ETV Bharat / opinion

యూపీలో ఫేజ్​-4పై ఉత్కంఠ- SP, BSP టఫ్​ ఫైట్​- BJP క్లీన్​స్వీప్ రికార్డ్ ఈసారి కష్టమే! - lok sabha elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 2:30 PM IST

Interesting Seats Of UP In Fourth Phase : దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలి మూడు విడతల్లో 26 సీట్లకు పోలింగ్‌ పూర్తైంది. నాలుగో విడతలో భాగంగా 13 స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ 13 స్థానాలనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. అయితే ఈ దఫా పలు స్థానాల్లో బీజేపీకు గట్టి పోటీ తప్పదని తెలుస్తోంది. నాలుగో విడతలో యూపీలో ఆసక్తికర పోరు ఉండే సీట్లను ఇప్పుడు చూద్దాం.

Interesting Seats Of UP In Phase 4
Interesting Seats Of UP In Phase 4 (ETV Bharat)

Interesting Seats Of UP In Fourth Phase : దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌. అక్కడ మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ప్రధాన పార్టీలు ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధిక సీట్లు రాబట్టేందుకు యత్నిస్తాయి. గత ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ 62 సీట్లలో గెలుపొందింది. ఈ దఫా "చార్‌ సౌ పార్" నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తున్న కమలం పార్టీ, గతంలో కంటే ఎక్కువ స్థానాలను యూపీలో గెలవాలని భావిస్తోంది. యూపీలో ఇప్పటికే తొలి మూడు విడతల్లో 26 స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది. మే 13న షాజహాన్‌పుర్, ఖేరి,ధౌరహర, సీతాపూర్, హర్దోయి, మిస్రిఖ్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఇటావా, కన్నౌజ్, కాన్పూర్, అక్బర్‌పూర్, బహ్రాయిచ్‌ సీట్లకు ఓటింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో ఈ అన్ని స్థానాల్లో బీజేపీ విజయభేరి మోగించింది. అయితే ఇందులోని కొన్ని స్థానాల్లో ఈ సారి కమలం పార్టీకి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

కన్నౌజ్​లో స్వయంగా బరిలోకి అఖిలేశ్
కన్నౌజ్ లోక్‌సభ స్థానంలో పోరు రసవత్తరంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ-SP కంచుకోటగా భావించే ఈ సీటులో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 1998 నుంచి 2014 వరకు ఈ స్థానం SP చేతిలోనే ఉండేది. 2019 ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా ఈ సీటును దక్కించుకుంది. బీజేపీ నేత సుబ్రత్ పాఠక్ 12,353 ఓట్ల స్వల్ప తేడాతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్‌పై గెలుపొందారు. ఈసారి ఎలాగైనా కన్నౌజ్‌ను దక్కించుకోవాలని భావిస్తున్న అఖిలేశ్ యాదవ్ స్వయంగా తనే పోటీకి దిగారు. తొలుత కన్నౌజ్‌లో అఖిలేశ్‌ మేనల్లుడు తేజ్‌ప్రతాప్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. కార్యకర్తలు, పలువురు నేతల నుంచి తలెత్తిన అసంతృప్తి కారణంగా స్వయంగా అఖిలేశ్ బరిలో నిలిచారు.

కన్నౌజ్‌లో అఖిలేశ్ యాదవ్ మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు. తొలిసారి 2000 సంవత్సరంలో విజయం సాధించిన ఆయన ఆ తర్వాత 2004, 2009లోనూ గెలుపొందారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ గెలుపొందడం వల్ల కన్నౌజ్ లోక్‌సభ స్థానానికి అఖిలేశ్ రాజీనామా చేశారు. ఆ సమయంలో ఈ స్థానాన్ని ఆయన సతీమణి డింపుల్ యాదవ్‌కు అప్పగించారు. 2012 ఉపఎన్నిక, 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన డింపుల్ 2019లో మాత్రం ఓటమిపాలయ్యారు. అయితే మరోసారి అఖిలేశ్‌ రాకతో ఈ స్థానంలో పోరు ఆసక్తిగా మారింది. బీజేపీ నుంచి మరోసారి సుబ్రత్ పాఠక్ బరిలో ఉన్నారు. BSP నుంచి ఇమ్రాన్‌ బిన్ జాఫర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు సమాజ్‌వాదీ పార్టీకి కలిసొచ్చే అంశమని తెలుస్తోంది.

