశాల్లోనూ ఉన్నట్లు తేలడంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తున్నారు.

Telangana Excavators Scam Updates : ఇప్పటివరకు గుర్తించిన నిందితులంతా పాత్రధారులు మాత్రమేనని, సూత్రధారులెవరో వెల్లడి కావాల్సి ఉందని సీసీఎస్‌ పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ వాహనాలను అడ్డదారిలో విదేశాలకు తరలించడంలో జీఎస్టీ చెల్లింపులతో పాటు నౌకాశ్రయాల ద్వారా షిప్పింగ్ వివరాలను రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే చాలా వరకు భారీ వాహనాలను ముంబయి పోర్టు నుంచి తొలుత టాంజానియాకు తరలించినట్లు గుర్తించారు. అనంతరం అక్కడినుంచి జాంబియాకు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది.

Telugu Akademi: నిందితులను ప్రశ్నిస్తున్న సీసీఎస్ పోలీసులు.. నిధుల మళ్లింపుపై ఆరా

జీఎస్టీ చెల్లించిందెవరు? షిప్పింగ్‌ చేసిందెవరు? : ఇందుకోసం ఒక్కో వాహనానికి రూ.15 లక్షల రవాణా ఖర్చు అయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో వాహనాల తరలింపు క్రమంలో జీఎస్టీ చెల్లించింది ఎవరు? షిప్పింగ్ చేసిందెవరు? అనేది ఇందులో కీలకంగా మారింది. ఈ క్రమంలోనే పన్ను చెల్లింపుల వివరాల కోసం షిప్పింగ్, జీఎస్టీ వివరాల కోసం కస్టమ్స్ కార్యాలయాలకు సీసీఎస్ పోలీసులు (CCS Police) లేఖలు రాశారు. అక్కడినుంచి సమాచారం వస్తే కేసుల దర్యాప్తు కీలక మలుపు తిరుగుతుందని భావిస్తున్నారు అవసరమైతే ముంబయి నౌకాశ్రయానికి వెళ్లే యోచనలో పోలీసులు ఉన్నారు.

ప్రీ లాంచ్‌ పేరుతో రూ.1164 కోట్లు వసూలు - సాహితీ ఇన్​ఫ్రాపై 50 కేసులు నమోదు

రాష్ డ్రైవర్లపై రవాణా శాఖ ఫోకస్ - నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్​ రద్దే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.