ETV Bharat / opinion

బిహార్‌పైనే ఆ ఏడుగురి ఆశలు- ఫేజ్​4లో కీలక నేతలు- ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు రప్పించడమే పెద్ద సవాల్! - Lok sabha elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 9:43 AM IST

Bihar Key candidates in Phase 4 Election : బిహార్‌లో ఈ నెల 13న జరగనున్న నాలుగో విడత ఎన్నికలు పలువురు సీనియర్‌ నేతలకు కీలకంగా మారాయి. ఏడగురు సీనియర్ నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత మూడు విడతల పోలింగ్‌లో అత్యల్ప ఓటింగ్‌ నమోదు కావడం వల్ల వీరు మరింత కష్టపడుతున్నారు. ప్రజలను పోలింగ్‌ బూత్‌లకు తీసుకొచ్చి ఓటేయించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇద్దరు బిహార్‌ రాష్ట్ర మంత్రులు ఉన్నారు. నాలుగో విడతలో ఒక రాష్ట్ర మంత్రి తన కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి రావడం కొసమెరుపు.

Bihar Key candidates in Phase 4 Election
Bihar Key candidates in Phase 4 Election (ETV)

Bihar Seniors candidates : మే13న జరగనున్న నాలుగో విడతలో బిహార్‌లో 5 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏడుగురు సీనియర్‌ నేతలు ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. వారిలో కేంద్ర మంత్రులు గిరిరాజ్‌ సింగ్‌, నిత్యానంద్‌ రాయ్‌, బిహార్‌ రాష్ట్ర మంత్రులు అశోక్‌ చౌధరి, మహేశ్వరీ హజారీ లాంటి నేతలు ఉన్నారు. ఇందులో ఒక రాష్ట్ర మంత్రి తన కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి రావడం గమనార్హం. దర్భంగాలో 8, ఉజియార్‌పుర్‌లో 13, సమస్తీపుర్‌ 12, బెగుసరాయ్‌ 10, ముంగేర్‌లో 12 మంది మెుత్తం 5 నియోజకవర్గాల్లో 55 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత మూడు విడతల పోలింగ్‌లో అత్యల్ప ఓటింగ్‌ నమోదు కావడం వల్ల ప్రజలను పోలింగ్‌ బూత్‌లకు రప్పించేందుకు సీనియర్‌ నేతలు మరింత కష్టపడుతున్నారు.

విజేతను నిర్ణయించేది ముస్లింలే!
మిథిల సంస్కృతికి కేంద్ర స్థానమైన దర్భంగా రాజరిక పాలనలోనే అధిక కాలం కొనసాగింది. మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన దర్భంగా వివిధ నదుల వరదల కారణంగా ఏటా లక్షల మంది ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ ఈ సారి బీజేపీ నుంచి సిటింగ్‌ ఎంపీ గోపాల్‌ జీ ఠాకుర్‌, ఆర్జేడీ నుంచి లలిత్‌ యాదవ్‌, బీఎస్పీ నుంచి నంద్‌ మహావీర్‌ నాయక్‌ తలపడుతున్నారు. దర్భంగా లోక్‌సభ స్థానంలో యాదవులు, ముస్లింలు, బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువ. ముస్లింలే 3.5 లక్షల మంది ఉంటారు. యాదవులు, బ్రాహ్మణులు చెరో 3 లక్షల మంది చొప్పున ఉంటారు. భూమిహార్‌, రాజ్‌పుత్‌లు చెరో లక్ష మంది ఉంటారు. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో గట్టి పోటీ సాగింది. ఈసారీ అదే స్థాయిలో జరిగే అవకాశం కనిపిస్తోంది. యాదవులు, ముస్లింలే విజేతను నిర్ణయించనున్నారు. ఆర్జేడీ సీనియర్‌ నేత లలిత్‌ యాదవ్‌ దర్భాంగాలో మూడోసారి పోటీ చేస్తున్నారు.

