ETV Bharat / state

మునుగోడులో హోరెత్తుతున్న పార్టీల ప్రచారం.. వాడీ వేడిగా నేతల విమర్శలు..!!

author img

By

Published : Oct 22, 2022, 10:07 PM IST

Updated : Oct 22, 2022, 10:28 PM IST

Munugode
Munugode

Munugode Bypoll: పార్టీల్లో చేరికలతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతుండగా.. అదేస్థాయిలో మునుగోడులో ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో.. ప్రధాన పార్టీల నాయకత్వమంతా మునుగోడుపైనే దృష్టి సారించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ముఖ్యనేతలు రోడ్ షోలు నిర్వహిస్తుండగా.. పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికకు క్షేత్రస్థాయిలో ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో వ్యూహ, ప్రతివ్యూహాలు, ప్రధాన పార్టీలు ఓట్ల వేట సాగిస్తున్నాయి. ఊరారా మోహరించిన నేతలు, శ్రేణులు తెల్లవారుజామునే ఇంటింటి ప్రచారం సాగిస్తుండగా.. రాష్ట్రస్థాయి నాయకత్వం గెలుపు ప్రణాళికలు రచిస్తున్నారు. మునుగోడులో ప్రత్యర్థులకు అవకాశమివ్వొద్దనే లక్ష్యంతో జోరుగా ప్రచారం సాగిస్తున్న అధికార పార్టీ నేతలు.. ఇంటింటికి వెళ్లి తమ అభ్యర్థి కూసుకుంట్లకు గెలిపించాలని కోరుతున్నారు.

చండూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. నాంపల్లి మండలం చిట్టెంపాడులో కూసుకుంట్ల ప్రచారం నిర్వహించారు. కల్వకుంట్లలో ఎమ్మెల్సీ తాతమధు, తెరాస నేత బాలరాజ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో యాదవుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. చండూరులో దుకాణదారులను కలిసిన పర్యాటక కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా తెరాసకే ఓటేయాలని అభ్యర్థించారు. నారాయణపురం పొర్లుగడ్డ తండా పరిధిలోని ఆవాసాల్లో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గిరిజనులకు రిజర్వేషన్‌ సహా అనే సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని వివరించారు.

ప్రజలు ఇచ్చే తీర్పే రేపటి తెలంగాణ భవిష్యత్తుకు నాంది.. భాజపా సైతం జోరుగా ప్రచారం చేస్తోంది. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నాంపల్లి మండలంలోని పగిడిపల్లిలో ప్రచారం నిర్వహించారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పే రేపటి తెలంగాణ భవిష్యత్తుకు నాందిగా పేర్కొన్నారు. చండూరు పురపాలిక పరిధిలోని అంగడిపేటలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనానికి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఉత్తర్‌ప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి సంజయ్ నిషాన్ హాజరయ్యారు. మత్స్యకారుల అభివృద్ధికి కేంద్రం తీసుకున్న చర్యలు వివరించారు. ఇతర పార్టీల నేతలను కేసీఆర్ కొంటున్న తీరుతో తెరాస శ్రేణులే ఏవగించుకుంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు.

కాంగ్రెస్ గెలుపు ఖాయం.. మునుగోడులో కాంగ్రెస్ గెలుపు ఖాయమని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. ఎవరేం మాట్లాడినా ఓటర్లు పట్టించుకోరని అన్నారు. ఉపఎన్నిక వేళ డబ్బు, మద్యం పంపిణీని కట్టడి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు.. ఎక్కడికక్కడ విస్తృత తనిఖీలు చేస్తున్నారు. చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ నుంచి వస్తున్న కారులో 20లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మునుగోడులో హోరెత్తుతున్న పార్టీల ప్రచారం.. వాడీ వేడిగా నేతల విమర్శలు..!!

ఇవీ చదవండి:

Last Updated :Oct 22, 2022, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.