సీతాపుర్​ బీఎస్పీదే!
సీతాపుర్ లోక్‌సభ స్థానంలో ఒకప్పుడు బహుజన్ సమాజ్‌ పార్టీ-BSPకి పట్టు ఉండేది. 1999 నుంచి 2009 వరకు BSP అభ్యర్థులే ఇక్కడ గెలిచారు. BSPలో దాదాపు 22 ఏళ్ల పాటు ముఖ్య నేతగా ఉన్న రాజేశ్ వర్మ 2013లో బీజేపీలోకి వెళ్లారు. అంతకుముందు ఆయన ఇదే స్థానం నుంచి 1999, 2004 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి గెలిచారు. కమలం పార్టీలో చేరాక 2014లో సీతాపుర్‌ నుంచి పోటీ చేసి బీఎస్పీ అభ్యర్థిపై లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019లోనూ ఆయనే గెలిచారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాజేశ్ వర్మ చేతిలో దాదాపు లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయిన BSP నేత నకుల్ దూబే ఈ సారి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. BSP నుంచి మహేంద్ర సింగ్ యాదవ్ బరిలో నిలిచారు. దీంతో ఈ స్థానంలో పోరు ఆసక్తిగా మారింది.

ఉన్నావ్​లో కథ మారుతుందా?
ఉన్నావ్ లోక్‌సభ స్థానంలో గత రెండు ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో నిలిచిన సాక్షి మహారాజ్‌ గెలుపొందారు. వివాదాస్పద వ్యక్తిగా పేరున్న ఆయనకే మరోసారి కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. మరోసారి గెలుస్తామని ఆయన ధీమాగా ఉన్నారు. SP నుంచి గత రెండు ఎన్నికల్లో సాక్షి మహారాజ్‌కు గట్టి పోటి ఇచ్చిన అరుణ్ శంకర్ శుక్లాకు బదులుగా ఈ సారి అను టాండన్ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అను టాండన్ ఎస్పీలోకి చేరారు. BSP నుంచి అశోక్ కుమార్ పాండే బరిలో ఉన్నారు. ఈ స్థానంలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.

షాజహాన్‌పుర్- ముచ్చటగా మూడోసారి బీజేపీ!
షాజహాన్‌పుర్ లోక్‌సభ స్థానంలో గత రెండు ఎన్నికల్లో బీజేపీనే గెలుపొందింది. ప్రముఖ నేత, సిట్టింగ్ ఎంపీ అరుణ్ కుమార్ సాగర్ మరోసారి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో BSP అభ్యర్థి అమర్ చంద్రపై 2 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. మరోసారి గెలుస్తామని ధీమాగా ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి రాజేశ్ కశ్యప్‌కు తొలుత టికెట్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల తర్వాత జ్యోత్స్న గోండ్‌ను అభ్యర్థిగా నిలిపారు. బీఎస్పీ నుంచి దౌద్రామ్ వర్మ పోటీలో ఉన్నారు. SP నుంచి టికెట్ వచ్చి కోల్పోయిన రాజేశ్ కష్యప్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో షాజహాన్‌పుర్ లోక్‌సభ పోరు రసవత్తరంగా మారింది.

SP, BSP కలిసి బీజేపీకి టక్కర్!
కాన్పుర్‌లో గత ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధించింది. అయితే సిట్టింగ్ ఎంపీ సత్యదేవ్‌కు బదులు మాజీ పాత్రికేయులు రమేశ్ అవస్థీకి బీజేపీ టికెట్ ఇచ్చింది. పారిశ్రామిక నియోజకవర్గమైన కాన్పుర్‌లో 12 శాతం ఎస్సీ ఓటర్లుంటారు. వీరి ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి. ఇక సమాజ్‌వాదీ పార్టీ అండతో కాంగ్రెస్ పార్టీ అలోక్‌ మిశ్రాను బరిలో దింపింది. BSP కుల్దీప్ బదౌరియాను పోటీలో ఉంచింది. గత రెండు ఎన్నికల్లో వేర్వేరు అభ్యర్థుల్ని నిలిపి విజయం సాధించిన బీజేపీ ఈ దఫా అదే కొనసాగుతుందని ధీమాగా ఉంది. అయితే SP, BSP అభ్యర్థుల నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతుందని తెలుస్తోంది.

హ్యాట్రిక్​పై కేంద్ర మంత్రి కన్ను
ఖేరి లోక్‌సభ స్థానంలో గత రెండు ఎన్నికల్లో కమలం పార్టీనే విజయం సాధించింది. బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేని ఇక్కడ నుంచి గెలుపొందారు. ఈ సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు. అయితే ఇండియా కూటమి అభ్యర్థి ఉత్కర్ష్ వర్మ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురుకానున్నట్టు తెలుస్తోంది. బీఎస్పీ నుంచి అన్షయ్ కల్రా బరిలో ఉన్నారు.

నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 13 స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. ఐదు, ఆరో విడతల్లో 14 సీట్ల చొప్పున, ఏడో విడతలో 13 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాయ్‌బరేలీలోనే రాహుల్ ఎందుకు? కాంగ్రెస్​ ఉద్దేశమేంటి? ప్రియాంక వల్లేనా! - Lok Sabha Elections 2024

యాదవుల అడ్డాలో బీజేపీ గట్టి సవాల్- సమాజ్​వాదీ కంచుకోటలో విజేత ఎవరో? - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.