ఇక్కడ కార్మికులదే కీలక పాత్ర
భూమిహార్లకు గట్టి పట్టున్న బెగుసరాయ్‌ లోక్‌సభ స్థానంలో 2009 మినహా ప్రతిసారీ ఆ వర్గానికి చెందినవారే ఎన్నికవుతూ వస్తున్నారు. గత 10 ఎన్నికల్లో 9సార్లు ఆవర్గానికి చెందిన వారే ఎన్నికయ్యారు. ఒకప్పుడు బిహార్‌కు పారిశ్రామిక రాజధానిగా వెలుగొందిన బెగుసరాయ్‌లో కార్మికులే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేవారు. లెఫ్ట్‌ పార్టీలకు గట్టి పట్టుండేది. ఆ తర్వాత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతానికి పారిశ్రామిక కళ పోయి పరిశ్రమలు మూతపడ్డాయి. 2009 వరకూ ఇక్కడ సీపీఐ రెండో స్థానంలో నిలిచేది. 2014లో మోదీ హవాలోనూ సీపీఐ అభ్యర్థి 2 లక్షల ఓట్లు సాధించారు.

2019లో ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ విజయం సాధించారు. 2014లోనూ ఆ పార్టీ గెలిచింది. అంతకుముందు ఎన్డీయే భాగస్వామి జేడీయూ విజయం సాధించింది. 2019లో సీపీఐ అభ్యర్థి కన్హయ కుమార్‌ కొంత పోటీ ఇవ్వగలిగారు. ఈసారి మళ్లీ బీజేపీ తరఫున గిరిరాజ్‌ సింగ్‌ పోటీ చేస్తున్నారు. 19 లక్షల ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో 19శాతం భూమిహార్లే ఉన్నారు. మిగిలిన అగ్రవర్ణాల వారు 11 శాతం ముస్లింలు 15శాతం. 12శాతం యాదవులు, 7శాతం కుర్మీలున్నారు. భూమిహార్లు, అగ్రవర్ణాలవారు, కుర్మీల ఓట్లు కలిస్తే 37 శాతం వస్తాయనే నమ్మకంతో బీజేపీ ఉంది. ఇండియా కూటమి తరఫున బరిలో నిలిచిన అవధేశ్‌ కుమార్‌ రాయ్‌ ఈసారి గట్టి పోటీ ఇస్తున్నారు.

ఓబీసీలపై బీజేపీ భారం
డీలిమిటేషన్‌ తర్వాత 2008లో ఏర్పాటైన ఉజియార్‌పుర్‌లో జేడీయూ, బీజేపీలే గెలుస్తూ వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో దళితులు 2లక్షలకుపైగా, కొయిరీ-కుర్మీలు 2లక్షల మంది ఉన్నారు. ఆ తరువాత యాదవులు 1.8 లక్షల మంది ఉన్నారు. ముస్లింలు 10శాతం ఉన్నారు. బ్రాహ్మణులు, భూమిహార్లు గణనీయంగానే ఉన్నారు. ఇక్కడ గతంలో రెండు సార్లు గెలిచిన కేంద్ర మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ మరోసారి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో RLSP తరఫున పోటీ చేసిన ఉపేంద్ర కుశ్వాహా రెండో స్థానంలో నిలిచారు. డీలిమిటేషన్‌ తర్వాత ఈ నియోజకవర్గంలో యాదవుల ప్రాబల్యం తగ్గింది. ప్రస్తుతం ఓబీసీలే ఇక్కడ విజేతను నిర్ణయిస్తున్నారు. ఈసారి ఆర్జేడీ తరఫున సీనియర్‌ నేత అలోక్‌ మెహతా మరోసారి బరిలోకి దిగారు. గత రెండు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించడంలో తమకు ఎవరూ సాయం చేయడం లేదనే అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో ఉంది. విద్యుత్తు సౌకర్యాలు ఈ ప్రాంతంలోని గ్రామాల్లో సరిగా ఉండవు. బీజేపీ ఓబీసీలపై, ఆర్జేడీ ముస్లిం-యాదవ్‌ సమీకరణాలపై ఆధారపడుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో యాదవ్‌ వర్గానికి చెందిన నిత్యానంద్‌ రాయ్‌ వెంట యాదవులు నడిచారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరి వెంట ఉంటారో చూడాలి.

