తెలంగాణ

telangana

JEE Exam 2022 : పరీక్షకు అరగంట ముందు సెంటర్ మార్పు

By

Published : Jul 25, 2022, 12:21 PM IST

JEE Exam 2022 : నిజామాబాద్ జిల్లాలో జేఈఈ మెయిన్ పరీక్షలో గందరగోళం నెలకొంది. పరీక్షకు అరగంట ముందు సెంటర్‌లో మార్పు చేసినట్లు చెప్పడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. ముందుగా వచ్చిన విద్యార్థులను మార్పు చేసిన పరీక్షా కేంద్రానికి తరలించారు. చివరి నిమిషంలో వచ్చిన విద్యార్థులకు మాత్రం అక్కడే పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించారు. పరీక్ష ముందు ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో విద్యార్థులంతా ఆందోళన చెందారని.. ఇది వారి పరీక్షపై ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

JEE Exam 2022
JEE Exam 2022

JEE Exam 2022 : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్‌లోని క్షత్రియ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన జేఈఈ మెయిన్‌ పరీక్ష కేంద్రం మార్పు చేస్తున్నట్లు చివరి నిమిషంలో చెప్పారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 28 మంది విద్యార్థులకు నిజామాబాద్ మాణిక్ బండారు వద్ద ఉన్న కాకతీయ ఉమెన్స్ కాలేజ్‌కు మారుస్తున్నట్లు సమాచారం చివరి నిమిషంలో వచ్చింది. అది చూసుకోక విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రానికి రెండు రోజుల ముందు డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్ టికెట్లతో వచ్చారు.

పరీక్షా కేంద్రం మారుస్తున్నట్లు చెప్పిన ఎన్‌టీఏ అధికారులు .. అక్కడ రెండు వాహనాలను ఏర్పాటు చేశారు. కొంత మందిని నిజామాబాద్ కేంద్రానికి తరలించగా చివరి నిమిషంలో వచ్చిన ఇద్దరికీ అక్కడే రాసేందుకు వీలు కల్పించారు. ఎన్‌టీఏ అధికారుల నిర్వాహకంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇలాంటి నిర్ణయాలతో తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని వాపోయారు. 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా కొంత మందికి తొమ్మిది గంటల 20 నిమిషాలకు మెయిల్ ద్వారా మెసేజ్ వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా సెంటర్‌ను మారుస్తున్నట్లు ఫోన్ ద్వారా ఒకరోజు ముందు మెసేజ్‌ పంపడం సరికాదని పేర్కొన్నారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్‌టీఏ అధికారులు ఏర్పాట్లు చేశారని కళాశాల వైస్ ప్రిన్సిపల్ నరేందర్ తెలిపారు. చివరి నిమిషంలో వచ్చిన ఇద్దరు విద్యార్థులకు ఇక్కడే రాసేందుకు వీలు కల్పించామని చెప్పారు. వారితో కలిపి మొత్తం 51 మంది విద్యార్థులు ఇవాళ పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details