తెలంగాణ

telangana

మునుగోడులో మూడు పార్టీల ముమ్మర ప్రచారం.. రంగంలోకి సీనియర్లు

By

Published : Oct 23, 2022, 8:55 AM IST

Munugode Election campaign of all parties: మునుగోడు ఉపఎన్నికకు పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను కలుసుకుంటున్న అభ్యర్థులు ఉపఎన్నికల్లో తమని గెలిపించాలంటూ అభ్యర్థిస్తున్నారు. ప్రధాన పార్టీల సీనియర్‌ నేతలు పర్యటనలతో నియోజకవర్గమంతా సందడిగా మారింది. తమ పార్టీని గెలిపించాలంటూ హామీలతో ప్రజల్లోకి వెలుతున్నారు.

Munugode Election campaign of all parties
Munugode Election campaign of all parties

మునుగోడులో మూడు పార్టీల ముమ్మర ప్రచారం.. రంగంలోకి సీనియర్లు

Munugode Election campaign of all parties: మునుగోడు ఉపఎన్నికకు క్షేత్రస్థాయిలో ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. పోలింగ్ గడువు దగ్గర పడుతున్నకొద్దీ... నేతలు విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఊరూరా మోహరించిన నేతలు ఇంటింటి ప్రచారం సాగిస్తుండగా.. రాష్ట్రస్థాయి నాయకత్వం గెలుపు ప్రణాళికలు రచిస్తోంది. కూసుకుంట్లను గెలిపించాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడు ఓటర్లను కలుసుకుంటున్నారు. చండూర్‌లో ప్రచారం చేసిన మంత్రి ఎర్రబెల్లి కూసుకుంట్లకే ఓటు వేయాలంటూ ప్రజలను కోరారు.

ఈ క్రమంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎర్రబెల్లి సమక్షంలో తెరాసలో చేరారు. నియోజకవర్గ అభివృద్ధికి తెరాసను గెలిపించాలని మంత్రి కోరారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. భాజపా అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి ఊరూరా తిరుగుతుండగా మద్దతుగా ఆయన సతీమణి లక్ష్మీమునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. కిష్టాపురం, ఇప్పర్తి, ఉకొండి గ్రామాల్లో పర్యటించిన లక్ష్మీ ఉప ఎన్నికలో భాజపాను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

మునుగోడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేసిన కేంద్రమంత్రి కిషన్​రెడ్డి భాజపాకు ఓటువేయాలని ప్రజల్ని కోరారు. తెరాసపై విమర్శలు గుప్పించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ జైకేసారంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నర్సయ్య గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్​ను విమర్శిస్తుండగా తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. భాజపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాల ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా తోపులాట చోటుచేసుకుంది.

పరస్పర అనుకూల, వ్యతిరేక నినాదాలతో కొద్దిసేపు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. చండూరులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రచారం చేశారు. అమరవీరుల కుటుంబాలకు తెరాస సర్కార్ అన్యాయం చేసిందని ఆరోపించారు. ఉపఎన్నికల్లో ఉంగరం గుర్తుకే ఓటు వేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details