సమస్తీపుర్‌లో విచిత్ర పోటీ- బరిలో ఒకే పార్టీలోని మంత్రుల వారసులు
బిహార్‌లోని అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా గుర్తింపు పొందిన సమస్తీపుర్‌లో ఆసక్తికర పోరాటం నెలకొంది. ఎస్సీ నియోజకవర్గమైన ఇక్కడ నీతీశ్‌ కేబినెట్‌లోని మంత్రి అశోక్‌ చౌధరి కుమార్తె శాంభవి లోక్‌ జన్‌ శక్తి- LJP తరఫున పోటీ చేస్తున్నారు. ఆమెపై మరో రాష్ట్ర మంత్రి మహేశ్వరి హజారీ కుమారుడు సన్నీ హజారీ కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగారు. అయితే ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు మంత్రుల పిల్లలు ప్రత్యర్థులుగా తలపడుతుండటం వల్ల విచిత్రమైన పరిస్థితి నెలకొంది. శాంభవి తరఫున అశోక్‌ తీవ్రంగా ప్రచారం చేస్తుండగా మహేశ్వరి హజారీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. దళితులు అధికంగా ఉండే ఇక్కడ భూమిహార్లు గణనీయంగా ఉంటారు. భూమిహార్‌ వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న LJP అభ్యర్థి శాంభవి దళితులతోపాటు భూమిహార్ల మద్దతు తనకు లభిస్తుందని భావిస్తున్నారు. యాదవులు, ముస్లింల ఓట్లపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధారపడుతున్నారు.

అత్యధిక అక్షరాస్యులు ఏం చేస్తారో?
అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా పేరొందిన బిహార్‌లోని అన్ని నియోజకవర్గాల కంటే ముంగేర్‌లో అత్యధిక అక్షరాస్యులు ఉంటారు. ఇక్కడ అక్షరాస్యత 73.3 శాతంగా ఉంది. దీంతోపాటు ఇక్కడ అనేక ప్రఖ్యాత విద్యా సంస్థలు ఉన్నాయి. ముంగేర్‌లో జేడీయూ తరఫున లలన్‌ సింగ్‌, ఆర్జేడీ తరఫున గ్యాంగ్‌స్టర్‌ అశోక్‌ మహతో భార్య అనితా దేవి మహతో బరిలోకి దిగారు. తాను జైలులో ఉండటం వల్ల అశోక్‌ తన భార్యను రంగంలోకి దించారు. మరోవైపు ఈ ప్రాంతంలో పట్టున్న మరో గ్యాంగ్‌స్టర్‌ అనంత్‌ సింగ్‌ పెరోల్‌పై విడుదలై లలన్‌ సింగ్‌కు మద్దతుగా ప్రచారంలోకి దిగారు. ముంగేర్‌లో 3 లక్షల మంది దళితులున్నారు. ఆ తరువాత ఓబీసీలు 2 లక్షల మంది ఉన్నారు. అగ్రవర్ణాలవారు 2 లక్షల మంది, రాజ్‌పూత్‌లు 1.5 లక్షల మంది ఉన్నారు. ఇక్కడి యాదవులు, ముస్లింలు RJD అధినేత లాలు వెంట నిలుస్తున్నారు. వారు 3 లక్షల వరకూ ఉంటారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పార్టీ రెండు ముక్కలయ్యాక తొలి ఎన్నికలు- ముంబయి ప్రజలు ఎవరివైపు ఉన్నారో? - Lok Sabha Elections 2024

యూపీలో ఫేజ్​-4పై ఉత్కంఠ- SP, BSP టఫ్​ ఫైట్​- BJP క్లీన్​స్వీప్ రికార్డ్ ఈసారి కష్టమే! - lok sabha elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.